Begin typing your search above and press return to search.

'రాములమ్మ' పోటీ అక్కడి నుంచేనా?

గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు నవంబర్‌ 30న ప్రముఖ సినీ నటి విజయశాంతి బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   20 March 2024 5:35 AM GMT
రాములమ్మ పోటీ అక్కడి నుంచేనా?
X

గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు నవంబర్‌ 30న ప్రముఖ సినీ నటి విజయశాంతి బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఆమెకు ఎన్నికల ప్రచార ప్లానింగ్‌ కమిటీ కోఆర్డినేటర్‌ గా కాంగ్రెస్‌ అధిష్టానం బాధ్యతలు అప్పగించింది. అయితే ఎన్నికలకు కొద్ది రోజుల ముందే కాంగ్రెస్‌ లో చేరడంతో ఆమె పార్టీ కోసం చేసింది ఏమీ లేదు. కాగా వచ్చే లోక్‌ సభ ఎన్నికల్లో విజయశాంతి పోటీ చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆమె మెదక్‌ లోక్‌ సభా స్థానంపై కన్నేసినట్టు సమాచారం.

విజయశాంతి రాజకీయ ప్రస్థానం 1997లో మొదలైంది. 1997లో బీజేపీలో చేరి ఆ పార్టీ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. 2005లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సొంతంగా తల్లి తెలంగాణ పార్టీని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత కేసీఆర్‌ కోరిక మేరకు తల్లి తెలంగాణ పార్టీని టీఆర్‌ఎస్‌ లో విలీనం చేశారు. ఈ క్రమంలో టీఆర్‌ఎస్‌ తరఫున విజయశాంతి 2009లో మెదక్‌ నుంచి లోక్‌ సభకు ఎంపికయ్యారు.

ఈ క్రమంలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపించి విజయశాంతిని 2013లో కేసీఆర్‌ పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు. సస్పెన్షన్‌ కు గురైన తరువాత విజయశాంతి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. 2014 ఎన్నికలలో మెదక్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయారు. కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్న ఆమె 2020లో బీజేపీలో చేరారు.

ఈ క్రమంలో సినిమాల్లోకి కూడా రీ ఎంట్రీ ఇచ్చారు. ప్రిన్స్‌ మహేశ్‌ బాబు ‘సరిలేరు నీకెవ్వరూ’ సినిమాతో టాలీవుడ్‌ లోకి తిరిగి రీ ఎంట్రీ ఇచ్చారు. 13 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత విజయశాంతి నటించిన సినిమా ఇదే కావడం గమనార్హం. ఆ సినిమా తర్వాత మరే సినిమా ఆమె చేయలేదు. మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్‌ అయ్యారు.

ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్‌ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మెదక్‌ లోక్‌ సభ సీటును ఆశిస్తున్నారు. మరోవైపు బీఆర్‌ఎస్‌ పార్టీకి కంచుకోటగా ఉన్న మెదక్‌ లో సీటు కోసం ఐదుగురు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 2001లో టీఆర్‌ఎస్‌ ఆవిర్భావం అప్పటి నుంచి ఆ తర్వాత జరిగిన 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో మెదక్‌ లోక్‌ సభా నియోజకవర్గంలో బీఆర్‌ఎస్సే గెలుపొందింది. 2004 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తరఫున కేంద్ర మాజీ మంత్రి ఆలె నరేంద్ర విజయం సాధించారు. 2009లో ప్రముఖ నటి విజయశాంతి టీఆర్‌ఎస్‌ తరపున గెలుపొందారు. ఇక 2014లో బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్, ఆయన రాజీనామాతో వచ్చిన ఉప ఎన్నికల్లో కొత్త ప్రభాకర్‌ రెడ్డి గెలిచారు. 2019 ఎన్నికల్లోనూ మరోసారి ప్రభాకర్‌ రెడ్డి విజయం సాధించారు.

ఇలా వరుసగా ఐదుసార్లు బీఆర్‌ఎస్‌ పార్టీకి కంచుకోటగా నిలిచిన మెదక్‌ లోక్‌ సభా నియోజకవర్గంపై ఈసారి ఐదుగురు బీఆర్‌ఎస్‌ నేతలు కన్నేశారని అంటున్నారు. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఇక్కడి నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయొచ్చని ప్రచారం జరుగుతోంది. కేసీఆర్‌ పోటీ చేయడం ఖాయమని.. చివరి నిమిషంలో ఆయన పోటీ చేయకపోతే సీటు దక్కించుకోవాలని పలువురు పోటీ పడుతున్నారు.

వీరిలో మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌ రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఒంటేరు ప్రతాప్‌ రెడ్డి, గాలి అనిల్‌ కుమార్‌ సీటును ఆశిస్తున్నారు. పద్మా దేవేందర్‌ రెడ్డి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. గాలి అనిల్‌ కుమార్‌ 2019 లోక్‌ సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు.

ప్రస్తుతం మెదక్‌ ఎంపీగా ఉన్న కొత్త ప్రభాకర్‌ రెడ్డి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. దీంతో మెదక్‌ ఎంపీ బరి నుంచి ఆయన తప్పుకున్నట్టే. కాంగ్రెస్‌ తరఫున విజయశాంతి టికెట్‌ ఆశిస్తుండగా.. మరి బీఆర్‌ఎస్‌ అధిష్టానం ఎవరికి సీటు ఇస్తుందో వేచిచూడాల్సిందే.