వైసీపీ పని సరి...సాయి రెడ్డి షాకింగ్ కామెంట్స్
ఏపీలో వైసీపీ పని సరి అని విజయసాయిరెడ్డి అంటున్నారు. ఆ పార్టీకి ప్రజలు గత ఎన్నికల్లోనే బుద్ధి చెప్పారని ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు.
By: Satya P | 25 April 2026 9:15 AM ISTవైసీపీకి అన్ని విధాలుగా అయిన వారు, ఆ పార్టీలో నంబర్ టు గా పనిచేసిన వారు జగన్ కి ఒకనాడు ఎంతో ఇష్టుడు మూడు తరాలుగా వైఎసార్ కుటుంబంతో అనుబంధం పెనవేసుకున్న వారు అయిన మాజీ ఎంపీ మాజీ వైసీపీ నేత వి విజయసాయిరెడ్డి రాజకీయాల్లోకి తొందరలోనే వస్తాను అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతే కాదు దానికి ముహూర్తం కూడా చెప్పేశారు. తాను జూలైలో రాజకీయ రీ ఎంట్రీ ఇస్తాను అని ప్రకటించారు. అంతే కాదు తన రాజకీయమేంటో చూపిస్తాను అని కూడా బిగ్ సౌండ్ చేశారు.
వైసీపీకి బుద్ధి చెప్పారు:
ఏపీలో వైసీపీ పని సరి అని విజయసాయిరెడ్డి అంటున్నారు. ఆ పార్టీకి ప్రజలు గత ఎన్నికల్లోనే బుద్ధి చెప్పారని ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు. అందువల్ల ఏపీలో మరో కొత్త రాజకీయ పార్టీ అవసరం ఉందని విజయసాయిరెడ్డి చెప్పడం విశేషం. అదే విధంగా తన రాజకీయం కూడా అయిపోలేదని ఆయన అంటున్నారు.
మీడియా తోడుగా :
రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తూనే మీడియాతో కూడా తోడు తెచ్చుకుంటున్నారు విజయసాయిరెడ్డి. తాను తొందరలోనే మీడియా రంగంలోకి అడుగు పెడతాను అని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికి ఒకసారి మీడియా సారధ్య బాధ్యతలు వహిస్తున్నట్లుగా ప్రకటించిన విజయసాయిరెడ్డి ఇపుడు మరోసారి అదే విషయం చెప్పడంతో ఆయన మీడియా రంగంలోకి వచ్చేందుకు పూర్తి పట్టుదలతో ఉన్నారని అర్ధం అవుతోంది. ఆయన డిజిటల్ మీడియాతోనే శ్రీకారం చుడతారు అని అంటున్నారు.
కొత్త పార్టీ కూడానా :
ఇక విజయసాయిరెడ్డి మరో కీలక ప్రకటన చేశారు. ఏపీ రాజకీయాల్లో శూన్యత ఉందని అంటున్నారు. అందువల్ల కొత్త పార్టీ పెట్టాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. వైసీపీని జనాలు ఓడించారు అని ఆయన చెప్పిన దానిని బట్టి చూస్తే మరోసారి ఏపీలో వైసీపీ అధికారంలోకి రాదు అన్న సౌండ్ ధ్వనిస్తోంది. గతంలో కూడా ఆయన ఇదే విషయం చెప్పారు కూటమి కలిసికట్టుగా ఉంటే వైసీపీ గెలిచేది లేదని కూడా విశ్లేషించారు. ఇపుడు చూస్తే ఏపీలో కొత్త పార్టీ కోసం అనుకూల వాతావరణం ఉందని అంటున్నారు. దీనిని బట్టి చూస్తే విజయసాయిరెడ్డి కొత్త పార్టీ పెడతారా అన్న చర్చ కూడా సాగుతోంది. కొద్ది నెలల క్రితం శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన అవసరం అయితే తానే కొత్త పార్టీ పెడతాను అని కూడా చెప్పారు. ఇపుడు మరోసారి ఆయన కొత్త రాజకీయ పార్టీ అని ప్రకటన చేయడంతో ఆయన నాయకత్వంలో ప్రాంతీయ పార్టీ పురుడు పోసుకుంటుంది అని ప్రచారం అయితే సాగుతోంది.
ఈడీ దాడులతో :
ఇక ఈడీ విజయసాయిరెడ్డి ఇంటి మీద దాడులు నిర్వహించడం సంచలనంగా మారింది. అయితే తన ఇంట్లో ఏమీ దొరకలేదని విజయసాయిరెడ్డి మీడియాకు చెప్పారు. సోదా చేసిన అధికారులకు తన ఇంట్లో ఏమీ ఆధారాలు లభించలేదని అన్నారు. అయితే ఈడీ అధికారులు మాత్రం విచారణకు తనను పిలిపించే అవకాశం ఉందని ఆయన చెప్పడం విశేషం. మొత్తం మీద చూస్తే విజయసాయిరెడ్డి మరో రెండు నెలలలో రాజకీయాల్లోకి రానున్నట్లుగా చెబుతున్నారు. మరి సొంత పార్టీతో వస్తారా లేదా అన్నది చూడాల్సి ఉంది.
