Begin typing your search above and press return to search.

బిగ్ బ్రేకింగ్.. విజయవాడలో టెన్షన్ టెన్షన్.. టీడీపీ Vs వైసీపీ బాహాబాహీ

మెగా డీఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ రిలే నిరాహారదీక్షలు ప్రారంభించగా, దీక్షా శిబిరాన్ని అడ్డుకోడానికి టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా ప్రయత్నించడం ఘర్షణకు దారితీసింది.

By:  Tupaki Desk   |   6 Aug 2026 4:01 PM IST
బిగ్ బ్రేకింగ్.. విజయవాడలో టెన్షన్ టెన్షన్.. టీడీపీ Vs వైసీపీ బాహాబాహీ
X

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మెగా డీఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ రిలే నిరాహారదీక్షలు ప్రారంభించగా, దీక్షా శిబిరాన్ని అడ్డుకోడానికి టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా ప్రయత్నించడం ఘర్షణకు దారితీసింది. మంత్రి నారా లోకేశ్ పై అసత్య ఆరోపణలు చేస్తున్నారని, డీఎస్సీలో అక్రమాలు జరిగితే ఆధారాలు చూపాలంటూ ఎమ్మెల్యే ఉమా వెంట వచ్చిన టీడీపీ కార్యకర్తలు నిలదీయడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ మొదలైంది. ఈ క్రమంలో పరస్పరం తోపులాట జరగడంతోపాటు టీడీపీ కార్యకర్తలు వైసీపీ రిలే నిరాహారదీక్ష శిబిరాన్ని తొలగించడం వివాదానికి దారితీసింది. దీంతో విజయవాడ నగరంలో టెన్షన్ పరిస్థితులు ఏర్పడ్డాయి.

కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీలో స్పోర్ట్సు కోటా ఉద్యోగాల భర్తీలో అవకతకవలు జరిగాయని విపక్షం వైసీపీ ఆరోపిస్తోంది. ఇందుకు బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం రాష్ట్రవ్యాప్తంగా రిలే నిరాహారదీక్ష శిబిరాలు ప్రారంభించింది. విజయవాడ నగరంలో కూడా ఆయా నియోజకవర్గాల్లో వైసీపీ సమన్వయకర్తల ఆధ్వర్యంలో శిబిరాలు ప్రారంభించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం పరిధిలో ప్రింటింగ్ ప్రెస్ ఏరియాలో వైసీపీ సమన్వయకర్త మల్లాది విష్ణు ఆధ్వర్యంలో రిలే దీక్ష శిబిరాన్ని ప్రారంభించారు. మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలనే డిమాండ్ తోపాటు టీడీపీ కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ నాయకులు ప్రసంగించారు.

ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బొండా ఉమా తన అనుచరులతో వైసీపీ నిరసన దీక్ష శిబిరం వద్దకు చేరుకున్నారు. అసత్య ఆరోపణలు చేస్తున్నారని వైసీపీ నాయకులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఉద్రిక్త పరిస్థితులు చేరున్నాయి. వైసీపీ నిరసన శిబిరం టెంట్ ను తొలగించడంతోపాటు కోడిగుడ్లతో దాడులు చేశారని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. అయితే మంత్రి నారా లోకేశ్ ను బూతులు తిడుతూ ఉంటే తాము చూస్తూ ఊరుకోవాలా? అంటూ ఎమ్మెల్యే బొండా ఉమా ఎదురు ప్రశ్నించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ జోలికి వస్తే చూస్తూ ఊరుకోమని ఎమ్మెల్యే బొండా ఉమా తేల్చిచెప్పారు. మెగా డీఎస్సీ నిర్వహించి 8 నెలలు అవుతున్నా రాజకీయం కోసం అబద్ధాలు చెబుతున్నారని, మంత్రి లోకేశ్ ని బూతులు తిడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీపీఎస్సీ గ్రూప్ - 1 పరీక్షల నిర్వహణలో అక్రమాలు జరిగిన విషయాన్ని గుర్తు చేశారు. డీఎస్సీలో అక్రమాలు ఎక్కడ జరిగాయో చూపాలని డిమాండ్ చేశారు.

కాగా, తాము శాంతియుతంగా నిరసన దీక్ష చేపడితే ఎమ్మెల్యే ఉమా దౌర్జన్యం చేశారని వైసీపీ సమన్వయకర్త మల్లాది విష్ణు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ టెంట్ ను పీకేయడానికి ఉమాకి ఏం అర్హత ఉందని ప్రశ్నించారు. తమ నిరసన దీక్షకు పర్మిషన్ ఉందా? లేదా? అన్న విషయాన్ని పోలీసులు చూసుకుంటారని వ్యాఖ్యానించారు. మరోవైపు సెంట్రల్ నియోజకవర్గంలో వైసీపీ టెంట్ ను తొలగించారనే విషయం తెలుసుకుని నగరంలోని వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుంటున్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు సైతం భారీగా తరలివస్తుండటంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు భారీగా మోహరించారు.