Begin typing your search above and press return to search.

ఏబీవీపై టీడీపీ, వైసీపీ పోటాపోటీ.. ఫేక్ పోస్టులతో హల్ చల్

విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం కొత్త పుంతలు తొక్కుతోంది. రాష్ట్రంలో అత్యంత ప్రధానమైన విజయవాడ కార్పొరేషన్ ను దక్కించుకునేందుకు అధికార కూటమి, విపక్షం వైసీపీ పోటాపోటీగా పావులు కదుపుతున్నాయి

By:  Tupaki Desk   |   24 Oct 2026 11:00 PM IST
ఏబీవీపై టీడీపీ, వైసీపీ పోటాపోటీ.. ఫేక్ పోస్టులతో హల్ చల్
X

విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం కొత్త పుంతలు తొక్కుతోంది. రాష్ట్రంలో అత్యంత ప్రధానమైన విజయవాడ కార్పొరేషన్ ను దక్కించుకునేందుకు అధికార కూటమి, విపక్షం వైసీపీ పోటాపోటీగా పావులు కదుపుతున్నాయి. ప్రత్యర్థులను రాజకీయంగా దెబ్బకొట్టేందుకు వినూత్న వ్యూహాలు రచిస్తున్న ఇరుపార్టీలు ప్రధానంగా ఫేక్ ప్రచారాన్ని నమ్ముకోవడమే ఆశ్చర్యానికి గురిచేస్తోందని అంటున్నారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఏబీ వెంకటేశ్వరరావు ప్రధాన పార్టీలకు ఎన్నికల ప్రచారాస్త్రంగా మారిపోయారు. ఒకవైపు తనను గెలిపించాలని కోరుతూ ఏబీవీ సోషల్ మీడియా ద్వారా ప్రచారాన్ని ఊదరగొడుతుండగా, అదే సోషల్ మీడియాలో తమ ఓట్లు ఏబీకే వేయాలని కోరుతున్నట్లు టీడీపీ, వైసీపీ సోషల్ మీడియా గ్రూపుల్లో దర్శనమిస్తున్న పోస్టులు కలకలం రేపుతున్నాయి.

కార్పొరేషన్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి ఏబీ వెంకటేశ్వరరావుకు మద్దతు ఇస్తున్నట్లుగా టీడీపీ, వైసీపీ గ్రూపుల్లో ఆయా పార్టీ నేతలు నిర్ణయించినట్లుగా పోస్టులు వస్తున్నాయి. టీడీపీ గ్రూపుల్లో కమ్మ సామాజికవర్గం ఏబీ వెంకటేశ్వరరావుకు మద్దతు ఇచ్చేందుకు నిర్ణయించిందని, అందువల్ల తాము ఆయనకే ఓటేస్తామని కొందరు ప్రముఖుల పేర్లతో పోస్టులు హల్ చల్ చేస్తున్నాయి. ఇదే సమయంలో వైసీపీ గ్రూపులో ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షుడు దేవినేని అవినాశ్ పేరిట అదే తరహా పోస్టులు వైరల్ అవుతున్నాయి. దీంతో ఇరుపార్టీల కార్యకర్తలు గందరగోళం ఎదుర్కుంటుండగా, ఈ ప్రచారం ఆయా పార్టీల సోషల్ మీడియా కార్యకర్తల పనేనని పరిశీలకులు చెబుతున్నారు. ముందుగా ఎవరు ప్రారంభించారో స్పష్టంగా తెలియకపోయినా, ఇరుపార్టీల వారు ఒకరినొకరు దెబ్బ తీసేందుకు ఏబీవీ పేరును ఉపయోగించుకోవడమే ఆసక్తికరంగా మారిందని అంటున్నారు.

విజయవాడ కార్పొరేషన్ లో కూటమి అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ పోటీ చేస్తున్నారు. ఈయన జనసేన అభ్యర్థిగా బరిలోకి దిగడంతో టీడీపీ కేడర్ మద్దతు కీలకంగా మారింది. అయితే రాధాకు వ్యతిరేకంగా, ఏబీకి అనుకూలంగా టీడీపీ సోషల్ మీడియాలో రెండు రోజులుగా కొన్ని పోస్టులు వైరల్ అవుతున్నాయని చెబుతున్నారు. ఎవరో చేసిన టెక్ట్స్ మెసేజ్ ను స్క్రీన్ షాట్ తీసిన కొందరు యూజర్లు వాటిని వాట్సాప్ లో వైరల్ చేశారని చెబుతున్నారు. దీంతో వెంటనే అలర్ట్ అయిన టీడీపీ సోషల్ మీడియా ఆ స్క్రీన్ షాట్ ఎలా వచ్చిందని కూపీ లాగితే ప్రతిపక్షం వైసీపీ కుట్రగా తేలిందని అంటున్నారు. ఇదే సమయంలో వైసీపీ నగర నాయకుల పేరుతో ఏబీవీకి మద్దతు పలుకుతున్నట్లు దేవినేని యూత్ వింగ్ పేరుతో కొన్ని స్క్రీన్ షాట్స్ దర్శనమిచ్చాయని అంటున్నారు. దీంతో అధికార పార్టీయే తమ క్యాడర్ ను గందరగోళంలోకి నెట్టేందుకు ఈ పనిచేసిందని వైసీపీ ఆరోపిస్తోంది.

ఇలా రెండు పార్టీల వారూ పరస్పరం దెబ్బతీసుకోడానికి ఏబీవీకి విస్తృత ప్రచారం చేస్తున్నారని అంటున్నారు. కులాలు, ప్రాంతాలు, పార్టీల వారీగా జరుగుతున్న ఈ ప్రచారంతో స్వతంత్ర అభ్యర్థి ఏబీవీ కోరుకోకుండానే పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోందని చెబుతున్నారు. ఫలితంగా ఎన్నికల రేసులో ఏబీవీ ప్రధాన పోటీదారుగా అవతరించారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. నిజానికి ఎన్నికల ప్రక్రియ మొదలైన తొలినాళ్లలో ఏబీవీ ప్రభావం పెద్దగా ఉండదని విశ్లేషణలు వ్యక్తమయ్యాయి. అయితే రోజులు గడుస్తున్న కొద్దీ ఏబీవీ ప్రధాన పోటీదారుగా మారడమే అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

దీనికి ఏబీవీ స్వీయ ప్రయత్నాలు కంటే రెండు ప్రధాన పార్టీలు చేస్తున్న ఫేక్ ప్రచారమే ఆయనకు అనుకూలంగా మారుతోందని అంటున్నారు. రెండు పార్టీల వారూ పోటాపోటీగా ఏబీవీకి మద్దతు అంటూ చేస్తున్న ఫేక్ పోస్టులు తెగ వైరల్ అవుతూ నగర వాసుల్లో ప్రత్యేక చర్చకు దారితీస్తున్నాయని అంటున్నారు. అయితే ఈ ఫేక్ ప్రచారం వల్ల ఎక్కువగా కూటమి అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణకు నష్టం జరిగే అవకాశం ఉందని టీడీపీ నాయకులు భయపడుతున్నారు. దీంతో నకిలీ పోస్టులు వైరల్ చేయకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకునేలా అడుగులు వేస్తున్నారని చెబుతున్నారు.