Begin typing your search above and press return to search.

త్వరలోనే పార్టీ పెడుతున్నా.. విజయసాయి అధికారిక ప్రకటన

కొత్త పార్టీ పెడుతున్నారంటూ వస్తున్న ప్రచారంపై మాజీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి తొలిసారిగా స్పందించారు.

By:  Tupaki Desk   |   19 Aug 2026 10:32 AM IST
త్వరలోనే పార్టీ పెడుతున్నా.. విజయసాయి అధికారిక ప్రకటన
X

కొత్త పార్టీ పెడుతున్నారంటూ వస్తున్న ప్రచారంపై మాజీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి తొలిసారిగా స్పందించారు. తాను తిరిగి రాజకీయాల్లోకి వస్తున్నానని, కొత్త పార్టీని స్థాపిస్తున్నానని తిరుమల శ్రీవారి సాక్షిగా వెల్లడించారు. ఈ నెలలో విజయవాడలో మీడియా సమావేశం నిర్వహించి పూర్తి వివరాలను తెలియజేస్తానని తెలిపారు. దాదాపు ఏడాదిన్నరగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్న విజయాసాయిరెడ్డి కొత్త పార్టీ పెట్టనున్నారని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. 2025 జనవరిలో రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన మళ్లీ రాజకీయాల్లో వస్తున్నారని జరిగిన ఊహాగానాలుగానే భావించారు. కానీ, ఇప్పుడు నేరుగా ఆయనే పార్టీ పెడుతున్నట్లు ప్రకటించడం రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది.

రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు గతంలో ప్రకటించిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కొత్త పార్టీ ఏర్పాటు ప్రకటన ఆసక్తి రేపుతోంది. వృత్తిరీత్యా చార్టెడ్ అకౌంటెంట్ అయిన విజయాసాయిరెడ్డి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడుగా గుర్తింపు తెచ్చుకున్నారు. వైఎస్ ప్రోద్బలంతోనే రాజకీయాల్లోకి వచ్చిన విజయసాయిరెడ్డి 2004-2009 మధ్యకాలంలో తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టు బోర్డు సభ్యుడిగా పనిచేశారు. ఆ విధంగా రాజకీయాల్లోకి యాక్టివ్ అయ్యారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి కుడి భుజంగా పనిచేశారు. జగన్ రెడ్డి కాంగ్రెస్ తో విభేదించి సొంత పార్టీ పెట్టుకున్నాక అందులో రెండో స్థానంలో పనిచేశారు. ఇలా వైసీపీలో అత్యంత ప్రముఖ నేతగా ఎదిగిన విజయాసాయిరెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అనూహ్య రీతిలో ఓడిన తర్వాత పార్టీకి తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.

ఎంపీ పదవికి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి ఆశ్చర్యానికి గురిచేశారు. అయితే ఇప్పుడు అంతే ఆశ్యర్యకరంగా రాజకీయాల్లోకి పునఃప్రవేశిస్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు. దాదాపు ఏడాదిన్నరగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నప్పటికీ సోషల్ మీడియా ద్వారా కేంద్ర, రాష్ట్ర రాజకీయాలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూనే ఉన్నారు. దీంతో ఆయన రాజకీయాల నుంచి తప్పుకోవాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరిగింది. ఇప్పుడు అదే నిజమని విజయసాయిరెడ్డి చేసిన ప్రకటనతో స్పష్టమైందని అంటున్నారు.

ఇక ఏడాదిన్నరగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న విజయసాయిరెడ్డి తిరిగి వైసీపీలో చేరతారనే ప్రచారం మరోపక్క జరిగింది. అయితే తాను సొంత పార్టీ పెట్టుకుంటున్నట్లు ఆయన తాజాగా చేసిన ప్రకటనతో వైసీపీలో మళ్లీ చేరే ఆసక్తి లేదని తేల్చిచెప్పినట్లైందని అంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన విజయసాయిరెడ్డి వైసీపీ పార్టీపైన తీవ్ర విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా తాను ఎంతగానో అభిమానించిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి కోటరీ చేతుల్లో ఇరుక్కున్నారని పెద్ద బాంబు పేల్చారు. అయితే ఇప్పుడు పార్టీ ఏర్పాటు చేయాలని ఆయన ఎందుకు నిర్ణయించుకున్నారనేది చెప్పాల్సివుందని అంటున్నారు. రాజకీయాలే వద్దనుకున్న విజయసాయిరెడ్డి మళ్లీ రావాలని ఎందుకు అనుకుంటున్నారు? ఆయన లక్ష్యాలు ఏంటి? అన్న అంశాలపై ఆయన క్లారిటీ ఇవ్వాల్సివుందని అంటున్నారు.