బిగ్ బాస్ ఎవరు? విజయసాయికి తెలియదంట!
‘‘లిక్కర్ స్కాంలో బిగ్ బాస్ ఎవరో తెలియదు.. బిగ్ బాస్ కోసం మీడియా చెబితే నాకు తెలుసుకోవాలని ఉంది.
By: Tupaki Desk | 19 April 2025 1:33 PM IST‘‘లిక్కర్ స్కాంలో బిగ్ బాస్ ఎవరో తెలియదు.. బిగ్ బాస్ కోసం మీడియా చెబితే నాకు తెలుసుకోవాలని ఉంది. అంతేకాదు లిక్కర్ స్కాంలో వేల కోట్ల రూపాయలు ఎవరికి అందాయో కూడా తెలియదు’’ అంటూ వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి. లిక్కర్ స్కాంలో కర్త, కర్మ, క్రియ అంతా రాజ్ కసిరెడ్డి అంటూ గతంలో చెప్పిన విజయసాయి.. తనను పోలీసులు అడిగితే మరిన్ని వివరాలు చెబుతానంటూ గతంలో ప్రకటించారు. అయితే శుక్రవారం జరిగిన విచారణలో పలు కీలక అంశాలను ఆయన దాట వేశారంటూ సిట్ పోలీసులు చెబుతున్నారు. విజయసాయిరెడ్డి వివరణలపై సంతృప్తి చెందని సిట్ అధికారులు ఆయనను మరోసారి విచారించే అవకాశం ఉందంటున్నారు.
లిక్కర్ స్కాంలో బిగ్ బాస్ పై అడిగిన ప్రశ్నకు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి దాటవేసినట్లు చెబుతున్నారు. విచారణ అనంతరం మీడియాతో మాట్లాడినప్పుడు కూడా తనకు బిగ్ బాస్ ఎవరో తెలియదంటూ విజయసాయిరెడ్డి వ్యాఖ్యనించారు. అంతేకాకుండా బిగ్ బాస్ ఎవరో చెబితే తాను తెలుసుకుంటానని విజయసాయిరెడ్డి చెప్పడం కూడా చర్చకు దారితీస్తోంది. వైసీపీ హయాంలో పెద్దల ప్రమేయం లేకుండా రాజ్ కసిరెడ్డి ఒక్కరే మద్యం స్కాం నెట్ వర్కును నడిపించారా? అన్న ప్రశ్నకు విజయసాయిరెడ్డి పై విధంగా స్పందించారు. రాజ్ కసిరెడ్డి వెనుక ఎవరున్నారో తనకు తెలియదని, తెలిస్తే సంతోషిస్తానన్నారు.
దీంతో లిక్కర్ స్కాంలో ఎవరినో కాపాడటానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని ప్రభుత్వ వర్గాలు అనుమానిస్తున్నాయి. స్కాం మొత్తం రాజ్ కసిరెడ్డి మెడకు చుట్టి మిగిలిన వారిని సురక్షితంగా బయట పడేయాలనే ప్రయత్నాలు చేస్తున్నారా? అని సిట్ అధికారులు సందేహిస్తున్నారు. దీంతో విజయసాయిరెడ్డిని మరో ప్రశ్నించాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. స్కాం వెనుక మాస్టర్ మైండ్ రాజ్ కసిరెడ్డి అంటున్న విజయసాయిరెడ్డి.. ఆయన అనుచరులు పాత్రను, వారి పేర్లను ముద్దు పేర్లతో సహా వెల్లడించడం విశేషంగా చెబుతున్నారు.
ఇదే సమయంలో బిగ్ బాస్ తెలియదనడంతోపాటు ఎంపీలు వైఎస్ అవినాశ్ రెడ్డి, మిథున్ రెడ్డి పాత్ర లేదని చెప్పుకురావడంపై విజయసాయిరెడ్డి తీరును సిట్ వర్గాలు అనుమానిస్తున్నట్లు చెబుతున్నారు. ఒకవైపు వైసీపీ నేతలను వెనకేసుకువస్తున్న విజయసాయిరెడ్డి ఆ పార్టీలోని కొందరిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు చెబుతున్నారు. అందుకే తనకు పార్టీలో అన్యాయం జరిగిందని మీడియా ఎదుట వాపోయారు. వైసీపీ ఆవిర్భావం నుంచి కొనసాగి ఆ పార్టీ ఎదుగుదలకు కష్టపడిన తనను కోటరీ కారణంగా రెండు వేల స్థానానికి తొక్కేశారని ఆక్రోశం వెల్లగక్కడం ద్వారా పార్టీని ఇరుకన పెట్టాలనే ఆలోచన ఉందా? అని సందేహిస్తున్నారు. ఇదే సమయంలో పార్టీ హైకమాండ్ విషయంలో కొంత ప్రేమ కనబరుస్తున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు.
