గండం గట్టెక్కింది? శ్రీవారి సన్నిధిలో విజయసాయిరెడ్డి
ఎన్నడూ లేనట్లు సాయిరెడ్డి ఆకస్మాత్తుగా శ్రీవారిని దర్శించుకోవడం, తలనీలాలు సమర్పించడం గమనార్హం. లిక్కర్ స్కాంలో 5వ నిందితుడిగా సాయిరెడ్డిని పోలీసులు గుర్తించారు.
By: Tupaki Desk | 3 May 2025 10:52 AMవైసీపీ మాజీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి శనివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయాన్ని సతీసమేతంగా శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకున్న సాయిరెడ్డి దేవుడికి తలనీలాలు సమర్పించారు. ఆకస్మాత్తుగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన సాయిరెడ్డి ప్రస్తుతం లిక్కర్ స్కాంలో నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ పోలీసులు నిందితులను వరుసగా అరెస్టు చేస్తుండగా, సాయిరెడ్డి విషయంలో ప్రస్తుతం ఎలాంటి చర్యలకు ఉపక్రమించడం లేదు. ఈ పరిస్థితుల్లో ఆయన శ్రీవారిని దర్శించుకోవడం చర్చనీయాంశమవుతోంది.
ఆపద మొక్కులు వాడని శ్రీవారిపై భక్తులకు నమ్మకం. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో తనను గండెం నుంచి గట్టెక్కించాలని మాజీ ఎంపీ కూడా మొక్కులు చెల్లించుకున్నారా? అనే చర్చ జరుగుతోంది. ఎన్నడూ లేనట్లు సాయిరెడ్డి ఆకస్మాత్తుగా శ్రీవారిని దర్శించుకోవడం, తలనీలాలు సమర్పించడం గమనార్హం. లిక్కర్ స్కాంలో 5వ నిందితుడిగా సాయిరెడ్డిని పోలీసులు గుర్తించారు. అయితే విచారణలో తాను పూర్తిగా పోలీసులకు సహకరిస్తానని సాయిరెడ్డి చెబుతుండటంతో ఆయన అరెస్టు విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని అంటున్నారు.
ప్రస్తుతం లిక్కర్ స్కాంలో ఏ1 కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డితో సహా పలువురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో కీలక నిందితుడిగా పోలీసులు అనుమానిస్తున్న రాజంపేట వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ప్రస్తుతం ముందస్తు బెయిల్ పై ఉన్నారు. మిగితా నిందితుల అరెస్టుకు సిట్ వేగంగా కదుపుతుండగా, సాయిరెడ్డి కనీసం ముందస్తు బెయిలుకు కూడా దరఖాస్తు చేయలేదు. ఈ పరిస్థితుల్లో సిట్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది ఆసక్తి రేపుతోంది.
ఇలాంటి పరిస్థితుల్లో సాయిరెడ్డి తిరుమల రావడం చర్చనీయాంశమవుతోంది. రాజకీయాలకు బైబై చెప్పిన సాయిరెడ్డి మళ్లీ రాజకీయాల్లోకి వస్తారని కొద్దిరోజులుగా ప్రచారం జరిగింది. ఆయన బీజేపీ తరఫున రాజ్యసభకు వెళతారని కూడా చర్చ నడిచింది. అయితే ఆయన స్థానంలో అనూహ్యంగా బీజేపీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ పాకా సత్యనారాయణను ఎంపిక చేశారు. దీంతో విజయసాయిరెడ్డి భవిష్యత్తుపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇక ఈ రోజు తిరుమలలో భక్తుల రద్దీ తీవ్రంగా ఉంది. మొత్తం 74 వేల 344 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. రూ.2.05 కోట్ల హుండీ ఆదాయం సమకూరింది.