విజయసాయి నుంచి ఊహించని ట్వీట్
అలాంటి విజయసాయిరెడ్డి 2025 మొదట్లోనే రాజకీయాల నుంచి తప్పుకున్నారు. వైసీపీకి రాజ్యసభకు కూడా రాజీనామా చేశారు. రాజకీయం వద్దు ఇక అనుకున్నారు. అగ్రికల్చర్ ఈజ్ మై కల్చర్ అనేశారు.
By: Tupaki Desk | 23 Jun 2025 9:10 AM ISTఆయన వైసీపీలో దిగ్గజ నేత. ఆయన ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ట్వీట్ వచ్చిందంటే చాలు ప్రకంపనలు సృష్టించేది. ఆయన సెటైర్లకే బాప్ అన్నట్లుగా ట్వీట్లు వేసేవారు. ఆయన ట్వీట్ ఎంతోమంది రాజకీయ ప్రత్యర్ధులకు గన్ షాట్ గా ఉండేది. ఆయన పదునైన డైలాగులను పేల్చి మరీ వేసిన ట్వీట్లు వైసీపీకి ఎంతో ఖుషీ ఇచ్చేవి.
అలాంటి విజయసాయిరెడ్డి 2025 మొదట్లోనే రాజకీయాల నుంచి తప్పుకున్నారు. వైసీపీకి రాజ్యసభకు కూడా రాజీనామా చేశారు. రాజకీయం వద్దు ఇక అనుకున్నారు. అగ్రికల్చర్ ఈజ్ మై కల్చర్ అనేశారు. అయితే ఆ తరువాత కొన్నాళ్ళ పాటు ఆయన సైలెంట్ గా అయితే ఉండలేదు. లిక్కర్ స్కాం మీద సిట్ విచారణకు హాజరై మీడియా ముఖంగా ఆయన చేసిన హాట్ కామెంట్స్ వైసీపీలో అలజడి రేపాయి. అంతే కాదు వైసీపీలో కోటరీ అన్నారు. జగన్ కి వారు సన్నిహితంగా ఉంటూ చేయాల్సిన నష్టం చేశారని అన్నారు. వైసీపీ నుంచి తనను బయటకు పంపించారు అన్నారు
ఇలా ఆయన కొంతకాలం వైసీపీతో రాజకీయ సమరమే చేశారు. అదే సమయంలో ఆయన బీజేపీలో చేరుతారు అన్న ప్రచారమూ సాగింది. ఆయన రేపో మాపో కాషాయం కండువా కప్పుకుంటారు అని ఆయనకు బీజేపీ పెద్దల సాన్నిహిత్యం వల్ల ఆయన వదిలేసిన రాజ్యసభ సీటు కూడా పొందుతారు అని కూడా చెప్పుకున్నారు.
అయితే ఇవేమీ జరగలేదు. ఇంతలో ఆయన టీడీపీ కీలక నేత జనార్ధన్ ని కలిసారు అని వైసీపీ నుంచి ఒక వీడియో షాట్ బయటకు వచ్చింది. దాని మీద కూడా విజయసాయిరెడ్డి ఫైర్ అయ్యారు. రాజకీయాలు వదిలేసిన తాను ఎవరిని కలిస్తే వైసీపీకి ఎందుకు ఉలుకు అన్నారు. ఇలా విజయసాయిరెడ్డి రాజకీయంగా మళ్ళీ యాక్టివ్ అవుతారా అన్న చర్చ సాగుతున్న నేపథ్యం ఒక వైపు ఉంటే ఆయనను బీజేపీ చేర్చుకోవడం ఏపీలో ఉన్న కూటమి పెద్దలకు ఇష్టం లేదని మరో ప్రచారం సాగింది.
మొత్తానికి ఏది నిజమో తెలియదు కానీ ఆరు నెలలుగా అయితే విజయసాయిరెడ్డి రాజకీయమూ సైలెంట్ అయింది. ఆయన ట్విట్టర్ అయితే ఇటీవల కాలంలో మౌనమే మంత్రంగా పాటిస్తోంది. ఇపుడు సడెన్ గా ఆయన ఒక ట్వీట్ వేశారు. అది రాజకీయాలకు సంబంధించినది అనుకుంటే పొరపాటు. ఆయన యువతకు సలహా ఇస్తూ వేసిన ఈ ట్వీట్ ఆసక్తికరంగా ఉపయోగకరంగా ఉంది.
ఏపీ ప్రభావంతో ఉద్యోగాలు పోతాయని ఇటీవల కాలంలో అంతా అంటున్నారు. ఏ ఏ ఉద్యోగాలు పోతాయో వారు చెబుతున్నారు. అయితే ఏఐ వల్ల ఏఏ ఉద్యోగాలు పోవో అన్నది విజయసాయిరెడ్డి తన ట్వీట్ లో యూత్ కి తెలియచేశారు. కానీ ఆతిథ్య రంగం, అలాగే సంరక్షణ రంగం అంటే కేర్ టేకింగ్. అలాగే నర్సింగ్ వృత్తి వంటివాటి మీద ఏఐ అసలు ప్రభావం చూపించలేవని విజయసాయిరెడ్డి చెప్పారు
ఇలాంటి ఉద్యోగాలు ఉపాధి అవకాశాల వెనక మానవ సంబంధింత భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయని అన్నారు. అంతే కాదు సానుభూతి తో చేయాల్సిన ఉద్యోగాలుగా వెల్లడించారు. వీటికి భావోద్వేగ మేధస్సు అవసరమని, అలాగే వ్యక్తిగత పరస్పర చర్యపై ఎక్కువగా ఈ తరహా ఉద్యోగాలు ఆధారపడతాయని విజయసాయిరెడ్డి చక్కగా విశ్లేషించారు. ఈ ఉద్యోగాల విషయంలో యువత ఫోకస్ పెట్టాలని అన్నారు.
మరి యువతకు మంచి సలహా సూచనలు విజయసాయిరెడ్డి అందించడమే కాదు వారికి ఒక మార్గం చూపించారు. అంతా బాగానే ఉంది కానీ విజయసాయిరెడ్డి రాజకీయ వైరాగ్యం ఇక శాశ్వతమేనా ఆయన వ్యవసాయం ఇక పర్మనెంటేనా అన్న ప్రశ్నలకు మాత్రం బదులు ఇప్పట్లో దొరికేలా లేదని అంటున్నారు.
