Begin typing your search above and press return to search.

ప్రభుత్వ భూమిలో ఏళ్లుగా ఉన్నా, పన్ను కట్టినా... హైకోర్టు కీలక వ్యాఖ్యలు!

విజయవాడలో రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ) నిర్మాణం కోసం తమ భూములు తీసుకున్నందుకు భూ సేకరణ చట్టం - 2013 కింద పరిహారం చెల్లించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ పలువురు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.

By:  Raja Ch   |   8 Feb 2026 12:30 PM IST
ప్రభుత్వ భూమిలో ఏళ్లుగా  ఉన్నా, పన్ను కట్టినా... హైకోర్టు కీలక వ్యాఖ్యలు!
X

విజయవాడలో రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ) నిర్మాణం కోసం తమ భూములు తీసుకున్నందుకు భూ సేకరణ చట్టం - 2013 కింద పరిహారం చెల్లించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ పలువురు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ మేరకు విజయవాడ గుణదల ప్రాంతానికి చెందిన పలువురు 2020, 2022 ప్రాంతంలో రిట్ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ సందర్భంగా... ఈ భూమిలో తాము తమ పూర్వీకుల కాలం నుంచి ఉంటున్నామని తెలిపారు. దీనిపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

అవును... విజయవాడలో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం కోసం తీసుకున్న తమ భూములకు పరిహారం ఇప్పించాలని.. తాము అక్కడ క్రమం తప్పకుండా ఆస్తి పన్ను చెల్లిస్తున్నామని.. విద్యుత్ కనెక్షన్ తో పాటు మున్సిపల్ వాటర్ కనెక్షన్స్ కూడా ఉన్నాయని.. తాము భూమి లేని పేదలమని, ఇక్కడే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవిస్తున్నామని.. తమ భూములు తీసుకున్నందుకు పరిహారం చెల్లించేలా ఆదేశాలు జారీ చేయాలని.. తమకు న్యాయం చేయాలని న్యాయస్థానాన్ని కోరారు.

దీనిపై రెవెన్యూ, కార్పొరేషన్ అధికారులు కౌంటర్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా.. పిటిషనర్లు ప్రభుత్వ భూమిని ఆక్రమించారని.. రెవెన్యూ రికార్డుల ప్రకారం అక్కడ శ్మశానవాటిక, కాలువ ఉన్నాయని తెలిపారు. ఇదే సమయంలో... పన్నులు చెల్లించినంత మాత్రాన్న వారికి హక్కులు రావని.. వారే ఆ భూములకు యజమానులు అనేందుకు వారి వద్ద ఎలాంటి డాక్యుమెంట్లూ లేవని.. అయినప్పటికీ మానవీయ కోణంలో వారికి 114 ఇళ్లు కేటాయించామని చెబుతూ.. వారు పరిహారం పొందేందుకు అనర్హులని తెలిపారు.

ఈ సమయంలో.. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ హరినాథ్... భూ యజమానులు, ప్రభావిత కుటుంబాలకు సముచిత పరిహారం అందించడానికి భూసేకరణ చట్టం - 2013ని తీసుకొచ్చారని.. భూమి కోల్పోయినవారు నిరాశ్రయులవ్వకుండా వారి స్థితిగతులను మెరుగుపరచాలన్నది ఆ చట్టం ఉద్దేశ్యమే తప్ప.. అది ఆక్రమదారుల ప్రయోజనాల కోసం తెచ్చింది కాదని.. చట్టబద్ధ యజమానులు మాత్రమే ఈ చట్ట ప్రయోజనాలకు అర్హులని అన్నారు.

ఇదే సమయంలో... ప్రభుత్వ భూమి దశాబ్ధాలుగా అనుభవంలో ఉన్నప్పటికీ దానిని ఆక్రమించినవారు ఆక్రమణదారులే అవుతారు తప్ప చట్టబద్ధమైన యాజమాన్య హక్కులున్నవారితో సమానంగా పరిహారం కోరజాలరని తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా పిటిషనర్లు దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేశారు!