'పదకొండు' ముహూర్తం బాగుంది.. వాళ్లు భుజాలు తడుముంటే నేనేం చేయాలి : విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
కొత్త పార్టీ ప్రకటన ముహూర్తంగా 11వ నెల 11వ తేదీ 11 గంటల 11 నిమిషాలను నిర్ణయించడంపై సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి స్పష్టత ఇచ్చారు.
By: Tupaki Desk | 2 Nov 2026 7:20 PM ISTకొత్త పార్టీ ప్రకటన ముహూర్తంగా 11వ నెల 11వ తేదీ 11 గంటల 11 నిమిషాలను నిర్ణయించడంపై సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి స్పష్టత ఇచ్చారు. ముహూర్తాలపై నమ్మకంతో ఆ తేదీ, సమయం బాగుందని తన పూజారి చెప్పారని, అందుకే ఆ ముహూర్తం నిర్ణయించామని వెల్లడించారు. ఎవరినో కించపరచాలనే ఉద్దేశం తనకు లేదని, వాళ్లు భుజాలు తడుముకుంటే నేనేం చేయాలని ప్రశ్నించారు. కొత్త పార్టీ పేరు, జెండా అజెండా ప్రకటనకు సమయం దగ్గరపడుతుండటంతో విజయసాయిరెడ్డి తాజా ప్రకటన ఆసక్తికరంగా మారింది. తన మాజీ బాస్ జగన్మోహనరెడ్డి వైఫల్యాన్ని గుర్తు చేసేలా పార్టీ ప్రకటనకు 11-11-11 ముహూర్తం పెట్టారని విజయసాయిరెడ్డిపై వస్తున్న విమర్శలు, వ్యాఖ్యాలకు ఆయన సమాధానం ఇచ్చారు.
ముహూర్తం బాగుంది..
కొత్త పార్టీ పెడుతున్నట్లు చాలాకాలంగా చెబుతున్న విజయసాయిరెడ్డి కొద్దిరోజుల క్రితం సస్పెన్స్ తొలగించారు. రాష్ట్రంలో ప్రధాన నగరాల్లో పర్యటించి పార్టీ స్థాపనకు దారితీసిన పరిస్థితులను ప్రజలకు వివరించిన విజయసాయిరెడ్డి చివరగా, 11వ నెల 11వ తేదీ 11 గంటల 11 నిమిషాలకు పార్టీ పేరు ప్రకటిస్తానని గతంలో వెల్లడించారు. అయితే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డిని దృష్టిలో పెట్టుకునే ఆయన ఇలాంటి ముహూర్తం నిర్ణయించారని పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ప్రధానంగా వైసీపీ శ్రేణులు ఈ విషయంలో విజయసాయిరెడ్డిని టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారని చెబుతున్నారు. దీంతో తాను ఆ ముహూర్తం ఎందుకు తీయాల్సివచ్చిందనే విషయంపై విజయసాయిరెడ్డి మరోసారి వివరణ ఇచ్చారు.
తనకు ముహూర్తాలు అంటే ఎక్కువ నమ్మకమని చెప్పిన విజయసాయిరెడ్డి 11వ తేదీ ఉదయం 11 గంటల 9 నిమిషాల నుంచి 15 నిమిషాలు మంచిందని పూజారి చెప్పారని తెలిపారు. అయితే 9 నిమిషాల నుంచి 15 నిమిషాల మధ్యన 11 నిమిషాలు సరిపోతుందన్న కారణంగానే 11వ నెల 11వ తేదీ 11 గంటల 11 నిమిషాలకు పార్టీ పెడతానని తాను చెప్పానని విజయసాయిరెడ్డి పునరుద్ఘాటించారు. ఈ విషయంలో ఎవరినీ కించపరచాలని తాను అనుకోలేదని, వాళ్లు భుజాలు తడుముకుంటే నేనేం చేయగలను అంటూ స్పష్టం చేశారు.
ఓవీ రమణ చేరిక
కాగా, విజయసాయిరెడ్డి పార్టీలో టీటీడీ మాజీ సభ్యుడు ఓవీ రమణ చేరారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో విజయసాయిరెడ్డితో కలిపి ఓవీ రమణ కూడా పాల్గొన్నారు. ఓవీ రమణ, తాను టీటీడీ సభ్యులుగా పనిచేశామని, ఆ అనుబంధంతో తన పార్టీలో పనిచేసేందుకు రమణ ముందుకు వచ్చినట్లు విజయసాయిరెడ్డి ప్రకటించారు. తన పార్టీలో ఓవీ రమణకు సముచిత ప్రాధాన్యం కల్పిస్తానని అన్నారు. తాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేశానని, కొత్త పార్టీలో రమణకు ఆ పదవి కట్టబెడతానని వెల్లడించారు. వైసీపీలో తాను ఎదుర్కొన్న పరిస్థితులు మాత్రం ఆయనకు రానీయనని హామీ ఇచ్చారు. తాను స్థాపించే పార్టీలో పొలిట్ బ్యూరో నిర్ణయాలే అమలు అవుతాయని తెలిపారు. రాష్ట్రంలో మూడో ప్రత్యామ్నాయంగా ఆవిర్భవిస్తామని హామీ ఇచ్చారు.
