Begin typing your search above and press return to search.

పెళ్లి అని తొందరపడితే అంతే సంగతులు ...ఈ స్టోరీ చదవండి

34 ఏళ్లు వచ్చినా పెళ్లి కాకపోవటంతో.. రూ.4 లక్షలు ఎదురు కట్నం ఇచ్చి మరీ పెళ్లి చేసుకొని అడ్డంగా బుక్ అయిన వైనం తాజాగా విజయవాడలో వెలుగు చూసింది. అసలేం జరిగిందంటే..

By:  Tupaki Desk   |   16 Jun 2025 10:13 AM IST
పెళ్లి అని తొందరపడితే అంతే సంగతులు ...ఈ స్టోరీ చదవండి
X

పాపం ‘పెళ్లి కాని ప్రసాదు’ అన్న మాట నోటి వెంట వచ్చే ఉదంతంగా దీన్ని చెప్పొచ్చు. పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్న మహిళను.. పెళ్లి కాని యువతిగా మధ్యవర్తులు నమ్మించి పెళ్లి చేయటమే కాదు.. భారీగా రిసెప్షన్ చేసిన అనంతరం బయటకు వచ్చిన మోసం షాకింగ్ గా మారింది. 34 ఏళ్లు వచ్చినా పెళ్లి కాకపోవటంతో.. రూ.4 లక్షలు ఎదురు కట్నం ఇచ్చి మరీ పెళ్లి చేసుకొని అడ్డంగా బుక్ అయిన వైనం తాజాగా విజయవాడలో వెలుగు చూసింది. అసలేం జరిగిందంటే..

కర్ణాటకలోని గంగావతిలో ఒక తెలుగు కుటుంబం స్థిరపడింది. బాధిత యువకుడికి 34 ఏళ్లు వచ్చినా పెళ్లి కాలేదు. దీంతో ఆంధ్రాలోని మధ్యవర్తులను (శ్రీదేవి) ఆశ్రయించి..మంచి సంబంధం ఏమైనా ఉంటే చూపించాలని కోరారు. ఇందులో భాగంగా విజయవాడకు చెందిన తాయారు అనే పెళ్లిళ్ల మధ్యవర్తిని పరిచయం చేసింది శ్రీదేవి. విజయవాడలో ఒక సంబంధం ఉందని.. వారు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని.. వైద్యం కోసం కొంత డబ్బులు ముట్టచెబితే ఆమె పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకుంటుందని చెప్పారు.

దీంతో.. సదరు యువతి (పల్లవి)ని చూసేందుకు వారు కర్ణాటక నుంచి విజయవాడకు వచ్చారు. పెళ్లి కుమార్తెగా చూపించిన యువతి నచ్చటంతో.. సంబంధం ఖాయం చేసుకున్నారు. పెళ్లికి ముందే పెళ్లి కుమార్తె కుటుంబానికి ఇచ్చేందుకు రూ.3.5 లక్షలు మధ్యవర్తులు తీసుకున్నారు. పెళ్లి కచ్ఛితంగా విజయవాడలోనే జరగాలని పట్టుబట్టటంతో ఈ నెల ఐదున దుర్గమ్మ సన్నిధిలో సంప్రదాయబద్ధంగా పెళ్లి చేశారు. ఈ నెల ఏడున కర్ణాటకలోని గంగావతిలో నవ దంపతుల రిసెప్షన్ ఘనంగా నిర్వహించారు.

పెళ్లి కుమార్తె వెంట వచ్చిన ఆమె సోదరుడిగా చెప్పే హరీశ్ రిసెప్షన్ అయ్యాక తన తల్లికి ఆరోగ్యం బాగోలేదంటూ వరుడి కుటుంబం నుంచి రూ.50 వేలు తీసుకొని వెళ్లిపోయాడు. భర్తతో కాపురం చేయటానికి పల్లవి (పెళ్లికుమార్తె) నో చెప్పటంతో పెళ్లి కొడుకు కుటుంబానికి అనుమానం వచ్చి నిలదీశారు. దీంతో.. తనకు ఇప్పటికే పెళ్లై.. ఇద్దరు పిల్లలు ఉన్నారని.. భర్త విడిచి పెట్టటంతో తాను పిల్లలతో ఉన్నట్లుగా పల్లవి చెప్పింది.

ఐదు రోజులు పెళ్లి కుమార్తెగా నటిస్తే రూ.50 వేలు ఇస్తామని తాయారు అండ్ కో చెప్పటంతో తాను నమ్మి ఒప్పుకున్నట్లుగా పేర్కొంది. అంతేకాదు.. పల్లవి పేరు అసలు కాదని తన ఒరిజినల్ పేరు ఆమని అని చెప్పటంతో మోసపోయిన బాధిత కుటుంబం విజయవాడ కృష్ణలంక పోలీసు స్టేషన్ కు వచ్చి కంప్లైంట్ చేసింది. ఈ లెక్కన ఎంతమంది పెళ్లి కాని ప్రసాదుల్ని తాయారు అండ్ కో మోసం చేసిందన్న అంశంపై పోలీసులు విచారిస్తున్నారు.