జీఎస్టీలా ఐటీ.. కేంద్రానికి ‘సీఏ’ విజయసాయి ప్రతిపాదన
కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన కీలక సంస్కరణ జీఎస్టీ. ప్రజలకు పన్ను భారం తప్పించేలా పలు కీలక మార్పులు చేపట్టడంతో రిలీఫ్ లభించిందని ప్రజలు భావిస్తున్నారు.
By: Tupaki Desk | 16 Sept 2025 1:54 PM ISTప్రొఫెషన్ రీత్యా చార్టెడ్ అకౌంటెంట్ అయిన వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజకీయాలను వదిలేసినా.. తన పాత ప్రొఫెషన్ తాలూకు అనుభవాన్ని మాత్రం దేశానికి అందించే ప్రయత్నాల్లో ఉన్నారనుకోవాలి..! ఎంతయినా కాకలు తీరిన సీఏ కదా..? తాజా పరిణామాల రీత్యా కేంద్ర ప్రభుత్వానికి ఓ కీలక సూచనలు చేశారు. వైసీపీ ఓటమి అనంతరం గత ఏడాది రాజకీయాల నుంచి వైదొలగిన విజయసాయి ఏపీ మద్యం కేసులో విచారణకు హాజరు సమయంలో మినహా మిగతా సమయంలో బయట కనిపించడం లేదు.
ఇలా ఎందుకు మార్చకూడదు..?
కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన కీలక సంస్కరణ జీఎస్టీ. ప్రజలకు పన్ను భారం తప్పించేలా పలు కీలక మార్పులు చేపట్టడంతో రిలీఫ్ లభించిందని ప్రజలు భావిస్తున్నారు. ఇప్పుడు జీఎస్టీ శ్లాబ్ ల తరహాలోనే ఆదాయ పన్ను (ఐటీ)లోనూ శ్లాబ్ లు ప్రవేశపెట్టాలని సూచిస్తున్నారు విజయసాయిరెడ్డి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన సుంకాలపై, పలు ఇతర అంశాలపై కేంద్రానికి ప్రత్యామ్నాయ మార్గాలు సూచిస్తున్నారు విజయసాయి. ప్రొఫెషన్ పరంగానే కాదు.. సుదీర్ఘకాలం ఎంపీగా పనిచేసిన అనుభవం, వైసీపీ పార్టమెంటరీ పార్టీ నాయకుడిగానూ వ్యవహరించినందున విజయసాయి సూచనలు కాస్త ఆలోచించదగినవే.
హలో సాయి అంటూ ప్రధాని మోదీనే నేరుగా పలకరించే స్థాయి ఉన్న వ్యక్తి విజయసాయిరెడ్డి. ఇప్పుడు ఆ అవకాశం లేదు. అయితే, మోదీ ఇప్పుడు విజయసాయి చేస్తున్న సూచనలను వింటారా..? అన్నది చూడాలి. ఇంతకూ విజయసాయి ఏమంటారంటే..? జీఎస్టీలో నాలుగు శ్లాబ్ లను రెండుకు తగ్గించిన విషయాన్ని గుర్తుచేస్తూ, ఆదాయ పన్ను శ్లాబ్ లనూ మార్చాలని ప్రతిపాదించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను ఉద్దేశిస్తూ ఈ మేరకు ట్వీట్ చేశారు. అందులోని వివరాలు...
-కేంద్రం ఈ ఏడాది 12 లక్షల వరకు పన్ను మినహాయింపు ఇస్తూ బడ్జెట్ ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఇక 24 లక్షల వరకు 10 శాతం పన్నుతో ఒక శ్లాబ్, 24 లక్షలకు పైగా ఆదాయానికి 20 శాతం పన్ను ఉండాలని విజయసాయి కోరారు. శ్లాబ్ లు తక్కువగా ఉంటే సులభంగా రిటర్నులు దాఖలు చేయడానికి వీలవుతుందన్నారు. ఎక్కువమంది సమ్మతి, ప్రభుత్వ ఆదాయం తగ్గే ప్రమాదం కూడా ఉండదని వివరించారు. ఆదాయ పన్ను శాఖ ఫోకస్ ఎప్పుడూ పన్ను బేస్ (పునాది)ని పెంచడంపైనే ఉండాలని పేర్కొన్నారు.
మోదీ పట్టించుకుంటారా..?
సాయిరెడ్డి ప్రతిపాదనలు సరే గానీ.. కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేదు. ఇప్పుడు మళ్లీ ఆయన కీలకమైన ఆదాయ పన్ను విషయంలో ఇప్పటికే పలు కీలక అంశాలపై విజయసాయి ప్రపోజల్స్ ను పరిశీలించినట్లు లేదు. ఎంతయినా ఆయన ఏ పదవిలోనూ లేరు కదా..?
