Begin typing your search above and press return to search.

బీజేపీ స్టార్స్ లిస్ట్ లో విజయశాంతి, రఘునందన్... కరెక్షన్లు తప్పలా?

దీంతో స్టార్‌ క్యాంపెయినర్ల జాబితాలో మార్పులు చేసి ఆఖరికి విజయశాంతి, రఘునందన్ రావు పేర్లను చేర్చి మ‌రో ప్రకటన విడుదల చేశారు.

By:  Tupaki Desk   |   7 Nov 2023 6:40 AM GMT
బీజేపీ  స్టార్స్  లిస్ట్  లో విజయశాంతి, రఘునందన్... కరెక్షన్లు తప్పలా?
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ విజయశాంతికి తమ సొంత పార్టీలో అవమానాలు ఎదురవుతున్నాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి. తెలంగాణ కోసం పోరాడిన మహిళా నాయకురాలిగా.. తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న రాములమ్మ ఇప్పుడు అవకాశాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొందనే చెప్పుకోవాలి. దీంతో ఆమె వరుసగా వంచనకు గురవుతున్నారని ఆమె అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ఈ క్రమంలో బీజేపీ నుంచి మరోసారి ఆమెకు అవమానం జరిగింది. అనంతరం పార్టీనేతలు కవర్ చేసుకున్నారు.. కంటితుడుపు చర్యకు ఉపక్రమించారు!


అవును... విజయశాంతి రాజకీయాల్లోకి వచ్చి 25 ఏళ్లు గడుస్తుండగా.. బీజేపీలో చేరి మూడేళ్లు కావొస్తోంది. అయితే.. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఒకే ఒక్కసారి మాత్రమే ఎంపీగా సేవందించే అవకాశం ఆమెకు వచ్చింది. ఇక ఆ తర్వాత 2014లో మెదక్ నుంచి ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. మరి ఈసారైనా బీజేపీ నుంచి అవకాశం దక్కుతుందా అనుకుంటే.. అది కూడా ఎండమావిలాగే కనిపిస్తోందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.


బీజేపీ పెద్దలు తెలంగాణ ఎన్నికలకోసం ఇప్పటికే మూడు జాబితాలు ప్రకటించగా.. ఎందులోనూ ఆమె పేరు ప్రకటించలేదు. ఇక జనసేనతో పొత్తుతో ఆ పార్టీనేతలకూ 8 స్థానాలు కేటాయించారు. ఇక మిగిలిన 23 స్థానాల్లో అయినా ఆమెపేరు ఉంటుందా ఉండదా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ సమయంలో తెలంగాణ ఎన్నికల కోసం స్టార్ క్యాంపెయినర్ల జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో ఊహించని విధంగా ఆమె పేరు మాయమైంది.

తెలంగాణ ఎన్నికల్లో స్టార్ క్యాంపెనిర్ల జాబితాలో ఆమెతో పాటు.. తెలంగాణ బీజేపీలో లాజికల్ గా, పిన్ టు పిన్ మాట్లాడగల వక్తగా పేరున్న రఘునందన్ రావుని కూడా సైడ్ చేసేసింది! దీంతో... బీజేపీ పరిస్థితి ఇలా ఉండటానికి కారణం ఇలాంటి నిర్ణయాలే అనే మాటలు వినిపించాయి. విజయశాంతి వాక్ చతుర్యం.. రఘునందన్ సబ్జెక్ట్ నాలెడ్జ్ బీజేపీకి అవసరం లేదా.. ఇప్పుడున్నవారంతా అంతకు మించిన వక్తలా అనే చర్చ కూడా తెరపైకి వచ్చింది.

దీంతో... వెంటనే ఈ అంశం అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో స్టార్‌ క్యాంపెయినర్ల జాబితాలో మార్పులు చేసి ఆఖరికి విజయశాంతి, రఘునందన్ రావు పేర్లను చేర్చి మ‌రో ప్రకటన విడుదల చేశారు. దీంతో... మొత్తం 42 మంది నేతలు తెలంగాణలో బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించనున్నారు. వీరిలో ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు అమిత్‌ షా, రాజ్‌ నాథ్‌ సింగ్‌, నితిన్‌ గడ్కరీ, జేపీ నడ్డా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ఉన్నారు.

ఇక రాష్ట్ర నేతల జాబితాలో... కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్, రాజా సింగ్, లక్ష్మణ్, డీకే అరుణ, ఎంపీ అరవింద్, జితేందర్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి వంటి వారు కూడా ఉన్నారు. అయితే వీరందరి పేర్లు తొలిజాబితాలో ఉన్నప్పటికీ... విజయశాంతి, రఘునందన్ ల పేర్లు లేవు. దీంతో... ఉద్దేశపూర్వకంగానే విజయశాంతిని పక్కనపెట్టారని ప్రచారం జరిగింది. దీంతో... కరెక్షన్ చేసుకున్నారు నేతలు!