విజయసాయి ఒక్కరు చాలు !
మరి అంతటి పవర్ ఫుల్ రోల్ ఆయన పోషించారు అని ఆనాటి ప్రతిపక్ష నాయకులు విమర్శిస్తూనే చెప్పుకొచ్చారు ఇక 2024లో విజయసాయిరెడ్డి నెల్లూరు నుంచి లోక్ సభకు ఎంపీగా పోటీ చేశారు.
By: Tupaki Desk | 19 April 2025 2:30 AMవైసీపీలో నంబర్ టూ తాను కాదని ఆ పార్టీ మాజీ నేత వి విజయసాయిరెడ్డి ఎంత చెప్పినా ఆయనకు ఆ హోదా చాలా ఏళ్ల పాటు ఉంది. జగన్ కి నీడగా ఆయన ఉన్నారు. అసలు ఆయన నేపథ్యం వైఎస్సార్ ఫ్యామిలీతో దశాబ్దాల అనుబంధం ఇవన్నీ చూస్తే కనుక ఆయనకు వైసీపీలో ఎంతో ప్రయారిటీ దక్కే ఉంటుందని అంతా అంటారు. అది నిజం కూడా. వైసీపీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల తరువాత తన స్థానం రెండు వేలకు వెళ్ళిపోయిందని విజయసాయిరెడ్డి తాజాగా చెబుతున్నారు.
దీనిని బట్టి చూస్తే ఆయన వైసీపీ అధికారంలో ఉన్న మిగిలిన నాలుగున్నరేళ్ల పాటు రెండు వేల స్థానంలోనే ఉండిపోయారు అని భావించాలి. అంతే కాదు ఆయన తీవ్ర అసంతృప్తితో నే పార్టీలో కొనసాగారు అని కూడా భావించాలి. అయితే ఇక్కడ మరో ప్రశ్న తలెత్తుతుంది. తన స్థానం అంత భారీ తేడాతో వేలల్లోకి మారిపోయినా ఆయన ఆ పార్టీలో ఎందుకు ఉన్నారు అన్నదే ఆ ప్రశ్న.
అంతే కాదు 2019లో వైసీపీ అధికారంలోకి వస్తే ఆయనకు 2022లో ఆయన రాజ్యసభ సీటు రెండవ మారు రెన్యూవల్ అయింది. మరి అపుడు ఆయనకు ప్రాధాన్యత దక్కినట్లా లేదా అన్నది మరో ప్రశ్నగా ఉంది. ఇక 2022 మధ్య దాకా ఆయన ఉత్తరాంధ్ర వైసీపీ ఇంచార్జిగా వ్యవహరించారు. చాలా చురుకుగా ఆయన ఆ సమయంలో ఉన్నారని ఉత్తరాంధ్ర సీఎం విజయసాయిరెడ్డి అని కూటమి నేతలు అప్పట్లో ఆయన మీద ఘాటు విమర్శలు కూడా చేశారు.
మరి అంతటి పవర్ ఫుల్ రోల్ ఆయన పోషించారు అని ఆనాటి ప్రతిపక్ష నాయకులు విమర్శిస్తూనే చెప్పుకొచ్చారు ఇక 2024లో విజయసాయిరెడ్డి నెల్లూరు నుంచి లోక్ సభకు ఎంపీగా పోటీ చేశారు. మరి ఆయన అసంతృప్తితోనే ఇదంతా చేశారా అన్నది కూడా మరో ప్రశ్నగా ఉంది. సరే వీటికి ఆయన వెర్షన్ ఆయనకు ఉంటుంది. అలాగే వైసీపీ వారి వద్ద దానిని కౌంటర్ చేసేవి కూడా ఉంటాయి.
వీటికి మించి మరో కీలకమైన మౌలికమైన ప్రశ్న వైసీపీ నేతలు వేస్తున్నారు 2024లో మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తే విజయసాయిరెడ్డి పార్టీని వీడి ఉండేవారా అన్నది. అది ఊహాజనితమైన ప్రశ్న అయినా లాజిక్ గా చెప్పే జవాబు కూడా విజయసాయిరెడ్డికి ఉందని అంటారు.
ఇవన్నీ కాదు కానీ వైసీపీలో అయితే విజయసాయిరెడ్డి చెప్పినట్లుగా ఆయన ప్రాధాన్యత తగ్గింది అన్నది నిజమే కావచ్చు. ఇక వైసీపీ ఓటమి పాలు అయి కోలుకోలేని దెబ్బ తిన్నది కళ్ళ ముందు ఉన్న వాస్తవం. ఈ సమయంలో కూడా ఆయన పార్టీలో అసంతృప్తితో ఇమడలేక ఆ గూటి నుంచి బయటపడాలని అనుకోని ఉండొచ్చు. ఇక ఆయనకు బీజేపీ పెద్దలతో ఉన్న సన్నిహిత సంబంధాలు అందరికీ తెలిసినవే అని అంటారు.
మొత్తానికి విజయసాయిరెడ్డి మేధావి అయిన రాజకీయ నేత. ఆయన రొటీన్ పొలిటీషియన్ కాదు. ఆయనకు ఎపుడు ఎక్కడ ఎంట్రీ ఇవ్వాలి ఎలా ఎగ్జిట్ కావాలన్నది తెలుసు అని ప్రత్యర్ధులు అంటారు. మరో వైపు చూస్తే విజయసాయిరెడ్డి వంటి వారు వైసీపీకి ఎంత బలమో ఆయన దూరం అయితే అదే వైసీపీకి అంత ప్రమాదం అని కూడా విశ్లేషణలు ఉన్నాయి.
వైసీపీ ఒంటి స్తంభం మీద కట్టిన నిర్మాణం. దానికి కర్త కర్మ క్రియ అన్నీ జగనే. అయితే వైసీపీ వరకే కాదు మొత్తం మూడు తరాలుగా వైఎస్సార్ ఫ్యామిలీతో అనుబంధం ఎంతో పెనవేసుకున్న విజయసాయిరెడ్డి వంటి వారు పార్టీని వీడడం వైసీపీకి ఇబ్బందికరమే. ఆయన ప్రత్యర్ధిగా ఉంటే మిగిలిన వారు ఎవరూ కూడా వైసీపీ ముందు సరిపోరు కూడా అని అంటారు. ఒక్క విజయసాయిరెడ్డి చాలు వైసీపీ ఒంటి స్థంభం మేడను అతలాకుతలం చేయడానికి.
విజయసాయిరెడ్డి తానే స్వయంగా వెళ్ళిపోయారా లేక పొగ పెట్టి వెళ్ళిపోయేలా చేశారా అన్నది ఎవరికీ తెలియకపోయినా ఒకటి మాత్రం నిజం. విజయసాయిరెడ్డి వైసీపీని ఎదురు నిలిచినా లేక వైసీపీ ఆయనకు ఎదురు వెళ్ళినా నష్టం మాత్రం కచ్చితంగా ఫ్యాన్ పార్టీకే అని అంటున్నారు. ఎందుకంటే వైసీపీకి నిన్నటిదాకా అతి ముఖ్య భాగంగా ఉన్న విజయసాయిరెడ్డితో పెట్టుకున్న వైసీపీకి ముందు ముందు ఇబ్బందులే వస్తాయన్నది కఠిన విశ్లేషణగా ఉంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.