Begin typing your search above and press return to search.

విజయసాయి రాజకీయ సన్యాసమే నిజమవుతుందా ?

మాజీ ఎంపీ మాజీ రాజకీయ నాయకుడు అయిన వి విజయసాయిరెడ్డి రాజకీయం ఏ వైపు అన్న ప్రశ్న వస్తోంది.

By:  Tupaki Desk   |   2 Jun 2025 1:56 AM IST
విజయసాయి రాజకీయ సన్యాసమే నిజమవుతుందా ?
X

మాజీ ఎంపీ మాజీ రాజకీయ నాయకుడు అయిన వి విజయసాయిరెడ్డి రాజకీయం ఏ వైపు అన్న ప్రశ్న వస్తోంది. మామూలుగా అయితే ఈ ప్రశ్న ఉత్పన్నం కాకూడదు, కానీ చురుకైన రాజకీయ నేతగా ఇటీవల కాలం దాకా ఉంటూ వచ్చిన వారు విజయసాయిరెడ్డి. అంతే కాదు ఆయన ట్విట్టర్ హ్యాండిల్ ఎపుడూ సౌండ్ చేస్తూనే ఉంటుంది. ఆయన కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడినపుడు రాజకీయ సన్యాసం ప్రస్తుతానికే అని ఒక సస్పెన్స్ అలా ఉంచేశారు.

దాంతో ఆయన రాజకీయం ఏ రూట్ తీసుకుంటుంది అన్న చర్చ అయితే అంతటా ఉంది. ఇక విజయసాయిరెడ్డి జనవరి 25న తన రాజకీయ సన్యాసం గురించి ప్రకటించి. అదే నెల చివరిలో వైసీపీ నుంచి వైదొలిగారు. ఇక విజయసాయిరెడ్డి మీద ఆనాటి నుంచి ప్రచారం అయితే పెద్ద ఎత్తున సాగుతూ వస్తోంది. ఆయన బీజేపీలో చేరుతారు అని అంతా అనుకుంటూ వచ్చారు.

ఆయన రాజకీయాల నుంచి వైదొలగుతూ ట్వీట్ చేసినపుడు అందులో బీజేపీ పెద్దలను పొగుడుతూ ఉంది కాబట్టి ఆయనది అదే రూట్ అని అనుకున్నారు. ఇక విజయసాయిరెడ్డికి ఢిల్లీ స్థాయిలో పలుకుబడి చాలానే ఉంది కాబట్టి ఆయన జాతీయ పార్టీలో చేరి మరోసారి తన హవా చాటుతారని అనుకున్నారు.

కానీ విజయసాయిరెడ్డి విషయంలో అవేమీ జరగలేదు. ఆయన తాజాగా ఒక ట్వీట్ చేస్తూ తనను కెలకవద్దు అని వైసీపీ కోటరీకి వార్నింగ్ ఇచ్చారు. అందులోనే తాను టీడీపీలో ఈ జన్మలో చేరను అన్నారు. అంతే తప్ప అసలు ఏ పార్టీలోనూ చేరను అనలేదు కదా అని గుర్తు చేస్తున్నారు. అంటే ఆయన బీజేపీ వైపు చూపు సారించారు అని ప్రచారం ఇంకా చేస్తూనే ఉన్నారు.

అయితే విజయసాయిరెడ్డి విషయంలో మరో విధమైన ప్రచారం సాగుతోంది. అదేంటి అంటే ఆయన బీజేపీలో చేరాలని చేసిన ప్రయత్నాలు అంతగా ఫలించలేదని అంటున్నారు. దానికి కారణం ఏపీలోని కూటమి పెద్దల వ్యతిరేకత అని చెబుతున్నారు. ఈ కారణంగానే బీజేపీ నుంచి ఆయనకు పిలుపు రాలేదని అంటున్నారు.

ఇంకో వైపు వేరే రకమైన పుకారు కూడా వస్తోంది. లేటెస్ట్ గా జగన్ మీద ఏ ఒక్క ముక్కా తాను వ్యతిరేకంగా ఇప్పటిదాకా మాట్లాడింది లేదు, ఇక ముందు కూడా మాట్లాడను అని సాఫ్ట్ కార్నర్ తో వ్యవహరించారు అని గుర్తు చేస్తున్నారు. దాంతో విజయసాయిరెడ్డి తిరిగి వైసీపీ వైపు చూస్తున్నారు అని ఒక గాసిప్ మొదలైంది.

విజయసాయిరెడ్డి వైసీపీకి పునాది లాంటి వారు. పైగా వైఎస్సార్ కుటుంబంతో ఆయనకు మూడు తరాల అనుబంధం ఉంది. మరో వైపు చూస్తే జగన్ తోనూ ఆయనకు వ్యక్తిగతంగా బలమైన బంధం ఉంది అని అంటున్నారు. ఈ ఇద్దరూ కలిసి పదహారు నెలలు జైలు జీవితం గడిపారు అని గుర్తు చేస్తున్నారు.

అందువల్ల రాజకీయాల్లో ఏదీ అసాధ్యం కాదు కాబట్టి విజయసాయిరెడ్డి తిరిగి వైసీపీలోకి వస్తారని ఒక పుకారు షికారు చేస్తోంది. విజయసాయిరెడ్డి అలిగి వెళ్ళిపోయారు తప్ప ఆయనను ఎవరూ వెళ్ళిపోమనలేదు అని గుర్తు చేస్తున్నరు. అందువల్ల ఆయన మళ్ళీ రావాలనుకుంటే ఆస్కారం ఉంటుందని చెప్పే వారూ ఉన్నారు.

మరి అదంతా జరిగేనా అంటే రేపటి రోజున ఏమి జరుగుతుంది అన్నది ఎవరికీ తెలియదు అని అంటున్నారు. ఒక వేళ అలా కనుక జరగకపోతే మాత్రం విజయసాయిరెడ్డ్ ముందే ప్రకటించినట్లుగా ఆయన రాజకీయ సన్యాసమే నిజం అయ్యేది నూరు పాళ్లు ఉంది అని అంటున్నారు. ఏది ఏమైనా రాజకీయ మేధావిగా ఉంటూ అనతికాలంలోనే రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు సాధించుకున్న విజయసాయిరెడ్డి రాజకీయం ఏమిటి అంటే జవాబు కోసం భవిష్యత్తు వైపే చూడాలని అంటున్నారు.