విజయవాడ జైల్లో ఏదో జరుగుతోంది..? జైలర్ ఆకస్మిక బదిలీపై ఊహాగానాలు నిజమేనా!
విజయవాడ జైలు సూపరింటెండెంట్ హంసపాల్ ను ప్రభుత్వం ఎందుకంత ఆకస్మికంగా బదిలీ చేసిందనే విషయమై అటు అధికార వర్గాలతోపాటు, ఇటు రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర చర్చ జరుగుతోంది.
By: Tupaki Desk | 17 May 2025 9:00 PM ISTఏపీలో ఇప్పుడు విజయవాడ జిల్లా జైలుకు ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది. రాష్ట్రంలో విశాఖ, రాజమండ్రి, నెల్లూరు నగరాల్లో సెంట్రల్ జైళ్లు ఉన్నా, ప్రస్తుతం విజయవాడ జైలుకే డిమాండ్, ప్రాధాన్యం పెరిగిపోయింది. రాష్ట్ర ప్రజల ఫోకస్ కూడా బెజవాడ జైలుపైనే ఎక్కువగా ఉంది. దీనికి ప్రధాన కారణం ఆ జైలులో వీఐపీ ఖైదీలు ఉండటమే. పోలీసు డీజీ స్థాయి అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు, లిక్కర్ స్కాంలో అరెస్టు అయిన రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయరెడ్డి, మాజీ సీఎం జగన్ ఓఎస్డీ క్రిష్ణమోహన్ రెడ్డి, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీతోపాటు ఆయన అనుచరులు విజయవాడ జైలులో ఉన్నారు. వీరిని ములాఖత్ లో కలిసేందుకు కుటుంబ సభ్యులు, న్యాయవాదులు, రాజకీయ నాయకులు వస్తుండటంతో గత మూడు నాలుగు నెలలుగా విజయవాడ జైలు తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటోంది. జైలు సిబ్బంది కూడా క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో విజయవాడ జైలు సూపరింటెండెంట్ హంసపాల్ ను ప్రభుత్వం ఆకస్మికంగా బదిలీ చేసింది. ఆయన స్థానంలో ఓ జూనియర్ అధికారిని ప్రమోషన్ మీద తీసుకువచ్చి విజయవాడ జైలు బాధ్యతలు అప్పగించింది. ప్రస్తుత పరిస్థితుల్లో జరిగిన ఈ బదిలీపై అనేక ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.
విజయవాడ జైలు సూపరింటెండెంట్ హంసపాల్ ను ప్రభుత్వం ఎందుకంత ఆకస్మికంగా బదిలీ చేసిందనే విషయమై అటు అధికార వర్గాలతోపాటు, ఇటు రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర చర్చ జరుగుతోంది. వీఐపీ ఖైదీలు ఉన్న ఈ సమయంలో ఆయన పనితీరుపై అనుమానంతో బదిలీ చేశారా? లేక సమర్థంగా పనిచేయడం లేదన్న ఆగ్రహమా? లేక సాధారణ బదిలీయా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సుమారు వంద రోజులుగా మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఈ జైలులో ఉన్నారు. ఆయనకు వసతులు కల్పించడంపై సూపరింటెండెంట్ ప్రభుత్వ ఆదేశాలను తూ.చ. తప్పకుండా పాటించారని అంటున్నారు. పలుమార్లు తనకు జైలులో సౌకర్యాలుపై వంశీ కోర్టులో వేడుకున్నా నిబంధనల ప్రకారమే నడుచుకుంటున్నట్లు జైలు సిబ్బంది చెప్పారు. దీంతో వంశీ ఆవేదన అరణ్యరోదనగానే మిగిలిపోయిందని అంటున్నారు. ఇలా చూస్తే ప్రభుత్వానికి అనుకూలంగా సూపరింటెండెంట్ పనిచేసినట్లే భావించాలని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. అయినప్పటికీ ఆయనపై బదిలీ వేటు వేశారంటే జైలులో ఇంకేదో జరిగి ఉంటుందనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసులో సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్సార్ ఆంజనేయులు అరెస్టు అయిన విషయం తెలిసిందే. ఆయన కూడా ప్రస్తుతం విజయవాడ జైలులోనే ఉన్నారు. వాస్తవానికి ఆయన కేడర్, భద్రత ద్రుష్ట్యా పీఎస్సార్ ను రాజమండ్రి జైలుకు తరలిస్తారని అనుకున్నారు. కానీ, ఆయనను తరచూ వాయిదాలకు తీసుకురావాల్సివుండటంతో విజయవాడ జైలులోనే ఉంచారు. సీనియర్ పోలీసు అధికారిగా ఆయనకు జైలు సిబ్బంది ఏమైనా సహకరిస్తున్నారా? అనే అనుమానం ప్రభుత్వంలో ఉందని అంటున్నారు. దీంతో ఎన్నడూ లేనట్లు ఇటీవల జైళ్లశాఖ డీజీ హన్ష్ రాజ్ విజయవాడ జైలును ఆకస్మికంగా తనిఖీ చేశారంటున్నారు.
వార్షిక తనిఖీల్లో భాగంగానే జైళ్లశాఖ డీజీ విజయవాడ జైలును తనిఖీ చేసినట్లు చెబుతున్నా, ఆయన ఆకస్మిక తనిఖీకి ప్రధాన కారణం ప్రభుత్వ సూచనలే అని వైసీపీ నేతలు సందేహిస్తున్నారు. జైళ్ల శాఖ డీజీ వచ్చి వెళ్లిన తర్వాత విజయవాడ జైలు సూపరిటెండెంట్ ను ప్రభుత్వం బదిలీ చేసింది. రాజమండ్రి సెంట్రల్ జైలుకు అటాచ్ చేసి శిక్షణ కేంద్రంలో పోస్టింగు ఇచ్చింది. జిల్లా జైలు సూపరింటెంటెంటుగా పనిచేసిన అధికారికి ఇలాంటి పోస్టింగు ఇవ్వడమంటే ఓ విధంగా పనిష్మెంటేనంటూ చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో ఆయన స్థానంలో ఓ సబ్ జైలు సూపరింటెండెంట్ కు పదోన్నతి ఇచ్చి విజయవాడ జిల్లా జైలు బాధ్యతలు అప్పగించారు. సాధారణంగా బదిలీలు, పదోన్నతులు సహజమే అయినప్పటికి వీఐపీ ఖైదీలు ఉన్న సమయంలో ఈ బదిలీ జరగడం అనేక సందేహాలకు తావిస్తోంది. జైలులో ఏం జరిగిందనే విషయమై పెద్ద చర్చ జరుగుతోంది.
