సాయిరెడ్డి స్పెషల్ ట్వీట్.. విజయమ్మ కోసం ఏం చెప్పాడంటే..
సాధారణంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు అన్ని చెప్పి వదిలేస్తే సాయిరెడ్డి ట్వీట్ పై పెద్దగా చర్చ జరిగేది కాదు.
By: Tupaki Desk | 19 April 2025 7:06 PM ISTరాజకీయ విరామం తర్వాత వైసీపీకి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న విజయసాయిరెడ్డి.. మాజీ సీఎం జగన్మోహనెడ్డి తల్లి విజయమ్మ పుట్టిన రోజు పురస్కరించుకుని చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. విజయమ్మకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పిన విజయసాయిరెడ్డి.. తన ట్వీట్ రాసిన విధానంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. తల్లి, చెల్లితో వివాదం పెట్టుకున్న మాజీ సీఎం జగన్మోహనరెడ్డికి చురకలు అంటించేలా సాయిరెడ్డి ట్వీట్ ఉందంటూ వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కుటుంబంతో విజయసాయిరెడ్డికి దశాబ్దాల అనుబంధం ఉంది. జగన్ తాత రాజారెడ్డి నుంచి వారి కుటుంబ ఆడిటరుగా సాయిరెడ్డి సేవలు అందిస్తున్నారు. ఈ క్రమంలో విజయమ్మ పుట్టిన రోజు పురస్కరించుకుని ఆయన చేసిన ట్వీట్ కు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వాల్సిన పనిలేదు. కానీ, సరస్వతీ పవర్ వాటాల విషయంలో సాయిరెడ్డి వల్లే తమకు అన్యాయం జరిగిందని గతంలో విజయమ్మ, షర్మిల ఆరోపించిన విషయం తెలిసిందే. దీంతో సాయిరెడ్డికి విజయమ్మ, షర్మిలకు మధ్య గ్యాప్ పెరిగిందని ప్రచారం జరిగింది. మరోవైపు జగన్ తోనూ పొసగక ఆయన వైసీపీ నుంచి బయటకు వచ్చేశారు. ఈ పరిస్థితుల్లో కొద్ది రోజుల క్రితం షర్మిలతో భేటీ అయిన విజయసాయిరెడ్డి సంబంధాలు పునరుద్ధరించుకునే ప్రయత్నం చేశారు. అదేవిధంగా విజయమ్మ పుట్టిన రోజు పురస్కరించుకుని ట్వీట్ చేశారు.
సాధారణంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు అన్ని చెప్పి వదిలేస్తే సాయిరెడ్డి ట్వీట్ పై పెద్దగా చర్చ జరిగేది కాదు. కానీ, ఆయన ట్వీట్ వైరల్ కావడానికి అనేక అంశాలు ఉన్నాయంటున్నారు. కుటుంబ వివాదాలతో సతమతమవుతున్న విజయమ్మను ఉద్దేశించి నిశ్శబ్ద శక్తికి ప్రతీక అంటూ పొగడ్తలు కురిపించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
అదేవిధంగా సాయిరెడ్డి తన ట్వీట్లో ‘‘శ్రీమతి వైఎస్ విజయమ్మ గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. దయ, ధైర్యం, నిశ్శబ్ద శక్తికి ప్రతీక మీరు. త్యాగం, గౌరవం, విలువల పట్ల అచంచల నిబద్ధత కూడిన మీ జీవితం లెక్కలేనన్నిహృదయాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటుంది’’ అంటూ సాయిరెడ్డి ట్వీట్ చేశారు. దీంతో విజయసాయిరెడ్డి ట్వీట్ వైరల్ అవుతోంది.
