జగన్ పథకం వర్సస్ కూటమి: పొలిటికల్ రచ్చ.. !
వైసీపీ అధినేత జగన్ ఆలోచనల నుంచి పుట్టిన ఓ కీలక పథకాన్ని ఆయన అమలు చేయలేకపోయారు.
By: Garuda Media | 30 Aug 2025 8:15 AM ISTవైసీపీ అధినేత జగన్ ఆలోచనల నుంచి పుట్టిన ఓ కీలక పథకాన్ని ఆయన అమలు చేయలేకపోయారు. అయితే జగన్ ప్రభుత్వాన్ని, జగన్ ను కూడా తీవ్ర స్థాయిలో విమర్శించే కూటమి పాలకులు మాత్రం ఇప్పుడు ఆ ఆలోచనను అమలు చేసేందుకు సిద్ధపడటం పార్టీల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఇప్పటివరకు జగన్ను అనేక రూపాల్లో విమర్శించి ఆయన పాలనను తిట్టిపోసిన తర్వాత మళ్లీ ఆయన అనుసరించిన మార్గాన్ని ఆయన ఆలోచనను మనం అందిపుచ్చుకోవటం ఏంటి అన్నది కూటమిలోని నాయకులు ప్రశ్నిస్తున్నారు.
ఇలా చేయడం వల్ల ప్రజలకు మనం ఎలాంటి సంకేతాలు ఇస్తున్నామన్నది వారి ప్రశ్న. ఇక, తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం.. గ్రామాల్లో విలేజ్ క్లినిక్ ల పేరుతో వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అంటే, ప్రతి గ్రామంలోనూ రెండు విలేజ్ క్లినిక్ల పేరుతో వైద్యశాలలను ఏర్పాటు చేయాలన్నది ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. తద్వారా గ్రామాల్లో వైద్యాన్ని మరింత చెరువ చేయడంతో పాటు సీజనల్ వ్యాధులు రాకుండా గ్రామీణులకు ఇబ్బంది లేకుండా వాళ్ళు సుదీర్ఘ ప్రయాణం చేసి నగరాలకు వచ్చి వైద్యం పొందే ఇబ్బందులు కలగకుండా వారికి చెరువలోనే వైద్యశాలలను ఏర్పాటు చేయాలన్నది ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం.
వాస్తవానికి ఇది వైసిపి హయంలోనే తెరమీదకు వచ్చింది. అప్పటి సీఎం జగన్ పదేపదే విలేజ్ క్లినిక్లను ఏర్పాటు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. కానీ, అనూహ్యంగా ఈ నిర్ణయం అమలు చేయలేక పోయారు. ఎన్నికల సమయం వరకు దీనిపై అనేక చర్చలు నివేదికలు తెప్పించుకోవడంతోనే సమయం గడిచిపో యింది. ఈ లోగా ఎన్నికలు రావడం ప్రభుత్వం పడిపోవడం తెలిసిందే. ఇక, తర్వాత ఈ వ్యవహారం దాదా పుగా తర్జన భర్జనకు గురైంది.
ఇక, ఇప్పుడు మళ్లీ గ్రామాల్లో విలేజ్ క్లినిక్లను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం కావడం దీనిపై ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ సంచలన ప్రకటన చేయడం వంటివి కూటమి పార్టీలను విస్మయానికి గురిచేసాయి. ప్రజలకు వైద్యాన్ని చేరువ చేయడం తప్పు కాకపోయినప్పటికీ వైసీపీ అమలు చేస్తామని ప్రకటించినటువంటి పథకాన్ని మనం భుజాన ఎత్తుకోవడం ద్వారా వ్యతిరేక సంకేతాలు వచ్చే అవకాశం ఉందని నాయకులు అంటున్నారు. ఇప్పటివరకు జగన్ పరిపాలన, వైసీపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన మనం అనూహ్యంగా ఇప్పుడు జగన్ హయాంలో చేపట్టాలని భావించిన పథకాన్ని భుజానికి ఎత్తుకోవాల్సిన అవసరం ఎందుకని కొందరు ప్రశ్నిస్తున్నారు,
ఇక, ఈ కార్యక్రమం విషయానికి వస్తే 4,472 గ్రామాల్లో విలేజ్ క్లినిక్లను ఏర్పాటు చేయాలన్నది గత వైసీపీ ప్రభుత్వ లక్ష్యం. దీనికి అప్పట్లో 1000 కోట్ల రూపాయలు బడ్జెట్ ఖర్చు అవుతుందని భావించారు. కానీ ఇంతలో ఎన్నికలు రావడంతో ఈ ప్రతిపాదన వెనక్కి వెళ్లిపోయింది. ఇప్పుడు కూడా అదే సంఖ్యలో గ్రామాల్లో వైద్యశాలలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పుడు బడ్జెట్ 1200 కోట్లకు పెరిగింది. అయినా సరే కేంద్ర నుంచి సహకారం తీసుకుని దీన్ని అమలు చేయాలని భావిస్తోంది.
ప్రజలకు మేలు చేయాలి అనుకున్న నిర్ణయాలను తప్పుపట్టాల్సిన అవసరం లేదన్నది చంద్రబాబు ఆలోచన. ఇటీవల తల్లికి వందనం పథకంలో కూడా వైసిపి హయాంలో అమలు చేసిన నిబంధనలే కొనసాగించారు. అదేవిధంగా రైతులకు సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీ విషయంలోనూ గత వైసిపి అనుసరించిన విధానాన్ని ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నారు. దీంతో ఇప్పుడు గ్రామాల్లో విలేజ్ క్లినికల్ వ్యవహారం కూడా అనుకూలంగానే మారుతుందని చంద్రబాబు భావిస్తున్నారు. మరి దీనిపై స్థానికంగా వస్తున్న విమర్శలు ఏ మేరకు చంద్రబాబును ప్రభావితం చేస్తాయో చూడాలి.
