Begin typing your search above and press return to search.

వంగవీటికి లైన్ క్లియర్, విశాఖలో సస్పెన్స్.. 17 మేయర్ రిజర్వేషన్లు ఖరారు

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల దిశగా మరో అడుగు పడింది. ఎన్నికలకు షెడ్యూల్ విడుదలకు అడ్డంకిగా నిలిచిన రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయింది.

By:  Tupaki Desk   |   12 Oct 2026 7:47 PM IST
వంగవీటికి లైన్ క్లియర్, విశాఖలో సస్పెన్స్.. 17 మేయర్ రిజర్వేషన్లు ఖరారు
X

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల దిశగా మరో అడుగు పడింది. ఎన్నికలకు షెడ్యూల్ విడుదలకు అడ్డంకిగా నిలిచిన రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయింది. దీంతో మంగళవారం లేదా బుధవారం మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉందని అంటున్నారు. రాష్ట్రంలో మొత్తం 17 కార్పొరేషన్లు ఉండగా, 2021లో ప్రారంభమైన రిజర్వేషన్ సైకిల్ ఆధారంగా రిజర్వేషన్లు ఖరారు చేశారు. రాష్ట్రం యూనిట్ గా నిర్ణయించిన రిజర్వేషన్లు అందరూ అంచనా వేసినట్లుగానే పూర్తయ్యాయని చెబుతున్నారు. రాష్ట్రంలో ప్రధాన నగరాలైన విశాఖ జనరల్ మహిళకు రిజర్వు చేయగా, విజయవాడ ఓపెన్ కేటగిరిగా నిర్ణయించారు. దీంతో విజయవాడ మేయర్ గా మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణకు రూట్ క్లియర్ అయిందని అంటున్నారు.

మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు ఎవరెవరికి రిజర్వు అవుతాయనే ఉత్కంఠకు తెరపడింది. 17 మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్ పదవులకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా రాజధాని ప్రాంతమైన మంగళగిరి/తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ ఎస్టీకి కేటాయించారు. గత ఎన్నికల్లో నెల్లూరు మేయర్ పదవి ఎస్టీకి రిజర్వు చేయగా, ఇప్పుడు రొటేషన్ లో భాగంగా అత్యధిక ఎస్టీ జనాభా ఉన్న రెండో నగరంగా ఉన్న మంగళగిరి/తాడేపల్లి కార్పొరేషన్ ను కేటాయించారు. రిజర్వేషన్లలో ముందుగా ఎస్టీలు తరువాత ఎస్సీ, బీసీ, మహిళలకు కేటాయిస్తారని అంటున్నారు. ఈ క్రమంలో తొలి ప్రాధాన్యంగా ఎస్టీ రిజర్వేషన్ ను మంగళగిరి/తాడేపల్లికి కార్పొరేషన్ కేటాయించినట్లు చెబుతున్నారు.

ఇక ఎస్సీలకు రెండు, బీసీలకు 5, మహిళలకు 5 కార్పొరేషన్లు కేటాయించారు. ఎస్సీ రిజర్వు చేసిన కార్పొరేషన్లలో కర్నూలు, రాజమండ్రి ఉన్నాయి. బీసీలకు కేటాయించిన ఐదు కార్పొరేషన్లలో కాకినాడ, మచిలీపట్నం మహిళలకు రిజర్వు చేశారు. అదేవిధంగా ఏలూరు, అనంతపురం, చిత్తూరు కార్పొరేషన్లు బీసీ జనరల్ కేటగిరీగా నిర్ణయించారు. జనరల్ కేటగిరీలో తిరుపతి, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు ఉన్నాయి. జనరల్ మహిళల కేటగిరీలో విజయనగరం, శ్రీకాకుళం, గుంటూరు, కడప ఉన్నాయి.

రాధాకు లైన్ క్లియర్

రిజర్వేషన్ ప్రక్రియ పూర్తి కావడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. ప్రధానంగా రాష్ట్రంలో ముఖ్య నగరాలైన విజయవాడ, విశాఖపట్నం ఏ కేటగిరీ కింద రిజర్వు చేస్తారనే ఆసక్తి ఎక్కువగా ఉండేది. అంతా ఊహించినట్లుగానే విజయవాడ జనరల్ కేటగిరీకి కేటాయించడంతో మేయర్ పదవికి పోటీ తీవ్రంగా ఉండే అవకాశం ఉందని అంటున్నారు. ఈ సీటును కూటమిలో అరడజను మంది ఆశిస్తుండగా, పొత్తుల్లో భాగంగా విజయవాడ మేయర్ సీటును జనసేనకు కేటాయిస్తారని అంటున్నారు. దీంతో ఇక్కడ మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా కృష్ణా లేదా ఆయన భార్యను జనసేన నుంచి పోటీకి పెట్టొచ్చని ప్రచారం జరుగుతోంది. ఇక రాష్ట్ర ఆర్థిక రాజధాని విశాఖ సీటు జనరల్ మహిళకు రిజర్వు చేయడంతో ఎవరి దక్కించుకుంటారనే ఉత్కంఠ నెలకొంది.

జనసేన ఆశిస్తున్న సీట్లలో ఎలా అంటే..

రాష్ట్రంలో మొత్తం 17 కార్పొరేషన్లు ఉండగా, కూటమిలోని కీలక మిత్రపక్షం జనసేనకు నాలుగు లేదా ఐదు కార్పొరేషన్లు కేటాయించే అవకాశం ఉందని అంటున్నారు. దీంతో ఆయా కార్పొరేషన్లు ఏవి? ఏ రిజర్వేషన్ వర్తించిందనే చర్చ కూడా ఆసక్తి రేపుతోంది. ప్రధాన నగరమైన విజయవాడ కార్పొరేషన్ జనసేనకు కేటాయిస్తారని అనుకుంటుంగా, అది జనరల్ కేటగిరీగా నిర్ణయించారు. ఇక జనసేన ఆశిస్తున్న మచిలీపట్నం, కాకినాడ బీసీ మహిళకు రిజర్వు అయింది. అదేవిధంగా ఒంగోలు జనరల్ కేటగిరీకి ఏలూరు బీసీలకు రిజర్వు చేశారు. దీంతో జనసేన ఆశిస్తున్న సీట్లు ఎస్సీ, ఎస్టీలకు రిజర్వు చేస్తారనే భయం పక్కకు పోయిందని అంటున్నారు. ప్రధానంగా యువనేత నారా లోకేశ్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరిలో తొలిసారి కార్పొరేషన్ కు ఎన్నిక జరుగుతుండగా, ఆ సీటు ఎస్టీలకు రిజర్వు చేయడంతో తగిన అభ్యర్థులను వెతకడం కూటమికి సవాల్ గా మారే అవకాశం ఉందని అంటున్నారు.