Begin typing your search above and press return to search.

రాజకీయ దుమారం.. ఎమ్మెల్సీ విజయశాంతికి బెదిరింపులు

తెలంగాణ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన సీనియర్ నాయకురాలు, ప్రస్తుత ఎమ్మెల్సీ విజయశాంతి తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

By:  Tupaki Desk   |   12 April 2025 12:05 PM IST
vijayashanti threat case
X

తెలంగాణ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన సీనియర్ నాయకురాలు, ప్రస్తుత ఎమ్మెల్సీ విజయశాంతి తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఆమెకు, ఆమె భర్త శ్రీనివాస ప్రసాద్‌కు ఓ వ్యక్తి నుంచి బెదిరింపులు రావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. డబ్బులు చెల్లించకపోతే నరకం అంటే ఏంటో చూపిస్తానంటూ సదరు వ్యక్తి వార్నింగ్ ఇవ్వడంతో విజయశాంతి వెంటనే పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటన రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది.

వివరాల్లోకి వెళితే... కొన్నాళ్ల క్రితం శ్రీనివాస ప్రసాద్‌కు చంద్రకిరణ్ రెడ్డి అనే వ్యక్తి పరిచయమయ్యాడు. తాను సోషల్ మీడియాలో పనిచేస్తానని, విజయశాంతికి మంచి పేరు తెచ్చిపెడతానని నమ్మబలికాడు. విజయశాంతి బీజేపీలో ఉన్న సమయంలో ఆమెకు సంబంధించిన ఓ సోషల్ మీడియా పేజీని చంద్రకిరణ్ నిర్వహించాడు. అయితే, రాజకీయ సమీకరణాలు మారడంతో విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో చేరడమే కాకుండా ఏకంగా ఎమ్మెల్సీ పదవిని చేపట్టారు. ఈ నేపథ్యంలో చంద్రకిరణ్ రెడ్డిని ఆ బాధ్యతల నుంచి తప్పించారు.

దీంతో ఆగ్రహానికి గురైన చంద్రకిరణ్ రెడ్డి తనకు డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశాడు. శ్రీనివాస ప్రసాద్ నుంచి సరైన స్పందన రాకపోవడంతో సహనం కోల్పోయిన చంద్రకిరణ్ బెదిరింపులకు దిగాడు. డబ్బులు చెల్లించకపోతే నరకం చూపిస్తానంటూ మెసేజ్‌లు పంపడంతో విజయశాంతి భయాందోళనకు గురయ్యారు.

ఈ బెదిరింపుల నేపథ్యంలో విజయశాంతి వెంటనే బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చంద్రకిరణ్ తనను, తన భర్తను బెదిరిస్తున్నాడని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనపై రాజకీయ వర్గాల్లో భిన్న స్పందనలు వస్తున్నాయి. ఒక మహిళా రాజకీయ నాయకురాలికి ఇలాంటి బెదిరింపులు రావడం దురదృష్టకరమని పలువురు అభిప్రాయపడుతున్నారు. పోలీసులు ఈ విషయంపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.