సాయికృష్ణ మిస్టరీపై 'మెజిస్టీరియల్' విచారణ.. సర్కారు సంచలన నిర్ణయం!
విజయవాడ కృష్ణలంకకు చెందిన గాదే సాయికృష్ణ(28) మిస్సింగ్ వ్యవహారం మిస్టరీగా మారిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారం తీవ్రస్థాయిలో కుదిపివేస్తోంది.
By: Garuda Media | 3 July 2026 2:59 PM ISTవిజయవాడ కృష్ణలంకకు చెందిన గాదే సాయికృష్ణ(28) మిస్సింగ్ వ్యవహారం మిస్టరీగా మారిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారం తీవ్రస్థాయిలో కుదిపివేస్తోంది. ఈ నెల 15న హైకోర్టు పూర్తిస్థాయిలో దీనిని విచా రించేందుకు రెడీ అయింది. ఈ నేపథ్యంలో సర్కారు తనవంతుగా.. ఈ ఘటనపై చర్యలను తీవ్రతరం చేసింది. ఇప్పటికే ఈ వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి ఆరోపణలు ఎదుర్కొంటు న్న సీఐ నాగరాజును అరెస్టు చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపించింది.
అయినప్పటికీ.. సాయికృష్ణ కేసులో ఇంకా తీగ కదిలినా.. డొంక కదల్లేదు. ప్రభుత్వం కేసు నమోదు చేసి.. దాదాపు 15 రోజులు గడిచిపోతున్నా ఇంకా సాయికృష్ణ ఆచూకీ కానీ, ఆయన గురించి తదుపరి వివరాలు కానీ.. సేకరించలేక పోయారు. మరోవైపు ఒక సీఐ, ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు, మరో ఇద్దరు కానిస్టేబుళ్లను ప్రత్యకదర్యాప్తు బృందం అధికారులు అరెస్టు చేశారు. అయినప్పటికీ.. కేసు మూలాలను మాత్రం ఛేదించలేక పోయారు.
ఈ పరిణామాలు ఇలా ఉంటే.. మరోవైపు హైకోర్టు, ఇంకోవైపు జాతీయ మానవ హక్కుల సంఘం కూడా సాయికృష్ణ కేసును తీవ్రంగా భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత.. అంటే.. దాదాపు పుష్కరకాలంలో ఫస్ట్ టైమ్.. ఓ కేసు విషయంలో `మెజిస్టీరి యల్` విచారణకు ఆదేశించింది. ఈ మేరకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 4(శనివారం) ఉదయం 11 గంటల నుంచి ఈ విచారణ జరుగుతుందన్నారు.
ఏం చేస్తారు?
మెజిస్టీరియల్ విచారణ అంటే.. పోలీసులతో సంబంధం లేకుండా.. జిల్లా మెజిస్ట్రేట్ హోదాలో కలెక్టర్ లేదా సబ్ కలెక్టర్(సబ్ మెజిస్ట్రేట్ హోదా) విచారణ చేస్తారు. ఈ సమయంలో ఎవరైనా.. ఎక్కడివారైనా సాయికృష్ణకు సంబంధించిన సమాచారాన్ని... ఈ కేసులో తమకు తెలిసిన అంశాలను నిర్భయంగా వెల్లడించేందుకు అవకాశం ఇస్తారు. ఈ వివరాలను సబ్ కలెక్టర్ అధికారికంగా పిన్ టు పిన్ నమోదు చేసి .. ప్రభుత్వానికి, అదేసమయంలో సంబంధిత కోర్టుకు కూడా పంపిస్తారు.
ఏం జరుగుతుంది?
ఏదైనా కేసులో తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు.. ప్రభుత్వాలు ఇలా మెజిస్టీరియల్ విచారణకు ఆదేశిస్తారు. తద్వారా.. బాధితులకు కొంత మేరకు ఉపశమనం లభిస్తుంది. అదేసమయంలో హైకోర్టులు సహా.. ఇతర ప్రజాసంఘాల నుంచి ఎదురయ్యే ప్రశ్నలకు కూడా సమాధానం లభిస్తుంది. అత్యంత అరుదైన కేసుల్లో మాత్రమే ఇలాంటి విచారణలు జరుగుతాయి. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఇదే విజయవాడలో ఓ ఎస్సీ మహిళ కృష్ణ కుమారి లాకప్ డెత్‌కు గురైనప్పుడు మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించారు.
