ఉద్యమకారులు లేకపోతే.. సీఎంలు ఉండేవారా: విజయశాంతి హాట్ కామెంట్స్
సీనియర్ నటి, రాజకీయ నాయకురాలు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ విజయశాంతి.. తాజాగా శాసన మండలిలో మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమం, ఉద్యమకారుల త్యాగాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
By: Garuda Media | 31 March 2026 1:00 AM ISTసీనియర్ నటి, రాజకీయ నాయకురాలు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ విజయశాంతి.. తాజాగా శాసన మండలిలో మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమం, ఉద్యమకారుల త్యాగాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమకారులను ఆదుకోవడంలో వారి కుటుంబాలకు భరోసా ఇవ్వడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని వ్యాఖ్యానించారు. ఉద్యమ కారులే లేకపోతే..తెలంగాణ వచ్చేదా? అని ప్రశ్నించారు. తెలంగాణ రాకపోతే.. ముఖ్యమంత్రులు, మంత్రులు అయ్యేవారా? అంటూ.. గత ప్రస్తుత ప్రభుత్వాలను ఆమె పరోక్షంగా ప్రశ్నించారు.
ఉద్యమకారులను, వారి కుటుంబాలను ఆదుకోవడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతగా పేర్కొన్న విజయశాంతి.. అదే జరిగితే తెలంగాణ లో మరో చరిత్ర లిఖిత మవుతుందన్నారు. తెలంగాణ కోసం.. అప్పట్లో ఎంతో ఉద్యమించామని గత అనుభవాలను చెప్పుకొచ్చా రు. ఉద్యమంలో అనేక మంది యువత తమ ప్రాణాలను సైతం త్యాగం చేశారని.. అనేక కుటుంబాల వారు ఉద్యమంలో కీలక పాత్ర పోషించారన్నారు. గత ప్రభుత్వం వారిని విస్మరించిందన్నారు. ప్రస్తుత ప్రభుత్వమైనా వారికి న్యాయం చేయాలని.. ఒకవేళ పట్టించుకోకపోతే.. అది చారిత్రక తప్పిదం అవుతుందని విజయశాంతి హెచ్చరించారు.
ఉద్యమ కారులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని ఆమె ప్రస్తుత ప్రభుత్వానికి సూచించారు. ``కాంగ్రెస్ ప్రభుత్వం అధికా రంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా.. ఉద్యమ కారులకు, వారి కుటుంబాలకు ఇంకా న్యాయం జరగలేదు`` అని విజయశాంతి సభ లో వ్యాఖ్యానించారు. ``తెలంగాణలో మన ప్రభుత్వం ఏర్పడగానే ఉద్యమకారులకు తొలి ప్రాధాన్యం ఇస్తామని చెప్పాం. కానీ.. ఇప్పటి వరకు వారి గురించి చర్చ కూడాచేయలేదు. వారికి 25 వేల రూపాయల చొప్పున గౌరవ పింఛను ఇస్తామని హామీ ఇచ్చాం. కానీ.. మనం మరిచిపోయాం``అని గుర్తు చేశారు.
అంతేకాదు.. ఉద్యమకారులపై గతంలో నమోదైన కేసులు ఎత్తివేస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని కూడా విజయశాంతి గుర్తు చేశారు. అదేవిధంగా వారికి `తెలంగాణ ఉద్యమకారులు` అనే గుర్తింపు కార్డులు కూడా ఇస్తామని చెప్పామన్నారు. కానీ.. ఒక్క హామీ కూడా నెరవేరలేదన్నారు. మనం ఇచ్చిన హామీలను మనం మరిచిపోయినా.. ఉద్యమ కారులు గుర్తు పెట్టుకున్నారన్న ఆమె.. ఎక్కడికి వెళ్లినా.. వారు వీటినే అడుగుతున్నారని తెలిపారు. ప్రభుత్వం సాధ్యమైనంత వేగంగా ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సి ఉందని చెప్పారు.
