Begin typing your search above and press return to search.

విదేశాలకు కేంద్ర దర్యాప్తు సంస్థలు.. బడా నేరస్తులను పట్టుకొస్తారా?

ఈ మూడు దర్యాప్తు సంస్థలు విజయ్‌ మాల్యా, నీరవ్‌ మోదీలను భారత్‌ కు తీసుకురావడానికి బ్రిటన్‌ కు బయలుదేరాయి. బ్రిటన్‌ తో పాటు ఇతర దేశాలలో ఉన్న వారి ఆస్తులను గుర్తించనున్నాయి.

By:  Tupaki Desk   |   17 Jan 2024 1:30 AM GMT
విదేశాలకు కేంద్ర దర్యాప్తు సంస్థలు.. బడా నేరస్తులను పట్టుకొస్తారా?
X

వేల కోట్ల రూపాయలను రుణాలుగా తీసుకుని బ్యాంకులకు ఎగనామం పెట్టిన కేసుల్లో బడా నిందితులు విజయ్‌ మాల్యా, నీరవ్‌ మోదీ, సంజయ్‌ భండారీల కోసం కేంద్ర దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగాయి. దేశంలో బ్యాంకులను, ఆర్థిక సంస్థలను నిండా ముంచి వీరు బ్రిటన్‌ కు పారిపోయిన సంగతి తెలిసిందే. ఇండియాకు తిరిగొస్తే అరెస్టు చేస్తారనే భయంతో లిక్కర్‌ కింగ్‌.. విజయ్‌ మాల్యా, ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీ, ఆయుధ వ్యాపారి సంజయ్‌ భండారీ విదేశాల్లోనే మకాం వేశారు.

ఈ నేపథ్యంలో పరారీలో ఉన్న విజయ్‌ మాల్యా, నీరవ్‌ మోదీ, సంజయ్‌ భండారీలపై చర్యలు తీసుకునేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగాయి. బ్రిటన్‌ లో తలదాచుకుంటున్న వారిని దేశానికి తీసుకురావడానికి కేంద్ర దర్యాప్తు సంస్థలు.. సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (సీబీఐ), ఎనఫోర్సుమెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ), నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) సిద్ధమవుతున్నాయి.

ఈ మూడు దర్యాప్తు సంస్థలు విజయ్‌ మాల్యా, నీరవ్‌ మోదీలను భారత్‌ కు తీసుకురావడానికి బ్రిటన్‌ కు బయలుదేరాయి. బ్రిటన్‌ తో పాటు ఇతర దేశాలలో ఉన్న వారి ఆస్తులను గుర్తించనున్నాయి. తద్వారా వాటిని స్వాధీనం చేసుకునేందుకు వీలు కలుగుతుందని చెబుతున్నారు

ఈ నేపథ్యంలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్‌ అధికారి నేతృత్వంలోని ఉమ్మడి బృందం.. లండన్‌ లోని భారత హైకమిషన్‌ అధికారుల ద్వారా యూకే అధికారులతో సమన్వయం చేసుకుంటున్నారు.

కాగా పరారైన వారు సంపాదించిన ఆస్తులు, వారి బ్యాంకింగ్‌ లావాదేవీల గురించిన సమాచారం పెండింగ్‌లో ఉందని తెలుస్తోంది.

ఇక ఆయుధ వ్యాపారి సంజయ్‌ భండారీ కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్‌ వాద్రాకు సన్నిహితుడు. కేంద్రంలో మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వ హయాంలో జరిగిన అనేక రక్షణ ఒప్పందాలు జరిగాయి. దీంతో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆదాయపు పన్ను శాఖతో పాటు ఈడీ విచారణ ప్రారంభించాయి. ఈ క్రమంలో సంజయ్‌ భండారీ 2016లో భారత్‌ నుంచి పరార్‌ అయ్యాడు.

అయితే, బ్రిటన్‌ లో విజయ్‌ మాలా, నీరవ్‌ మోదీ, సంజయ్‌ భండారీల అప్పగింత పెండింగ్‌ లో ఉంది. ఈ నేపథ్యంలో ఈడీ ఇప్పటికే భారతదేశంలోని వారి ఆస్తులను స్వాధీనం చేసుకుంది. అలాగే, విజయ్‌ మాల్యా, నీరవ్‌ మోడీలకు సంబంధించిన వేల కోట్ల విలువైన ఆస్తులను బ్యాంకులు విక్రయించాయి. ఈ నేపథ్యంలో మిగతా బకాయిలను కూడా రాబట్టడానికి ప్రయత్నిస్తున్నాయి.