Begin typing your search above and press return to search.

మోడీ సర్కారుకు షాక్.. ఆమెకు ఇచ్చిన జాతీయ అవార్డులన్నీ వెనక్కి

తాజాగా వినేశ్ ఫోగాట్ కూడా తనకు వచ్చిన జాతీయ అవార్డుల్ని వెనక్కి ఇచ్చేస్తానని ప్రకటించారు. దీనికి సంబంధించిన ఒక లేఖను ఆమె సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

By:  Tupaki Desk   |   27 Dec 2023 5:08 AM GMT
మోడీ సర్కారుకు షాక్.. ఆమెకు ఇచ్చిన జాతీయ అవార్డులన్నీ వెనక్కి
X

ఎవరేం అన్నా పట్టించుకోకుండా.. ఎంతటి ఆరోపణలు చేసినా స్పందించకుండా.. తమ పార్టీ నేతల ప్రయోజనాలకు పెద్ద పీట వేసే ధోరణి మోడీ సర్కారుకు మరకగా మారింది. మిగిలిన విషయాల్లో ఎలా ఉన్నా.. సొంత పార్టీకి చెందిన బలమైన నేతలపై వచ్చే ఆరోపణలు.. విమర్శల విషయంలో మోడీ సర్కారు స్పందన నానాటికి తీసికట్టుగా మారుతోంది. అందరూ వేలెత్తి చూపించే అంశాల విషయంలోనూ మోడీ సర్కారు మొద్దు నిద్ర పోయిన చందంగా ఎలాంటి స్పందన లేకపోవటాన్ని తప్పు పడుతున్నారు. లైంగిక వేధింపుల ఆరోపణలతో భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ పై మొదలైన న్యాయపోరాటం.. ఆయన ఆ పదవి నుంచి తప్పుకున్నా.. కొత్తగా ఎన్నికైన ప్యానెల్ మొత్తం ఆయన కనుసన్నల్లో ఎంపిక కావటం జీర్ణించుకోలేనిదిగా మారింది.

దీంతో తమ ఆందోళననకు మరింత ముమ్మరం చేసిన రెజ్లర్లు.. తాము ఆట నుంచి రిటైర్మెంట్ ప్రకటిస్తే.. మరికొందరు తమకు ఇప్పటికే లభించిన అత్యుత్తమ పురస్కారాల్ని వెనక్కి ఇచ్చేసేందుకు వెనుకాడని పరిస్థితి. ఈ జాబితాలో ఇప్పటికే అంతర్జాతీయ క్రీడాకారులు పలువురు ఉండటం గమనార్హం. లైంగిక వేధింపులపై బ్రిజ్ మీద న్యాయపోరాటం చేస్తున్న వారిలో సాక్షి మాలిక్.. బజ్ రంగ్ పునియా.. వినేశ్ ఫొగాట్ తదితరులు తీవ్రంగా పోరాడారు.

తమకు వచ్చిన జాతీయ పురస్కారాలను.. పద్మ పురస్కారాల్ని సైతం వెనక్కి ఇచ్చేందుకు వెనుకాడని పరిస్థితి. ఇటీవల జరిగిన డబ్ల్యూఎఫ్ఐ ఎన్నికల్లో బ్రిజ్ కు సన్నిహితుడైన సంజయ్ సింగ్ ఎన్నిక కావటాన్ని నిరసించారు. ఇందులోభాగంగా తాను రెజ్లింగ్ నుంచి వైదొలుగుతున్నట్లుగా సాక్షి మాలిక్ పేర్కొంటే.. ఆమెకు మద్దతుగా బజరంగ్ పునియా తన పద్మశ్రీ పురస్కారాన్ని వెనక్కి ఇచ్చేశారు.

బధిరుల ఒలింపిక్స్ లో పసిడి విజేత వీరేందర్ సింగ్ సైతం తన పద్మశ్రీ పురస్కారాన్ని వెనక్కి ఇచ్చేస్తానని ప్రకటించారు. తాజాగా వినేశ్ ఫోగాట్ కూడా తనకు వచ్చిన జాతీయ అవార్డుల్ని వెనక్కి ఇచ్చేస్తానని ప్రకటించారు. దీనికి సంబంధించిన ఒక లేఖను ఆమె సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అందులో ప్రధాని మోడీని ఉద్దేశించి ఆమె లేఖ రాయటం గమనార్హం. ఇందరు ఇంతలా స్పందిస్తున్నా.. వేగవంతమైన చర్యల విషయంలో మోడీ సర్కారు మౌనంగా ఉంటోంది. ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలతో రెజ్లింగ్ సమాఖ్య విషయంలో దూరంగా ఉండాలన్న సందేశాలు బ్రిజ్ కు అందటంతో ఆయన కాస్త తగ్గారు.

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తన ఫోకస్ అంతా యూపీ మీదనే ఉందంటూ వ్యాఖ్యలు చేయగా.. కొత్తగా ఎన్నికైన సంజయ్ సింగ్ ప్యానెల్ ను కేంద్ర క్రీడా మంత్రిత్వశాఖ సస్పెండ్ చేసినప్పటికీ.. దాన్ని తొలగించకుండా ఉండటాన్ని తప్పుపడుతున్నారు. మొత్తంగా తమ న్యాయపోరాటంలో భాగంగా మరెందరు క్రీడాకారులు మరెన్ని త్యాగాలు చేస్తే కానీ మోడీ సర్కారుకు చురుకు తగులుతుందో చూడాలి.