వైఫల్యంతో వెనకడుగు వేయను: రాయ్‌బరేలీ కుర్రాడి 28,000 కోట్ల సంచలనం!
వ్యాపార రంగంలో విజయం సాధించాలంటే కేవలం పెట్టుబడి ఉంటే సరిపోదు.. ఓటమిని తట్టుకునే గుండె ధైర్యం కూడా ఉండాలని నిరూపించారు రాయ్‌బరేలీకి చెందిన యువ పారిశ్రామికవేత్త విక్రమ్ చోప్రా.
By: Sivaji Kontham | 16 April 2026 8:45 AM ISTవ్యాపార రంగంలో విజయం సాధించాలంటే కేవలం పెట్టుబడి ఉంటే సరిపోదు.. ఓటమిని తట్టుకునే గుండె ధైర్యం కూడా ఉండాలని నిరూపించారు రాయ్‌బరేలీకి చెందిన యువ పారిశ్రామికవేత్త విక్రమ్ చోప్రా. ఆయన స్థాపించిన `కార్స్ 24`(CARS24) నేడు సుమారు 28,000 కోట్ల రూపాయల విలువైన స్టార్టప్‌గా ఎదిగి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. అయితే ఈ స్థాయికి చేరుకోవడానికి ముందు ఆయన ఒక వ్యాపారంలో ఘోరంగా విఫలమయ్యారు. కానీ ఆ అనుభవాన్ని పాఠంగా మార్చుకుని.. పాత కార్ల విక్రయ రంగంలో ఉన్న లోపాలను గుర్తిస్తూ చేపట్టిన వినూత్న ప్రయోగం ఆయన తలరాతను మార్చేసింది.
విక్రమ్ చోప్రా ప్రయాణం ఐఐటి -బాంబే నుండి ప్రారంభమైంది. ఉన్నత చదువుల అనంతరం మెకిన్సే వంటి దిగ్గజ సంస్థలో పనిచేసినా సొంతంగా ఏదైనా సాధించాలనే తపన ఆయనను పారిశ్రామికవేత్తగా మార్చింది. మొదట `ఫ్యాబ్ ఫర్నిష్` అనే ఆన్‌లైన్ ఫర్నిచర్ వ్యాపారాన్ని ప్రారంభించినా అది ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. ఆ సమయంలో నిరాశ చెందకుండా..మార్కెట్‌లో డిమాండ్ ఉన్న ఇతర రంగాలపై ఆయన దృష్టి సారించారు. భారతదేశంలో సెకండ్ హ్యాండ్ కార్లను అమ్మడం లేదా కొనడం అనేది ఒక పెద్ద సవాలుగా ఉందని గుర్తించి దానికి సాంకేతికతను జోడించి `కార్స్ 24`కు శ్రీకారం చుట్టారు.
2015లో ప్రారంభమైన `కార్స్ 24` అతి తక్కువ కాలంలోనే కస్టమర్ల నమ్మకాన్ని గెలుచుకుంది. పారదర్శకమైన ధరలు, త్వరితగతిన లావాదేవీలు .. నాణ్యమైన తనిఖీ విధానం ఈ స్టార్టప్‌ను ఇతర సంస్థల కంటే భిన్నంగా నిలబెట్టాయి. ఒకప్పుడు మధ్యతరగతి ప్రజలు పాత కారు అమ్మాలన్నా, కొనాలన్నా మధ్యవర్తుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండేది. విక్రమ్ చోప్రా ఆ గ్యాప్‌ను భర్తీ చేస్తూ ఒకే ప్లాట్‌ఫామ్ ద్వారా అన్ని సేవలను అందుబాటులోకి తెచ్చారు. దీనివల్ల కంపెనీ ఆదాయం వేగంగా పెరగడమే కాకుండా విదేశీ పెట్టుబడిదారుల దృష్టిని కూడా ఆకర్షించింది.
ఈ స్టార్టప్ ప్రయాణంలో మరో మలుపు ఏమిటంటే.. టీమ్ ఇండియా మాజీ సారథి ఎం.ఎస్. ధోని ఇందులో పెట్టుబడి పెట్టడం. ధోని కేవలం పెట్టుబడిదారుడిగానే కాకుండా.. ఈ బ్రాండ్‌కు అంబాసిడర్‌గా కూడా మారడం కంపెనీ క్రేజ్‌ను అమాంతం పెంచేసింది. ధోని వంటి దిగ్గజం ఈ వ్యాపార నమూనాను విశ్వసించడంతో సామాన్య ప్రజల్లో కూడా బ్రాండ్ పట్ల నమ్మకం బలపడింది. ప్రస్తుతం ఈ సంస్థ దేశంలోని ప్రధాన నగరాల్లోనే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లలో కూడా తన కార్యకలాపాలను విస్తరిస్తూ `యూనికార్న్` క్లబ్‌లో గర్వంగా నిలిచింది.
నేడు రాయ్‌బరేలీలో అత్యంత ధనవంతుడిగా పేరు తెచ్చుకున్న విక్రమ్ చోప్రా కథ ప్రతి యువ పారిశ్రామికవేత్తకు ఒక స్ఫూర్తి. ఓటమి అనేది ముగింపు కాదని.. అది ఒక కొత్త ప్రారంభానికి పునాది అని ఆయన నిరూపించారు. ఒక సాధారణ పట్టణం నుండి వచ్చి అంతర్జాతీయ స్థాయి వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించడం వెనుక అతడు పడ్డ శ్రమ వ్యూహరచన అద్భుతం. విక్రమ్ విజయం చూస్తుంటే... మార్కెట్ అవసరాలను సరిగ్గా అంచనా వేసి నిజాయితీతో పనిచేస్తే ఎంతటి టార్గెట్ ని అయినా ముద్దాడవచ్చు అని అర్థమవుతుంది.
