ఏపీలో జనాభా గణనకు ముహూర్తం ఫిక్స్
జనాభా లెక్కలు అన్నవి 2011 తరువాత ఇప్పటిదాకా ఎక్కడా జరగలేదు, దాంతో జనాభా ఎంత అన్నది ఎవరికీ స్పష్టంగా తెలియదు.
By: Satya P | 6 Feb 2026 9:33 AM ISTజనాభా లెక్కలు అన్నవి 2011 తరువాత ఇప్పటిదాకా ఎక్కడా జరగలేదు, దాంతో జనాభా ఎంత అన్నది ఎవరికీ స్పష్టంగా తెలియదు. 2021లో కరోనా రావడంతో జనాభా లెక్కల షెడ్యూల్ మారింది. ఆ తరువాత కరోనా తగ్గినా కొత్త షెడ్యూల్ అయితే వెలువడలేదు, మొత్తానికి కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా జనాభా లెక్కలతో పాటు కుల గణనను కూడా దానితో పాటుగా కలిపి నిర్వహించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో ఏపీలో జనాభా గణనకు ముహూర్తం ఫిక్స్ అయిపోయింది.
వచ్చే ఏడాది నుంచి :
ఇక ఏపీలో చూస్తే వచ్చే ఏడాది అంటే 2027 ఫిబ్రవరి 9వ తేదీ నుండి 28 వరకూ జనాభా లెక్కల సేకరణ జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ వెల్లడించారు. జనాభా లెక్కల సేకరణ-2027 పై ఆయన మాట్లాడుతూ జనాభా లెక్కల సేకరణ ప్రకియ సజావుగా జరిగేందుకు ఇప్పటి నుండే తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జనాభా లెక్కల సేకరణ ప్రక్రియపై క్షేత్ర స్థాయిలో ప్రజలలో విస్తృత అవగాహన కల్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే తగిన మార్గదర్శకాలను జారీ చేయడం జరిగిందని వాటిని తుచ తప్పక పాటించి జనాభా లెక్కల సేకరణ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేయాలని అన్నారు.
ప్రజలలో అవగాహన :
మరో వైపు చూస్తే జనాభా లెక్కల సేకరణ-2027 పై ప్రజలలో అవగాహనకు ప్రత్యేక ఐఇసి మెటీరియల్ ను ప్రచురించి అన్ని జిల్లాలకు పంపాలని విజయనంద్ అన్నారు. అంతేగాక ఎన్నికల సమయంలో మాదిరిగానే నిర్దిష్ట కాలపరిమితితో చేయాల్సిన పనులపై ప్రత్యేకంగా బుక్లెట్ ను ప్రచురించి జిల్లాలకు పంపాలని సిఎస్ విజయానంద్ సూచించారు. మొత్తం మీద చూస్తే జనాభా గణన అన్నది ఈ ఏడాది అని తొలుత అంతా అనుకున్నారు కానీ వచ్చే ఏడాది అని చెబుతున్నారు. అంటే ఏడాది టైం ఉంది అన్న మాట.
దానిని బట్టే :
ఇక జనాభా గణన అన్నది ఇపుడు చాలా ముఖ్యంగా మారింది. దానిని బట్టే అసెంబ్లీ లోక్ సభ సీట్ల పునర్ విభజన జరుగుతుంది. అంతే కాదు, మహిళా రిజర్వేషన్లు కూడా వీటితోనే స్పష్టం అవుతాయి. మరో వైపు కుల గణన కూడా ఇందులోనే కలిసి ఉంటుంది. ఆ విధంగా ఏ ఏ కులాల జనాభా ఎంత ఉంది అన్నది తెలిస్తే ఆ మేరకు రాజకీయంగా కానీ ఇతరత్రా కానీ ఆయా సామాజిక వర్గాలకు మేలు చేసే అవకాశాలు ఉంటాయి. దాంతో ఎంత తొందరగా జనాభా గణన సాగుతుందా అని అన్ని రాష్ట్రాలూ ఎదురుచూస్తున్నాయి. అయితే కేవలం ఇరవై రోజుల వ్యవధిలోనే ఏపీలో ఈ గణన పూర్తి చేస్తామని అధికారులు అంటున్నారు. దానికి అవసరమైన టెక్నాలజీ కూడా ఉంది అని చెబుతున్నారు. ప్రజలు కూడా సొంతంగా ఈ గణనలో పాల్గొనేలా చూస్తామని వారికి అవసరమైన అవగాహన కల్పిస్తామని చెబుతున్నారు.
