Begin typing your search above and press return to search.

వ్యవసాయం మొదలు పెట్టిన విజయసాయిరెడ్డి

ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా మరోసారి ఆయన వ్యవసాయంలో నిమగ్నమైన దృశ్యాలు వెలుగులోకి రావడం ఆసక్తికరంగా మారింది.

By:  A.N.Kumar   |   16 March 2026 5:41 PM IST
వ్యవసాయం మొదలు పెట్టిన విజయసాయిరెడ్డి
X

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. రాజకీయాల నుంచి దూరంగా ఉంటానని ప్రకటించిన ఆయన ఇప్పుడు పూర్తిగా వ్యవసాయంపై దృష్టి సారించినట్లు కనిపిస్తున్నారు. నెల్లూరులో తన సొంత వ్యవసాయ క్షేత్రంలో పనులు చేస్తూ కనిపించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒకప్పుడు కీలక నాయకుడిగా ఎదిగిన విజయసాయిరెడ్డి, పార్టీ స్థాపించిన దశ నుంచే పనిచేశారు. ముఖ్యంగా ఆ పార్టీ అధినేత వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరుపొందారు. వైఎస్ కుటుంబానికి ఆడిటర్‌గా సేవలు అందించిన ఆయన ఆ పరిచయంతోనే జగన్‌కు దగ్గరయ్యారు. జగన్‌పై నమోదైన అవినీతి, అక్రమాస్తుల కేసుల్లో కూడా ఆయన నిందితుడిగా నిలిచారు. ఆ కేసుల నేపథ్యంలో జగన్‌తో కలిసి సుమారు 16 నెలల జైలు జీవితం గడిపిన విషయం తెలిసిందే.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో విజయసాయిరెడ్డి కీలక పాత్ర పోషించారు. పార్టీలు, రాజకీయ కార్యక్రమాల్లో ఆయన చురుకైన పాత్రతో జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు పొందారు. అయితే ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత ఆయనకు జగన్‌తో విభేదాలు వచ్చినట్లు ప్రచారం జరిగింది. ఆ తర్వాత పార్టీకి గుడ్‌బై చెప్పిన విజయసాయిరెడ్డి రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పారు.

రాజకీయాలకు విరామం ప్రకటించిన అనంతరం ఆయన వ్యవసాయ రంగంలోకి అడుగుపెట్టారు. సొంత జిల్లా నెల్లూరు శంకరాపురం గ్రామంలో తన వ్యవసాయ క్షేత్రంలో సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నారు. వ్యవసాయ పనుల్లో తానే ప్రత్యక్షంగా అప్పుడప్పుడు రైతులతో కలిసి పనిచేస్తున్న సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలు కూడా పంచుకున్నారు.

అయితే కొద్ది కాలం తర్వాత మళ్లీ రాజకీయాలపై ఆసక్తి చూపినట్లు కనిపించారు. మద్యం కుంభకోణం కేసులో విచారణకు హాజరుకావడం, రాజకీయంగా మళ్లీ ఉండటం సంకేతాలు ఇవ్వడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఏదో ఒక రాజకీయ పార్టీలో చేరే అవకాశాలపై కూడా అప్పట్లో చర్చలు జరిగాయి.

ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా మరోసారి ఆయన వ్యవసాయంలో నిమగ్నమైన దృశ్యాలు వెలుగులోకి రావడం ఆసక్తికరంగా మారింది. నెల్లూరు జిల్లా శంకరాపురంలోని తన వ్యవసాయ క్షేత్రంలో మిరప పంటకు సేంద్రీయ ద్రావణం స్ప్రే చేస్తూ కనిపించారు. ‘అగ్నాస్త్రం’ అంటే సేంద్రీయ ద్రావణం తయారీ విధానం కూడా ఆయన వీడియోలో వివరించారు. సాగులో వచ్చే చీడపీడలను సహజసిద్ధంగా ఈ పద్ధతి ఉపయోగపడుతుంది.

సమాజంలో చెడు ఎలా తొలగించాలన్నదే రాజకీయాల లక్ష్యమైతే, సాగులో చీడపీడలను తొలగించడం కూడా ముఖ్యమని ఆయన వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. రాజకీయాల నుంచి వ్యవసాయానికి, మళ్లీ రాజకీయాల వైపు, తిరిగి వ్యవసాయానికి వచ్చిన విజయసాయిరెడ్డి ప్రయాణం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చలకు దారితీస్తోంది.