Begin typing your search above and press return to search.

టాక్ ఆఫ్ ద విజయవాడ : ఆయన కృష్ణలంక శివమణి, సీఐ నాగరాజుపై హాట్ డిబేట్!

విజయవాడ నగరంలో తీవ్ర కలకలం సృష్టించిన రౌడీషీటర్ గాదె సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ నాగరాజుపై సానుభూతి వ్యక్తమవుతోంది.

By:  Tupaki Political Desk   |   7 Aug 2026 12:40 AM IST
టాక్ ఆఫ్ ద విజయవాడ : ఆయన కృష్ణలంక శివమణి, సీఐ నాగరాజుపై హాట్ డిబేట్!
X

విజయవాడ నగరంలో తీవ్ర కలకలం సృష్టించిన రౌడీషీటర్ గాదె సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ నాగరాజుపై సానుభూతి వ్యక్తమవుతోంది. సాయికృష్ణ కేసులో సీఐ నాగరాజును సిట్ పోలీసులు జూన్ 23న అరెస్టు చేసిన విషయం తెలిసిందే. జూన్ 19న సీఐ నాగరాజుపై సాయికృష్ణ తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ తర్వాత అరెస్టు చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తలించారు. ఇక సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో పూర్తి వివరాలు సేకరించేందుకు సిట్ నిందితుడు నాగరాజును కస్టడీలోకి తీసుకుని విచారించింది. బుధవారంతో ఆయన కస్టడీ ముగిసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.

అయితే సీఐ నాగరాజు విచారణ సందర్భంగా విజయవాడ నగరంలో మరోసారి సాయికృష్ణ కేసు హాట్ టాపిక్ గా మారింది. ప్రధానంగా కృష్ణలంక పోలీసుస్టేషనులో సీఐగా నాగరాజు పనిచేసిన సమయంలో ఉన్న పరిస్థితులను ఇప్పుడు జనం గుర్తు చేసుకుంటున్నారు. సాయికృష్ణ కేసులో నాగరాజు ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పటికీ అంతకుముందు ఆయన సమర్థంగా పనిచేసి లా అండ్ ఆర్డర్ ను అదుపులో పెట్టారని స్థానికులు గుర్తు చేసుకుంటున్నారు.

ముఖ్యంగా పోలీసుస్టేషన్ పరిధిలో గంజాయి బ్యాచుల ఆగడాలు అదుపు చేయడంతోపాటు బ్లేడ్ బ్యాచులు, రౌడీమూకల అల్లర్లను అణచివేశారని, ప్రధానంగా నేరస్తులకు సింహస్వప్నంలా పనిచేశారని చెబుతున్నారు. సీఐ నాగరాజు లేడన్న ధీమాతో గంజాయి, బ్లేడు బ్యాచులు మరొకసారి బయటకు వస్తారేమో అని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు. సాయికృష్ణ కేసులో కస్టడీలో విచారణ ఎదుర్కొన్న సీఐ నాగరాజును కోర్టు వద్ద కలిసిన కొందరు స్థానికులు తమ అభిప్రాయాలు పంచుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ప్రధానంగా కొందరు రాజకీయ నాయకులు, న్యాయవాదులు సైతం తాము నాగరాజు విషయంలో పొరపడ్డామని ఆయనతో వ్యాఖ్యానించినట్లు ప్రచారం జరుగుతోంది. సాయికృష్ణ కస్టోడియల్ డెత్ విషయంలో తాము సీఐ నాగరాజును తప్పుగా అనుకున్నామని, కానీ ఆయన జైలులో ఉన్న సమయంలో నాగరాజు పనితీరుపై స్థానికుల నుంచి వాస్తవాలు తెలిశాయని వ్యాఖ్యానించినట్లు సమాచారం. అయితే తన పట్ల సానుభూతి చూపుతున్న వారికి ధన్యవాదాలు చెప్పి సీఐ నాగరాజు మౌనంగా వెళ్లిపోయారని అంటున్నారు. నిజానికి సీఐ నాగరాజుపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సమయంలోనే స్థానికులు నిరసనలకు దిగారు. సీఐ నాగరాజు వచ్చిన తర్వాత తాము ధైర్యంగా ఉన్నామని గంజాయి, చైన్ స్నాచింగ్ ముఠాల ఆట కట్టించేలా ఆయన పనిచేశారని, అటువంటి అధికారిపై చర్యలు తీసుకోవడం భావ్యం కాదని నిరసనలు వ్యక్తం చేశారు. కానీ, సాయికృష్ణ డెత్ మిస్టరీలో ప్రభుత్వం సీరియస్ గా చర్యలు తీసుకోవడంతో సీఐ నాగరాజు అరెస్టు కావాల్సివచ్చిందని అంటున్నారు.