Begin typing your search above and press return to search.

తన పేరు కలిసొచ్చేలా పార్టీలోనూ 'విజయం'.. మరి విజయం?

తాజాగా తమిళంలో అత్యంత ఆదరణ పొందిన హీరో, తెలుగువారికీ సుపరిచితమైన విజయ్.. 'తమిళగ వెట్రి కళగం' పేరుతో పార్టీని ఏర్పాటు చేశారు.

By:  Tupaki Desk   |   5 Feb 2024 12:30 PM GMT
తన పేరు కలిసొచ్చేలా పార్టీలోనూ విజయం.. మరి విజయం?
X

ఉత్తరాదిన తక్కువే కానీ.. దక్షిణాదిన సినిమా హీరోలు రాజకీయ పార్టీని స్థాపించడం చాలా సహజం. తెలుగులో నట విఖ్యాత ఎన్టీఆర్ నుంచి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వరకు.. తమిళనాడులో వారి ఆరాధ్య నటుడు ఎంజీఆర్ నుంచి విజయకాంత్ వరకు.. సొంత పార్టీలను నెలకొల్పారు. కన్నడలో ఉపేంద్ర కూడా, అంబరీష్ తదితరులు రాజకీయాల్లో కొనసాగారు. కాగా, మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజనీకాంత్, విశ్వ నటుడు కమల్ హాసన్, నల్ల ఎంజీఆర్ కెప్టెన్ విజయ్ కాంత్ రాజకీయ పార్టీలను నెలకొల్పారు. ఇందులో మరో ట్విస్టు ఏమంటే ఎన్టీఆర్ కుమారుడు హరిక్రిష్ణ కూడా సొంతంగా అన్న ఎన్టీఆర్ పేరిట పార్టీని స్థాపించారు. ఇప్పుడు వీరి బాటలోనే తమిళ హీరో విజయ్ ప్రస్థానం మొదలుపెట్టారు. అధికారం, పెద్దఎత్తున ప్రజలకు సేవ చేసే అవకాశం ఉండడంతో పేరుగడించిన చాలామంది రాజకీయాలను తమ తదుపరి గమ్యంగా ఎంచుకుంటారు.

తమిళంలో దమ్ము..

ఎంజీఆర్.. ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే)ను ఏఐఐడీఎంకే (ఆలిండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం)ను స్థాపించారు. ఆయన మరణం హీరోయిన్ జయలలిత ఈ పార్టీని లీడ్ చేశారు. తద్వారా సినీ వారసత్వం ఏఐఏడీఎంకేను ఐదు దశాబ్దాలుగా నడిపిస్తోంది. ఇక యావత్ భారతదేశానికి పరిచయం ఉన్న కమల్ హాసన్ మక్కల్ నీది మయ్యం పేరిట పార్టీని స్థాపించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినా ఫలితం పొందలేకపోయారు. లోక్‌ సభ ఎన్నికల్లో కోయంబత్తూర్‌ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఆయన నటుడు, సూపర్ స్టార్ రజనీకాంత్ రజినీకాంత్‌ 2017లో 'రజినీ మక్కల్‌ మండ్రం'ను ప్రారంభించారు. 2020 డిసెంబరులో దానిని రద్దు చేశారు. ఆరోగ్యం సహకరించని ప్రణాళికలను రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించారు. నటి రాధిక భర్త, నటుడు శరత్‌కుమార్‌ 1994 నుంచి రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. 2007లో 'ఆల్‌ ఇండియా సమతువ మక్కల్‌ కట్చి (ఎఐఎస్‌ఎంకె)'ను స్థాపించారు. విజయకాంత్ పార్టీని స్థాపించి దాదాపు 18 ఏళ్లు తమిళ రాజకీయాల్లో కొనసాగారు. డీఎండీకే ఆయన పార్టీ పేరు.

తెలగులోనూ తడాఖా

ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం తెలుగు రాజకీయాలను మలుపు తిప్పితే.. ఆయన తర్వాత మెగాస్టార్ గా చిత్ర సీమను ఏలిన చిరంజీవి 2008లో ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. 2010లో పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. కానీ, చిరంజీవి తమ్ముడు పవన్ కల్యాణ్ 2014లో జనసేన పేరిట పార్టీని స్థాపించి విభజిత ఏపీలో కీలక భూమిక పోషిస్తున్నారు. తెలుగు వారికీ పరిచయమైన ప్రముఖ కన్నడ నటుడు ఉపేంద్ర 2018లో 'ఉత్తమ ప్రజాకీయ పార్టీ' స్థాపించారు. 2019 సాధారణ ఎన్నికల్లో ఈ పార్టీ కర్ణాటక వ్యాప్తంగా బరిలోకి దిగినా, ఒక్క స్థానంలోనూ విజయం సాధించలేకపోయింది. ఈ తరువాత నాయకులతో విబేధాలతో ఈ పార్టీ నుంచి ఉపేంద్ర బయటకు వచ్చారు. 2017లో కూడా ఉపేంద్ర 'కర్ణాటక ప్రజ్నాయువంత జనతా పక్ష' అనే పార్టీని స్థాపించారు. అంటే ఈయన రెండుసార్లు పార్టీని నెలకొల్పారన్నమాట. కాగా, హిందీ నటుడు దేవానంద్ 1979లోనే 'నేషనల్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా' అనే పార్టీని స్థాపిం చారు. కొన్ని నెలల్లోనే దానిని రద్దు చేశారు.

వారి పేర్లలో పేరు లేదు

తాజాగా తమిళంలో అత్యంత ఆదరణ పొందిన హీరో, తెలుగువారికీ సుపరిచితమైన విజయ్.. 'తమిళగ వెట్రి కళగం' పేరుతో పార్టీని ఏర్పాటు చేశారు. వెట్రి అంటే.. తమిళంలో విజయం అని అర్థం. తనపేరు కలిసొచ్చేలా విజయ్ పార్టీకి పేరు పెట్టుకున్నారన్నమాట. అయితే, 2024 లోక్ సభ ఎన్నికలకు కాకుండా ఆయన 2026 అసెంబ్లీ ఎన్నికలను లక్ష్యంగా చేసుకున్నారు. మరి.. పార్టీ పేరులో విజయం ఉన్న ఆయన ప్రజాక్షేత్రంలోనూ విజయం సాధిస్తారా? లేదా? అనేది చూడాలి.