Begin typing your search above and press return to search.

ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లవ కుశలు.. సరైన పోలిక!

వినోద్, వివేక్ సోదరులను చూస్తుంటే తనకు రామాయణంలో లవకుశలు గుర్తొస్తారని అన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.

By:  Tupaki Desk   |   22 Dec 2023 4:30 PM GMT
ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లవ కుశలు.. సరైన పోలిక!
X

ఉమ్మడి ఏపీలో.. తెలంగాణ రాజకీయాల్లో ఆయనది ప్రత్యేక చరిత్ర. సాధారణ కుటుంబం నుంచి వచ్చి రాజకీయాల్లోకి అడుగుపెట్టి కాంగ్రెస్ అధిష్ఠానానికి అత్యంత నమ్మకస్తుడై.. కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగిన వ్యక్తి ఆయన. ఎన్నో సందర్భాల్లో తెలంగాణ కోసం గళమెత్తిన చరిత్ర ఆయనది. ఏకంగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలోనే తెలంగాణ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేసిన విశిష్ఠత ఆయన సొంతం. అలాంటి నాయకుడి ఇద్దరు కుమారులూ రాజకీయాల్లో అడుగుడి తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు.

కాంగ్రెస్ కే కాకా ..

జి.వెంకటస్వామి.. కాంగ్రెస్ నాయకులందరూ కాకా అని పిలుచుకునే వ్యక్తి. 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఆయన స్వరాష్ట్రాన్ని కళ్లచూసి చనిపోతాను అనేవారు. చివరకు అలానే 2014 డిసెంబరు 22న కన్నుమూశారు. అంటే.. సరిగ్గా 9 ఏళ్ల కిందట వెంకటస్వామి చనిపోయారు. పేదల తరఫున పోరాటాలు చేసిన నాయకుడిగా వెంకటస్వామికి పేరుండేది. నిరుపేదలకు గూడు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వ స్థలాల్లో వారికి గుడిసెలు వేయించేవారు. దీంతో ఆయనకు గుడిసెల వెంకటస్వామి అనే పేరు వచ్చింది. కాగా, కాకాకు ఇద్దరు కుమారులు. వీరిలో వినోద్ పెద్దవారు కాగా, వివేక్ చిన్నవారు.

వినోద్ 1999లోనే చెన్నూర్ నుంచి పోటీ చేయడం ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టగా, వివేక్ 2009లో పెద్దపల్లి నుంచి ఎంపీగా గెలుపొందారు. వినోద్ 2004లో తొలిసారి గెలిచి రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. అయితే, 2014కు కొద్దిగా ముందర వివేక్ బీఆర్ఎస్ లో చేరారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఇచ్చేసరికి మళ్లీ హస్తం గూటికి చేరారు. 2014 ఎన్నికల్లో పోటీ చేసి పరాజయం పాలయ్యారు. 2019 ఎన్నికల తర్వాత బీజేపీలో చేరారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల ముంగిట మళ్లీ కాంగ్రెస్ లోకి వెళ్లి చెన్నూరు నుంచి గెలుపొందారు. ఇక వినోద్ సైతం బెల్లంపల్లి నుంచి విజయం సాధించారు.

అన్నదమ్ములిద్దరూ ఒకేసారి అసెంబ్లీలో

వివేక్ వినోద్ 20 ఏళ్లుగా రాజకీయాల్లో ఉంటున్నా.. ఒకేసారి అసెంబ్లీలో అడుగుపెట్టింది మాత్రం ఇప్పుడే కావడం విశేషం. కాంగ్రెస్ నుంచి కోమటిరెడ్డి సోదరులు, గడ్డం సోదరులు ఒకేసారి అసెంబ్లీలో ఉండడమూ గమనార్హం. కాగా, వివేక్ పలు వ్యాపారాలను విజయవంతంగా నిర్వహిస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు. వినోద్ రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరికీ మంత్రి పదవి దక్కలేదు. గడ్డం సోదరుల్లో ఎవరిని వరిస్తుందో చూడాలి.

రామాయణంలో లవకుశలు..

వినోద్, వివేక్ సోదరులను చూస్తుంటే తనకు రామాయణంలో లవకుశలు గుర్తొస్తారని అన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్‌ బాగ్‌ లింగంపల్లిలోని డాక్టర్ బీఆర్‌ అంబేడ్కర్‌ న్యాయ కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం, గ్రాడ్యుయేషన్ డేకు రేవంత్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కళాశాలను వెంకటస్వామి స్థాపించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరు పెట్టారు. ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దిన ఘనత కాకా వెంకటస్వామిది అని.. దేశ నిర్మాణంలో సామాజిక బాధ్యతను నిర్వర్తించారని సైతం రేవంత్ కొనియాడారు. లాభాపేక్ష లేకుండా విద్యార్థులకు విద్యనందిస్తున్న ఘనత కాకా కుటుంబానిదని ప్రశంసిచారు.