Begin typing your search above and press return to search.

టార్గెట్ విక్రమ్ మిస్రి ఇష్యూ... నెటిజన్లకు విపక్షాల సూచనలు!

మైకుల ముందు మాట్లాడేవారే అన్ని నిర్ణయాలూ తీసుకుంటారని.. మీడియాని అడ్రస్ చేసే వారే అ నిర్ణయాలకు కారకులని చాలామంది అభిప్రాయ పడుతుంటారు.

By:  Tupaki Desk   |   12 May 2025 10:48 AM IST
టార్గెట్  విక్రమ్  మిస్రి ఇష్యూ...  నెటిజన్లకు విపక్షాల సూచనలు!
X

మైకుల ముందు మాట్లాడేవారే అన్ని నిర్ణయాలూ తీసుకుంటారని.. మీడియాని అడ్రస్ చేసే వారే అ నిర్ణయాలకు కారకులని చాలామంది అభిప్రాయ పడుతుంటారు. కొన్నిసార్లు అపార్థాలూ చేసుకుంటారు. ఈ నేపథ్యంలోనే భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రిని టార్గెట్ చేశారు కొంతమంది నెటిజన్లు. దీనిపై విపక్షాలు మండిపడుతున్నాయి.. బీజేపీ బాధ్యతను గుర్తు చేస్తున్నాయి.

అవును... శనివారం పాక్ తో భారత్ కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత ఆన్ లైన్ వేదికగా పలువురు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రిని టార్గెట్ చేశారు. చాలా మంది ఆయన కుటుంబాన్ని, ఆయన కుమార్తెలను లక్ష్యంగా చేసుకున్నారు. ఆపరేషన్ సిందూర్ నడుస్తున్న సమయంలో పాక్ తో కాల్పుల విరమణ ప్రకటన వచ్చినప్పటి నుంచి ఈ ట్రోలింగ్ స్టార్ట్ అయ్యింది!

ఇలా ఆపరేషన్ సిందూర్ అంతటా ప్రెస్ బ్రీఫింగ్ కు నాయకత్వం వహించన విక్రమ్ మిస్రిని ఇలా పలువురు నెటిజన్లు ట్రోలింగ్ చేయడంపై పలువురు అధికారులు, సీనియర్ దౌత్యవేత్తలు, నాయకులు మండిపడ్డారు. ఈ సమయంలో విపక్ష నాయకులు బీజేపీ బాధ్యతను గుర్తు చేశారు. ఆయనను కాపాడాల్సిన బాధ్యతను ఎత్తి చూపారు!

ఇందులో భాగంగా.. విక్రమ్ మిస్రి ట్రోలింగ్ పై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ఆయన ఓ మంచి నిజాయితీపరుడైన, కష్టపడి పనిచేసే దౌత్యవేత్త అని.. ఆయన మన దేశం కోసం అవిశ్రాంతంగా పనిచేస్తున్నారని అన్నారు. అలాంటి నిజాయితీపరుడు, కష్టపడి పనిచేసే అధికారిపై దాడి చేయడం సరైంది కాదని సూచించారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే... మన పౌర సేవకులు (ఉద్యోగులు).. కార్యనిర్వాహక వర్గం / రాజకీయ నాయకత్వం కింద పనిచేస్తారని.. దీన్ని గుర్తించుకోవాలని సూచించారు. రాజకీయ నాయకత్వం తీసుకున్న నిర్ణయాలకు వాటిని బ్రీఫ్ చేసిన పౌర సేవకులను నిందించకూడదని ఆయన ఎక్స్ పోస్ట్ లో వెల్లడించారు.

ఇదే సమయంలో... మిస్రి గౌరవాన్ని కాపాడుకోకపోవడం పట్ల సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కేంద్రాన్ని నిందించారు. ఆయన కేవలం దూత మాత్రమే అని స్పష్టం చేశారు. కొంతమంది ఆ అధికారి, అతని కుటుంబంపై దుర్భాషల పరిమితులను దాటుతున్నారని.. కానీ, బీజేపీ ప్రభుత్వం, మంత్రులు ఎవరూ అతని గౌరవాన్ని కాపాడటానికి ముందుకు రావడం లేదని అన్నారు.

ఇదే సమయంలో... ఈ వ్యవహారంపై స్పందించిన మాజీ విదేశాంగ కార్యదర్శి నిరుపమ మీనన్ రావు... మిస్రిపై ఆన్ లైన్ దుర్వినియోగాన్ని పూర్తిగా సిగ్గుచేటుగా అభివర్ణించారు. అంకితభావంతో కూడిన దౌత్యవేత్త అయిన మిస్రి దేశానికి వృత్తి నైపుణ్యం, దృఢ సంకల్పంతో సేవ చేశారని అన్నారు.

కాగా... అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం సోషల్ మీడియా పోస్టులో భారత్, పాక్ మధ్య తక్షణ కాల్పుల విరమణ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ ప్రకటన తర్వాత విలేకరుల సమావేశంలో మాట్లాడిన మిస్రి.. ఈ విషయాన్ని వెల్లడించారు. ఆ ప్రకటన వచ్చినప్పటి నుంచి మిస్రీని దేశద్రోహి అని, గద్దర్ అని ట్రోల్ చేస్తూ.. ఆయన కుమార్తెలపైనా కామెంట్స్ చేస్తున్నారు!