Begin typing your search above and press return to search.

ఏపీ బాల్‌ఠాక్రే.. విజయసాయి పెద్ద కలలు!

కొత్త పార్టీ అంటూ కొంత కాలంగా హడావుడి చేస్తున్న సీనియర్ నేత, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తాజాగా చేసిన ట్వీట్ విస్తృత చర్చకు దారితీస్తోంది.

By:  Tupaki Desk   |   13 Oct 2026 3:25 PM IST
ఏపీ బాల్‌ఠాక్రే.. విజయసాయి పెద్ద కలలు!
X

కొత్త పార్టీ అంటూ కొంత కాలంగా హడావుడి చేస్తున్న సీనియర్ నేత, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తాజాగా చేసిన ట్వీట్ విస్తృత చర్చకు దారితీస్తోంది. ఈ దసరా పర్వదినాల్లో తన పార్టీ పేరు, జెండా, ఎజెండా ప్రకటిస్తానని విజయసాయిరెడ్డి ఎక్స్ లో ట్వీట్ చేశారు. అదేసమయంలో తనను తాను బాల్‌ఠాక్రేతో పోల్చుకుని అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారని అంటున్నారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలోనూ మెరికల్లాంటి నాయకులను తయారు చేస్తానని, అధికారం జెన్ జీ యువతకు అప్పగిస్తానని వెల్లడించారు. అయితే తాను బాల్‌ఠాక్రేలా వెనకుంటానని ఆయన చెప్పుకోవడమే హాట్ టాపిక్ అవుతోంది.

తనది బాల్‌ఠాక్రే పాత్ర అంటూ విజయసాయిరెడ్డి మరాఠా పెద్దాయనతో పోల్చుకోవడంపైనే నెట్టింట ఆసక్తికర చర్చ జరుగుతోంది. హిందుత్వ అజెండాతో మరాఠా రాజకీయాలను శాసించిన బాల్‌ఠాక్రే స్థాయి విజయసాయిరెడ్డికి ఉందా? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ‘‘11 సీబీఐ, 9 ఈడీ కేసులు పెట్టుకుని బాల్‌ఠాక్రే అంటే ఎలా?’’ అంటూ ఒక నెటిజన్ సూటిగానే ప్రశ్నించాడు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత పార్టీ ప్రకటిస్తానని సోమవారం ట్వీట్ చేసిన విజయసాయిరెడ్డి వెనువెంటనే మనసు మార్చుకుని నవరాత్రుల్లో పార్టీ పేరు ప్రకటిస్తానని చెప్పడంపైనా పెద్ద చర్చ జరుగుతోంది.

వైసీపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత విజయసాయిరెడ్డి చేస్తున్న విమర్శలు, ప్రకటనలపై పెద్ద చర్చే నడుస్తోంది. ప్రధానంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డిని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నట్లుగా విజయసాయిరెడ్డి ప్రకటనలు, ఆరోపణలు ఉంటున్నాయని అంటున్నారు. అదే సమయంలో బీజేపీ పెద్దలను మంచి చేసుకోవడానికి, వారి దృష్టిలో పడేందుకు మాజీ ఎంపీ తెగ ప్రయత్నిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఈ క్రమంలో ఆయన ఏకంగా మరాఠా కురువృద్ధుడు బాల్ ఠాక్రేతో తనను పోల్చుకునే సాహసం చేయడంపై అంతా అవాక్కు అవుతున్నారు.

కొత్త పార్టీ పెడతానని చెబుతున్న విజయసాయిరెడ్డి హిందుత్వ అజెండాతో ముందుకు వెళ్లాలనే ఆలోచనలో ఉన్నట్లుగా సందేహిస్తున్నారు. ఈ కారణంగానే మాజీ సీఎం జగన్ రెడ్డి మత ఆచారాలపైన, ఆయన హిందూ దేవుళ్లను ప్రార్థించే విధానంపైనా ఇటీవల విజయసాయిరెడ్డి విమర్శలు చేసినట్లుగా వ్యాఖ్యానిస్తున్నారు. దీనిద్వారా జగన్ రెడ్డిపై ఒక పెద్ద సమాజంలో అపోహలు సృష్టించాలనే వ్యూహంతోపాటు తనకు ఆధ్యాత్మిక చింతన ఎక్కువ అనే విషయంపై ప్రచారం చేసుకునే ఆలోచన ఉండొచ్చునని అంటున్నారు. ఇదే సమయంలో హిందూ నేతగా దేశవ్యాప్తంగా గుర్తింపు ఉన్న బాలఠాక్రేను తెరపైకి తెచ్చారని అంటున్నారు.

అయితే బాల్ ఠాక్రే మాదిరిగా విజయసాయిరెడ్డి తెర వెనుక ఉంటూ రాజకీయం చేయడానికి ఆయన స్థాయితో ఈయన పోల్చుకోవడానికి చాలా తేడా ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. విజయసాయిరెడ్డి పార్టీ పెడతానంటూ హడావుడి చేస్తున్న దగ్గర నుంచి ఒంటరిగానే కనిపిస్తున్నారని, ఆయనతో ఎవరూ కలిసేందుకు సిద్ధంగా ఉన్నట్లు కూడా కనిపించడం లేదని అంటున్నారు. మరోవైపు విజయసాయిరెడ్డి మాటలను నమ్మి ఆయనతో కలిసి రాజకీయం చేయడానికి జెన్ జీ యువత ముందుకు వచ్చే పరిస్థితులు ఉన్నాయా? అనే సందేహాలు కూడా వ్యక్తం చేస్తున్నారని చెబుతున్నారు. మొత్తానికి విజయసాయిరెడ్డి ట్వీట్ పై రకరకాల కామెంట్లతో నెటిజన్లు విరుచుకుపడుతున్నారు.