Begin typing your search above and press return to search.

కూకట్‌ పల్లి వైపు రాములమ్మ చూపు... తప్పుడు కేసులంటూ పిలుపు!

ఈ క్రమంలో రాబోయే ఎన్నికల్లో ఆమె కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీచేస్తారని అంటున్నారు.

By:  Tupaki Desk   |   24 Aug 2023 5:05 AM GMT
కూకట్‌ పల్లి వైపు రాములమ్మ చూపు... తప్పుడు కేసులంటూ పిలుపు!
X

తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తోన్న వేళ ఇప్పటికే బీఆరెస్స్ తన అభ్యర్థులను ప్రకటించేసింది. మరోవైపు కాంగ్రెస్ కూడా అదేపనిలో ఉందని అంటున్నారు. ఈ సమయంలో బీజేపీ నుంచి విజయశాంతి పోటీచేయబోయే స్థానంపై ఆసక్తికరమైన చర్చ తెరపైకి వచ్చింది.

ఈ క్రమంలో రాబోయే ఎన్నికల్లో ఆమె కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీచేస్తారని అంటున్నారు. పైగా గత కొన్నిరోజులుగా కూకట్ పల్లి నియోజకవర్గంలో వరుసపర్యటనలు చేస్తున్నారు విజయశాంతి. అయితే అధిష్టాణం అందుకు అంగీకరిస్తుందా లేదా అనే సంగతి కాసేపు పక్కనపెడితే... ఆమె మాత్రం ఇప్పటికే తనపై కూకట్ పల్లిలో కేసులు పెడుతున్నారని అంటున్నారు.

అవును... ప్రజలకు చేస్తున్న సేవా కార్యక్రమాలు, బీజేపీకి వస్తున్న ఆదరణ చూసి తట్టుకోలేక తనను ఇబ్బంది పెట్టేందుకు కొందరు కుట్రలు చేస్తున్నారని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ విజయశాంతి అన్నారు. రానున్న కాలంలో వాటికి ప్రజలే తగిన సమాధానం చెబుతారని తెలిపారు.

ఇందులో భాగంగా కూకట్ పల్లి నియోజకవర్గంలో తనపై కావాలనే తప్పుడు కేసులు బనాయిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని విజయశాంతి పేర్కొన్నారు. తాను ఏ తప్పు చేయలేదని.. అలాంటివి ఏం ఉన్నా మన దేశంలోని చట్టాలు, న్యాయ వ్యవస్థ చూసుకుంటుందని వివరించారు. దీంతో... కూకట్ పల్లిలోనే రాములమ్మ పోటీ చేయబోతుందనే చర్చకు బలం చేకూరుతుందని అంటున్నారు!

కాగా... తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం టీఆరెస్స్ టిక్కెట్ పై మెదక్ ఎంపీ స్థానానికి పోటీ చేసి గెలిచిన విజయశాంతి... అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా మెదక్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేసి ఓడిపోయారు. మళ్లీ మెదక్ వైపు చూడలేదు!

ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి బీజేపీలో చేరారు. కాంగ్రెస్ లో ప్రచార కమిటీ చైర్మన్ గా ఉన్నారు కానీ.. బీజేపీలో అసలు ఏ పదవీ దక్కలేదు. ఈ క్రమంలో కూకట్ పల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారని కథనాలొస్తున్నాయి!