Begin typing your search above and press return to search.

రాములమ్మకు రిక్తహస్తమేనా?

గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రముఖ సినీ నటి విజయశాంతి బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   19 April 2024 7:21 AM GMT
రాములమ్మకు రిక్తహస్తమేనా?
X

గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రముఖ సినీ నటి విజయశాంతి బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఆమెకు ఎన్నికల ప్రచార ప్లానింగ్‌ కమిటీ కోఆర్డినేటర్‌ గా కాంగ్రెస్‌ అధిష్టానం బాధ్యతలు అప్పగించింది. అయితే ఎన్నికలకు కొద్ది రోజుల ముందే కాంగ్రెస్‌ లో చేరడంతో ఆమె పార్టీ కోసం చేసింది ఏమీ లేదు. కాగా వచ్చే లోక్‌ సభ ఎన్నికల్లో విజయశాంతి పోటీ చేయాలని భావించారు. ఈ క్రమంలో ఆమె గతంలో ఎంపీగా గెలిచిన మెదక్‌ లోక్‌ సభా స్థానంపై దృష్టి సారించారు. అయితే ఆమెకు ఎక్కడా సీటు ఇవ్వలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో సీటు ఆశించినా ఇదే పరిస్థితి ఎదురైంది. దీంతో ఇప్పుడు రాములమ్మ ఏం చేయనున్నారనే దానిపై ఆసక్తి నెలకొంది.

విజయశాంతి రాజకీయ ప్రస్థానం 1997లో మొదలైంది. 1997లో బీజేపీలో చేరి ఆ పార్టీ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. 2005లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సొంతంగా తల్లి తెలంగాణ పార్టీని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత కేసీఆర్‌ కోరిక మేరకు తల్లి తెలంగాణ పార్టీని టీఆర్‌ఎస్‌ లో విలీనం చేశారు. ఈ క్రమంలో టీఆర్‌ఎస్‌ తరఫున విజయశాంతి 2009లో మెదక్‌ నుంచి లోక్‌ సభకు ఎంపికయ్యారు.

ఈ క్రమంలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపించి విజయశాంతిని 2013లో కేసీఆర్‌ పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు. సస్పెన్షన్‌ కు గురైన తరువాత విజయశాంతి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. 2014 ఎన్నికలలో మెదక్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయారు. కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్న ఆమె 2020లో బీజేపీలో చేరారు.

ఈ క్రమంలో సినిమాల్లోకి కూడా రీ ఎంట్రీ ఇచ్చారు. ప్రిన్స్‌ మహేశ్‌ బాబు ‘సరిలేరు నీకెవ్వరూ’ సినిమాతో టాలీవుడ్‌ లోకి తిరిగి రీ ఎంట్రీ ఇచ్చారు. 13 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత విజయశాంతి నటించిన సినిమా ఇదే కావడం గమనార్హం. ఆ సినిమా తర్వాత మరే సినిమా ఆమె చేయలేదు. మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్‌ అయ్యారు.

ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు విజయశాంతి కాంగ్రెస్‌ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మెదక్‌ లోక్‌ సభ సీటును ఆశించారు. అయితే విజయశాంతికి మెదక్‌ సీటు దక్కలేదు. తెలంగాణ ప్రచార ఎన్నికల కమిటీ కన్వీనర్‌ గా, ప్లానింగ్‌ కమిటీ కోఆర్డినేటర్‌ గా ఉన్నా విజయశాంతిని ఎవరూ పట్టించుకోవడం లేదని అంటున్నారు. ఇందుకు తగ్గట్టే ఆమె కూడా ఎక్కడా హడావుడి చేయడం లేదు.

కొద్దిరోజుల క్రితం తుక్కుగూడలో రాహుల్‌ గాంధీ హాజరైన జనజాతర సభకు కూడా విజయశాంతి హాజరు కాలేదు. అసలు ఆమెను ఈ సభకు ఆహ్వానించలేదనే వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఆమె సినిమాల్లోనూ యాక్టివ్‌ గా లేరు. ప్రస్తుతం లోక్‌ సభ ఎన్నికల నేపథ్యంలో ఎవరైనా తనను ప్రచారానికి పిలిస్తే వెళ్లి చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు చెబుతున్నారు. ఒకప్పుడు స్టార్‌ హీరోయిన్‌ గా, పార్టీ అధినేతగా, ఎంపీగా ఒక వెలుగు వెలిగిన రాములమ్మను ఎవరూ పట్టించుకోకపోవడం హాట్‌ టాపిక్‌ గా మారింది.