కొబ్బరి ముంజలు.. బెజవాడి కుర్రాడి ఐడియాకు మార్కెట్ ఫిదా
సాధారణంగా కాఫీని మామూలు పాలతో కలిసి చేస్తారు. వికాస్ మాత్రం కొబ్బరి పాలతో చిక్కని కాపీ తయారు చేస్తారు. ఈ కాఫీకి మరో స్పెషల్ ఉంది.
By: Tupaki Desk | 1 July 2025 4:00 PM ISTపోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలన్నారు పెద్దలు. ఆ మాటను పక్కాగా ఫాలో అయ్యాడు విజయవాడకు చెందిన కుర్రాడు వికాస్. రైతు కుటుంబం నుంచి వచ్చిన అతగాడి పూర్వీకులు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వారు. కొబ్బరి మీద వారికి సహజంగా ఉండే అభిమానంతో దాన్నే తన వ్యాపారంగా మార్చుకున్నాడు. 2019లో కొబ్బరిపొడి పరిశ్రమను ఏర్పాటు చేసి.. కోట్లాది రూపాయిల్ని పోగొట్టుకున్నాడు. అయినా వెనక్కి తగ్గని అతడు కొబ్బరి ముంజ కాన్సెప్టుకు తెర తీయటమే కాదు.. కొబ్బరితో దాదాపు పదుల సంఖ్యలో ఉత్పత్తుల్ని మార్కెట్లోకి తేవటం ద్వారా.. కొబ్బరి రైతులకు ఆదాయం వచ్చేలా చేయటమే కాదు.. కోట్లాది రూపాయిలు సంపాదిస్తున్న అతగాడి సక్సెస్ స్టోరీ.. కొత్త స్ఫూర్తిని ఇస్తుందని చెప్పక తప్పదు.
విజయానికి ముందు ఓటమి పరీక్ష పెడుతుంది. దాన్నికష్టంతో సమాధానమిస్తూ.. సహనంతో అధిగమిస్తే అనూహ్య ఫలితాలు ఖాయం. వికాస్ అదే పని చేశాడు. కోస్తా జిల్లాల వారికి తాటి ముంజల గురించి తెలిసిందే. కూల్ యాపిల్ గా పలువురు పిలుచుకునే తాటి ముంజల మాదిరి..కొబ్బరితో కోకో ముంజ్ ను తయారు చేస్తే? సరిగ్గా ఇలాంటి ఐడియాతో పాటు.. కొబ్బరితో 60కు పైగా పదార్థాల్ని తయారు చేయటం ద్వారా అటు ఆరోగ్యం.. ఇటు వ్యాపారాన్ని మరో స్థాయికి తీసుకెళ్లాలన్న విజయవాడ యువకుడి కలకు ఇప్పుడు సానుకూల ఫలితాలు వస్తున్నాయి.
క్రిష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లిలో ఫ్యాక్టరీని ఏర్పాటు చేసి.. వినూత్న పద్దతిలో కొబ్బరితో చేస్తున్న 60 రకాలు ఇప్పుడు అందరిని ఆకర్షిస్తున్నాయి. త్వరలో దేశ వ్యాప్తంగా ప్రముఖ దుకాణాల్లోనూ వీటిని అందుబాటులోకి తెచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఎలాంటి రంగు.. రసాయనాల్ని కలపకుండా కేవలం కొబ్బరి నీళ్లను ప్రాసెస్ చేసి తాటి ముంజల్ని తలపించేలా తయాు చేస్తున్నారు. కోల్డ్ బ్రూస్ కాఫీని మామూలు నీళ్లతో తయారు చేస్తే.. ఇతగాడు మాత్రం కొబ్బరి నీళ్లతో చేయటం గమనార్హం. కొబ్బరి తురుము.. పాలు.. నీటితో 20కు పైగా వెరైటీ ఫుడ్ లను.. 40 రకాల కేక్ లు.. మిల్క్ షేక్ లు.. ఐస్ క్రీములు.. బిస్కెట్లు.. కాఫీ లాంటి పదార్థాల్ని తయారు చేస్తూ.. అందరిని ఆకర్షిస్తున్నాడు.
సాధారణంగా కాఫీని మామూలు పాలతో కలిసి చేస్తారు. వికాస్ మాత్రం కొబ్బరి పాలతో చిక్కని కాపీ తయారు చేస్తారు. ఈ కాఫీకి మరో స్పెషల్ ఉంది. అదేమంటే..ఈ కాఫీలో పంచదార కాకుండా.. కొబ్బరి గెల నుంచి వచ్చే నీరాతో చేసిన చక్కెర.. తేన వేయటం ద్వారా భిన్నమైన రుచిని తీసుకొచ్చి.. అందరి మనసుల్ని దోచేస్తున్నాడు. తన ఉత్పత్తులతో అటు ఆరోగ్యం.. ఇటు అనారోగ్యానికి చెక్ పెట్టేలా సిద్ధం చేయటం ఇస్పెషల్ గా చెప్పాలి.
కొబ్బరితో రక్తంలో చక్కెర స్థాయిల్ని నియంత్రించేలా చేసి షుగర్ కు చెక్ పెట్టటం.. నీరసం.. మలబద్ధకం.. థైరాయిడ్ సమస్యలకు చెక్ పెట్టేలా తన ఉత్పత్తులు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొబ్బరి నీళ్లతో చెడు కొవ్వు కరిగేలా చేయటంతో పాటు.. కిడ్నీలో రాళ్లు కరిగించే శక్తి ఉంటుంది కొబ్బరి పాలలో ఫైబర్ అధికంగా ఉండటంతో జీవక్రియ మరింత మెరుగవుతుంది. ఇలా ఆరోగ్యానికి మేలు చేసే అంశాలతో తన ఉత్పత్తుల్ని సిద్ధం చేసిన వికాస్.. ఇప్పుడు అందరిని ఆకర్షిస్తున్నాడు. అతడు మరిన్ని విజయాల్ని సొంతం చేసుకోవాలని ఆశిద్దాం.
