Begin typing your search above and press return to search.

ఈసీ ముందు భారీ డిమాండ్ పెట్టిన విజయసాయిరెడ్డి!

అలా రోజుకు కనీసం నాలుగైదు ట్వీట్లు వేస్తూ సోషల్ మీడియాను చాలా పవర్ ఫుల్ గా వాడుకున్న పవర్ ఫుల్ పొలిటీషియన్ గా విజయసాయిరెడ్డి ఉండేవారు.

By:  Tupaki Desk   |   15 July 2025 2:00 AM IST
ఈసీ ముందు భారీ డిమాండ్ పెట్టిన విజయసాయిరెడ్డి!
X

విజయసాయిరెడ్డి ఇపుడు అయితే కాస్తా మీడియా కనుమరుగు అయ్యారు, అంతే కాదు అడపా తడపా ట్వీట్లు వేస్తున్నారు కానీ సోషల్ మీడియాకు దూరం జరిగారు కానీ ఒకనాడు అయితే ఆయన ట్విట్టర్ హ్యాండిల్ మోత మోగాల్సిందే. ప్రత్యర్ధి మీద ఆయన వేసే ట్వీట్లు ఒక రేంజిలో పేలేవి. వాటి మీద అవతల వారు మండిపోయేవారు. అలా రోజుకు కనీసం నాలుగైదు ట్వీట్లు వేస్తూ సోషల్ మీడియాను చాలా పవర్ ఫుల్ గా వాడుకున్న పవర్ ఫుల్ పొలిటీషియన్ గా విజయసాయిరెడ్డి ఉండేవారు.

అయితే వైసీపీ ఓడాక ఆయన కొన్నాళ్ళు సైలెంట్ మోడ్ లోకి వెళ్ళారు. ఆ తరువాత ఏమనుకున్నారో ఏమో కానీ తన ఎంపీ పదవికీ వైసీపీకి రాజీనామా చేసి తానే తెర మరుగు అయ్యారు. వ్యవసాయం తనకు ఇష్టమని చెప్పిన విజయసాయి లిక్కర్ స్కాం విషయంలో విచారణ సందర్భంగా మీడియా ముందుకు అపుడపుడు మాత్రమే వస్తున్నారు.

మొత్తానికి చూస్తే విజయసాయిరెడ్డి జోరు తగ్గింది అనుకుంటే తాజాగా ఆయన ఈసీ ముందు ఒక భారీ డిమాండ్ పెట్టి రాజకీయ వర్గాలలో ఆలోచనలు రేకెత్తించారు. ఇంతకీ ఆయన పెట్టిన డిమాండ్ ఏమిటి అంటే దేశవ్యాప్తంగా ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం నిర్వహించాలని కోరారు. అక్రమ వలసదారులను బహిష్కరించాలని కూడా కోరారు.

ఆయన ఈ విధంగా చేయడానికి కారణం ఏంటి అంటే తొందరలో బీహార్ లో జరగబోయే ఎన్నికల కోసం ఈసీ ప్రత్యేకంగా ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని చేపడుతోంది. బీహార్ లో నేపాల్, బంగ్లాదేశ్, మయన్మార్ జాతీయులు అక్రమంగా నివాసం ఉండడమే కాకుండా వారికి ఓటర్ కార్డు ఉందని ఆధార్ కార్డు ఉంది, నివాస ధృవీకరణ పత్రాలు కూడా వారికి ఉన్నాయి.

దీంతో ఈ విషయం మీద విజయసాయిరెడ్డి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. నిజానికి ఈ దేశస్తులు ఎలా వచ్చారు, వారికి గుర్తింపు కార్డులు అన్నీ ఉండడం ఏమిటి అన్న చర్చ ఇపుడు జరుగుతోంది. ఇక వీరి ఓట్ల ఏరివేత కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఎన్డీయే పార్టీల నుంచి వచ్చిన డిమాండ్లు ఉన్నాయి. ఇపుడు విజయసాయిరెడ్డి కూడా ఈ వ్యవహారం షాకింగ్ గా ఉందని అంటున్నారు.

అంతే కాదు దేశంలో అన్ని రాష్ట్రాలలో ఈ తరహా గుర్తింపు కార్డులు ఓటరు కార్డులు ఉన్న విదేశీయుల ఏరివేత కూడా చర్చకు వస్తోంది. అందుకే దేశమంతా ప్రత్యేకంగా ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని చేపట్టాలని ఆయన కోరుతున్నారు. మరి ఈ తరహా డిమాండ్ క్రియాశీల రాజకీయాల్లో ఉన్న వారు ఎవరైనా ఇప్పటిదాకా చేశారో లేదో తెలియదు కానీ విజయసాయిరెడ్డి మాత్రం గట్టిగానే చేశారు.

ఈ విధంగా చేయడం ద్వారా అక్రమ వలసదారులను బహిష్కరించాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని ఈసీని కూడా డిమాండ్ చేశారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి చేసిన ట్వీఎట్ వైరల్ అవుతోంది. చూడాలి మరి మాజీ ఎంపీ మాజీ రాజకీయ నాయకుడు అయిన విజయసాయిరెడ్డి విషయంలో ఈసీ కానీ కేంద్రం కానీ ఏ విధంగా స్పందిస్తాయో.