Begin typing your search above and press return to search.

దళపతి.. ఏ టీం? తమిళనాడులో ఇదే పెద్ద టాపిక్

తమిళనాడులోని రాజకీయ శూన్యతను గుర్తించి సరైన సమయంలో సరైన రీతిలో రాజకీయ అరంగ్రేటాన్ని ప్రకటించారు దళపతి విజయన్.

By:  Tupaki Desk   |   13 Feb 2024 11:30 AM GMT
దళపతి.. ఏ టీం? తమిళనాడులో ఇదే పెద్ద టాపిక్
X

తమిళనాడులోని రాజకీయ శూన్యతను గుర్తించి సరైన సమయంలో సరైన రీతిలో రాజకీయ అరంగ్రేటాన్ని ప్రకటించారు దళపతి విజయన్. యువ కథానాయకుడిగా తెలుగు వారికి సుపరిచితమైన ఈ హీరో.. తాజాగా పొలిటికల్ ఎంట్రీ ఇస్తానని ప్రకటించటం తెలిసిందే. రాజకీయాల్లోకి రాక ముందే తన మద్దతు ఎన్నికల బరిలోకి దిగిన వారిని గెలిపించుకోవటం ద్వారా తమిళుల చూపు తన వైపు తిప్పుకున్న అతడు.. ఇప్పుడు మరో అంశంలో ఆసక్తికరచర్చగా మారారు. విజయ్ సొంతంగా పార్టీ పెడుతున్నారా? లేదంటే వేరే పార్టీకి బీ టీంగా ఉండేందుకు ఆయన రాజకీయ అడుగులు పడుతున్నాయా? అన్నదిప్పుడు చర్చగా మారింది.

ఆయన రాజకీయాల్లోకి వచ్చేందుకు వీలుగా పార్టీ పెడుతున్నట్లుగా ప్రకటించిన ప్రకటనపై వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నేతలంతా స్వాగతిస్తున్నట్లుగా ప్రకటనలు చేస్తూనే విమర్శనాస్త్రాల్ని సంధిస్తున్నారు. ఎవరికి వారు.. తమ ప్రత్యర్థి పార్టీకి బీటీం అని.. వారి ప్రయోజనాల కోసమే పార్టీ పెడుతున్నట్లుగా విమర్శలు చేస్తున్నారు. రాజకీయ అనుభవం పెద్దగా లేకున్నా.. రాజకీయాలతో ప్రజలకు ఏదో చేయాలన్న తపన ఉన్న సినీ నటుడిగా ఆయన్ను కొందరు అభివర్ణిస్తుంటే.. సరైన రాజకీయ పరిణితి లేకుండా అడుగులు వేస్తున్నఆయన వెనుక ఎవరో ఉండి నడిపిస్తున్నారన్న మాట బలంగా వినిపిస్తోంది.

తన అభిమాన సంఘాల ద్వారా సేవా కార్యక్రమాల్ని చేపట్టిన ఆయన.. స్కూల్ విద్యార్థులకు ఆర్థిక సాయం.. అన్నదానం.. విపత్తుల వేళలో సహాయ సహకారాలు అందించటం లాంటివి చేయటం తెలిసిందే. తాను నటించే ప్రతి సినిమాలోనూ రాజకీయ అంశాల్ని ప్రస్తావించటం.. ప్రభుత్వాలను.. పార్టీలకు పంచ్ డైలాగులు విసరటం లాంటివి చేస్తున్న సంగతి తెలిసిందే.

2011లో విజయ్ నటించిన కావాలన్ మూవీకి అప్పటి డీఎంకే సర్కారు ఆటంకాలు కల్పించటంతో తర్వాత జరిగిన ఎన్నికల్లో అన్నాడీఎంకేకు మద్దతు తెలిపారు. ఆ ఎన్నికల్లో జయ పార్టీ విజయం సాదించిన తర్వాత.. తాను కూడా ఆ విజయంలో ఉడతా సాయం చేశానని చెప్పటం.. దానికి జయ ఆగ్రహానికి గురి కావటం తెలిసిందే. తన విజయాన్ని విజయ్ ఖాతాలో వేసుకోవటం ఆమెకు నచ్చలేదని చెబుతారు. తాజా రాజకీయ ప్రకటనకు ముందు ఆయన మద్దతుతో స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించిన సంగతి తెలిసిందే.

తాజాగా ఆయన పొలిటికల్ పార్టీ ప్రకటన చేసిన తర్వాత నుంచి ఆయనపై విమర్శలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. అధికార డీఎంకే వైపు ఉన్న మైనార్టీ ఓట్లను రాబట్టేందుకు బీజేపీ పంపిన వ్యక్తిగా విజయ్ ను డీఎంకే నేతలు టార్గెట్ చేస్తున్నారు. మరోవైపు ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న అన్నామలైకు చెక్ పెట్టేందుకు డీఎంకే తరఫున వచ్చిన వ్యక్తిగా బీజేపీ ఆయన్ను టార్గెట్ చేస్తోంది. సూపర్ స్టార్ రజనీకాంత్ ను పొలిటికల్ ఎంట్రీ ఇప్పించే విషయంలో ఫెయిల్ అయిన బీజేపీ.. విజయ్ ను తీసుకురావటం ద్వారా తమ గేమ్ ప్లాన్ ను అమలు చేస్తున్నట్లుగా అన్నాడీఎంకే ఆరోపిస్తోంది. ఇలా ప్రతి పార్టీ విజయ్ ను ఏదో ఒక పార్టీకి బీ టీంగా అభివర్ణించటం గమనార్హం. దీంతో.. ఆయన ఏ టీం అన్నదిప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తనపై చేస్తున్న బీటీం విమర్శలకు విజయ్ ఏమని బదులు ఇస్తారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.