విజయవాడ వెస్ట్ పాలిటిక్స్.. అర్థమైతే ఒట్టు.. !
''విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో రాజకీయాలు ఎవరికీ అర్థం కావడం లేదు'' అనే మాట జోరుగా వినిపిస్తోంది.
By: Garuda Media | 20 Aug 2025 10:21 AM IST''విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో రాజకీయాలు ఎవరికీ అర్థం కావడం లేదు'' అనే మాట జోరుగా వినిపిస్తోంది. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో ఎక్కడి నుంచి బిజెపి తరఫున ప్రముఖ పారిశ్రామికవేత్త కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి విజయం దక్కించుకున్నారు. ఆ తర్వాత కొన్ని రోజులు నియోజకవర్గంలో చిన్న చిన్న పనులు చేసినప్పటికీ ఆ తర్వాత యాక్సిడెంట్ అవ్వడంతో ఆయన హైదరాబాద్‌కే పరిమితం అయిపోయారు. ఇప్పుడు సుమారు ఆరేడు నెలలుగా నియోజకవర్గంలో ఎమ్మెల్యే కనిపించడం లేదనే టాక్ వినిపించడంతోపాటు, అసలు పనులు కూడా కావడం లేదు అన్నది ప్రజల నుంచి వస్తున్న విమర్శ.
ఇదిలా ఉంటే రాజకీయంగా చూసుకున్నా ఇక్కడ పెద్ద యాక్టివిటీ అయితే ఏమీ కనిపించడం లేదు. బిజెపి తరఫున పెద్దగా నాయకులూ లేకపోవడం, ఉన్న వారిలోనూ ఎక్కువ మంది టిడిపి నాయకులే కావడం, వారిలోనూ అంతర్గతంగా విభేదాలు ఉండడంతో ఎవరు నియోజకవర్గంలో పర్యటించడమే లేదు. ప్రజలను కలుసుకోవడం కూడా లేదు. వాస్తవానికి నియోజకవర్గం ఏదైనా, ఎవరు ప్రాతినిధ్యం వహించినా.. కూటమి ప్రభుత్వం తరఫున చేపట్టిన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీఎం చంద్రబాబు టిడిపి నాయకులకు సూచించారు. దీంతో మిత్రపక్షాల తరపున అభ్యర్థులుగా ఉన్న నియోజకవర్గాల్లో సైతం టిడిపి నేతలు సుపరిపాలనలో తొలి అడుగు అలాగే తల్లికి వందనం వంటి కార్యక్రమాలపై ప్రజలకు వివరిస్తున్నారు.
కానీ, విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో మాత్రం ఎవరు ముందుకు రాలేదు. ఎవరూ పట్టించుకోవడం కూడా లేదు. అదేమంటే బిజెపి వైపు వేళ్లు చూపిస్తున్నారు. మరో చిత్రమైన విషయం ఏంటంటే విజయవాడలో అంతో ఇంతో బలంగా ఉన్న బిజెపి నాయకులు కూడా వెస్ట్ నియోజకవర్గాన్ని పట్టించుకోకపోవడం. అదేవిధంగా ఇక్కడి రాజకీయాలను కనీసం ప్రస్తావించకపో వడం. ఎమ్మెల్యే వ్యవహారాన్ని కూడా పట్టించుకోకపోవడం వంటివి ఆసక్తిగా మారాయి. నిజానికి బిజెపి గతంలో కూడా ఇక్కడ విజయం దక్కించుకుంది. కాబట్టి, అంతో ఎంతో బలమైన నియోజకవర్గంగా విజయవాడ వెస్ట్ బిజెపికి కలిసి వస్తుంది.
మార్వాడీలు అదేవిధంగా బ్రాహ్మణ సామాజిక వర్గం ఈ నియోజకవర్గంలో ఎక్కువగా బీజేపీకే మద్దతు పలుకుతున్నాయి. అలాంటప్పుడు పార్టీని సంస్థగతంగా డెవలప్ చేసుకునేందుకు ఉన్న అవకాశాలను రాష్ట్రంలోని బిజెపి నేతలు ఉపయోగించుకోవడం లేదన్న చర్చ జరుగుతుంది. ఇది ఎంతవరకు సమంజసం. ఎమ్మెల్యే లేకపోయినంత మాత్రాన పార్టీని, ప్రభుత్వ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లే వారే లేరా? ప్రజల సమస్యలను పరిష్కరించే వారే కనిపించడం లేదా? అనేది స్థానికంగా జరుగుతున్న చర్చ. టిడిపి విషయానికి వస్తే పదవుల విషయంలో ఏర్పడిన పేచీ నాయకులను పార్టీకి దూరం చేసింది.
గతంలో బుద్ధ వెంకన్న సహా జలీల్ ఖాన్ వంటి వారు మీడియా ముందుకు వచ్చి పార్టీ తరఫున గళం వినిపించేవారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు గడిచినప్పటికీ తమను పట్టించుకోవడంలేదని, తమకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని భావిస్తున్న నాయకులు సైలెంట్ అయిపోయారు. మొత్తంగా చూస్తే వెస్ట్ నియోజకవర్గంలో రాజకీయ వ్యవహారాలు ఎవరికి అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా కూటమి రాజకీయాలు ఎవరికీ మింగుడు పడడం లేదు. మరి ముందు ముందు ఏం జరుగుతుందో చూడాలి.
