రావోయి సాయీ... అవునా నిజమేనా ?
వైసీపీలోనూ బయట ఒక ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. వైసీపీ పునాది వంటి బిగ్ షాట్ అయిన నేత వి విజయసాయిరెడ్డి తిరిగి వైసీపీలోకి వస్తారా అన్నదే ఆ చర్చ.
By: Tupaki Desk | 2 July 2025 3:00 PM ISTవైసీపీలోనూ బయట ఒక ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. వైసీపీ పునాది వంటి బిగ్ షాట్ అయిన నేత వి విజయసాయిరెడ్డి తిరిగి వైసీపీలోకి వస్తారా అన్నదే ఆ చర్చ. ఆయన వైసీపీని ఈ ఏడాది జనవరిలో వదిలేశారు. ఆ పార్టీ నుంచి సంక్రమించిన రాజ్యసభ సీటునూ వదులుకున్నారు. దాంతో ఆయన మీద వైసీపీ అధినేత జగన్ చాలా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా చెప్పుకున్నారు.
ఈ ఆగ్రహాన్ని ఆయన దాచుకోకుండా మీడియా ముందు కూడా విజయసాయిరెడ్డి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయన టీడీపీ కూటమికి భయపడిపోయారు. తన పదవికి తాకట్టు పెట్టారు అని కూడా అన్నారు. అయితే జగన్ ఎన్ని మాటలు అన్నా విజయసాయిరెడ్డి నుంచి మాత్రం ఆయన మీద ఒక్క విమర్శ కూడా రాలేదు. ఆయన ఎంతసేపూ జగన్ చుట్టూ ఉన్న కోటరీ మీదనే కామెంట్స్ చేశారు. వారి వల్లనే ఇబ్బంది వస్తోంది అని అన్నారు. వారికి అసలు రాజకీయ అవగాహన లేదని దాని వల్లనే జగన్ ని చిక్కుల్లో పడేస్తున్నారు అని కూడా అన్నారు.
ఇవన్నీ జరిగాక ఇపుడు విజయసాయిరెడ్డి ట్విట్టర్ అయితే రాజకీయం ఊసే తలవడం లేదు. ఆయన ఐటీ గురించి, ఏఐ గురించి యువత ఉద్యోగ అవకాశాల గురించి మాత్రమే ట్వీట్లు పెడుతున్నారు. ఇదిలా ఉంటే విజయసాయిరెడ్డి నిజానికి బీజేపీలోకి వెళ్తారు అని చాలా మంది అనుకున్నారు. ఆయనకు కూడా నేరుగా బీజేపీ పెద్దలతో మంచి సాన్నిహిత్యం ఉండడం కూడా ఈ ప్రచారానికి ఊతమిచ్చింది.
ఇక తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను అని ఆయన చెప్పినపుడు కూడా బీజేపీ పెద్దలకు ధన్యవాదాలు చెప్పడంతో ఆ ప్రచారం మరింత పెరిగింది. ఇదిలా ఉంటే విజయసాయిరెడ్డి బీజేపీలో చేరాలని అనుకున్నా అది కుదరలేదని అంటున్నారు. కూటమి నుంచి బ్రేకులు పడ్డాయని చెబుతున్నారు. మరి ఈ ప్రచారంలో ఏది వాస్తవం ఉందో తెలియదు కానీ ఆయన మాత్రం తాను వ్యవసాయానికే పరిమితం అన్నారు.
అయితే ఆయన మళ్ళీ వైసీపీ వైపు రావచ్చు అన్న చర్చ గత కొద్ది కాలంగా సాగుతోంది. విజయసాయిరెడ్డి పట్ల జగన్ కి కూడా కోపం తగ్గిందని ఆయన విషయంలో బాగా మెత్తబడ్డారు అని ప్రచారం సాగుతోంది. వైసీపీలో అన్నీ తెలిసిన వారుగా విజయసాయిరెడ్డి ఉన్నారని అంటారు. పైగా జగన్ గురించి ఆయనకు ఆయన గురించి జగన్ కి పూర్తిగా తెలుసు అని చెబుతారు.
మధ్యలో ఎవరు వచ్చినా కూడా ఆ గ్యాప్ ని భర్తీ చేయలేరని అంటారు ఇక మరో నాలుగేళ్ల పాటు వైసీపీ ప్రతిపక్షంలో ఉండాలి. పైగా జగన్ మరో పాదయాత్రకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మరి జగన్ పాదయాత్రను 2017 ప్రాంతంలో డిజైన్ చేసిన వారిలో విజయసాయిరెడ్డి కూడా కీలకంగా ఉన్నారని అంటారు. ఇపుడు కూడా పార్టీకి ఆయన అవసరం ఉందని అంటున్నారు.
ఇక విజయసాయిరెడ్డి వైపు నుంచి చూసినా జగన్ విషయంలో ఆయనకు ఏమీ కోపం లేదని పార్టీలో కొందరి వైఖరి వల్లనే ఇదంతా అని అంటున్న వారూ ఉన్నారు. సోషల్ మీడియాలో మాత్రం విజయసాయిరెడ్డి తిరిగి వైసీపీలోకి వస్తారు అన్న ప్రచారం సాగుతోంది. మరి ఇది పుకారుగా ఉండిపోతుందా లేక నిజం అవుతుందా అన్నది చూడాలి. రాజకీయల్లో వచ్చిన ప్రతీ పుకారూ నిజం కాదు, అలాగే ప్రతీ పుకారూ నిజం అయిన సందర్భాలూ ఉన్నాయి. మరి ఈ విషయంలో రాయబారాలు ఏమైనా జరుగుతున్నాయా అంటే జవాబు కోసం రాజకీయ తెర మీద వేచి చూడాల్సిందే.
