జిల్లా పాలిటిక్స్: 'గరం' తగ్గిన విజయనగరం.. !
ఇది ఎలా ఉన్నా కీలకమైన విజయనగరం రాజకీయాలను పరిశీలిస్తే ఒకప్పుడు విజయనగరం రాజకీయాలంటే హాట్ హాట్ గా కీలక నాయకుల మధ్య మాటల యుద్ధం.. రాజకీయ సవాళ్లు వంటివి కనిపించే.
By: Tupaki Desk | 9 July 2025 8:00 PM ISTరాష్ట్రంలో రాజకీయాలను గమనిస్తే జిల్లాకు ఒక రకంగా ఉన్నాయి. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో మూడు రకాలుగా ఉంటే కోస్తా రాయలసీమలో మరోరకంగా రాజకీయాలు కనిపిస్తున్నాయి. అధికార, ప్రతిపక్ష నాయకుల మధ్య జోరు హోరు కొన్ని జిల్లాల్లో కనిపిస్తే మరికొన్ని జిల్లాల్లో సర్దుకుపోతున్న తీరు తెర మీదకు వచ్చింది. ఇది ఎలా ఉన్నా కీలకమైన విజయనగరం రాజకీయాలను పరిశీలిస్తే ఒకప్పుడు విజయనగరం రాజకీయాలంటే హాట్ హాట్ గా కీలక నాయకుల మధ్య మాటల యుద్ధం.. రాజకీయ సవాళ్లు వంటివి కనిపించేవి.
అయితే గత ఏడాదికాలంగా విజయనగరం రాజకీయాలు స్తబ్దుగా మారాయి. ఒకప్పుడు విజయనగరం అంటే పూసపాటి అశోక్ గజపతి రాజు, బొత్స సత్యనారాయణ వంటి కీలక నాయకులు చక్రాలు తిప్పేవారు. పూసపాటి టిడిపిలోనే ఉన్నప్పటికీ సత్యనారాయణ పార్టీలు మారినప్పటికీ రాజకీయాలు మాత్రం వేడిగానే సాగేవి. అయితే అశోక్ గజపతిరాజు రాజకీయంగా సైలెంట్ కావడం... బొత్స సత్యనారాయణ విజయనగరం నుంచి దాదాపు రాజకీయాలు విరమించి, విశాఖపట్నం ఇతర జిల్లాలపై కాన్సెంట్రేట్ చేయటంతో విజయనగరం రాజకీయాలు ఇప్పుడు పెద్దడి వేడెక్కడం లేదనేది పరిశీలకులు చెబుతున్న మాట.
అదే సమయంలో విజయనగరంలో గత ఏడాది జరిగిన ఎన్నికల్లో జనసేన, టిడిపి నాయకులు విజయం దక్కించుకున్నారు. ఇది కూడా ఒక రకంగా రాజకీయాల వేడిని తగ్గించిందని చెప్పాలి. ఒక్క నెల్లిమర్ల నియోజకవర్గం తప్ప మిగిలిన చోట్ల దాదాపు నాయకులు ప్రశాంతంగానే ముందుకు సాగుతున్నారు. అంతర్గతంగా చిన్నచిన్న వివాదాలు ఉన్నప్పటికీ పెద్ద స్థాయిలో వివాదాలు కనిపించకపోవడం.. అదేవిధంగా నాయకుల మధ్య కూడా సఖ్యత కనిపిస్తుండడం చెప్పుకోదగ్గ పరిణామనే చెప్పాలి.
అదే 2003- 2010 మధ్య రాజకీయాలను గమనిస్తే విజయనగరం జిల్లా ఎప్పుడు హాట్ టాపిక్ గా ఉండేది. నాయకుల మధ్య కూడా రాజకీయాలు వేడివేడిగా సాగేవి. ఇది ఒక రకంగా రాష్ట్రస్థాయిలో చర్చగా కూడా మారిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు పరిస్థితి మారి విజయనగరంలో రాజకీయాలు పెద్దగా వివాదాస్పదంగా లేకపోవడం అందరూ కలిసి ఉండడం, స్థానికంగా రాజకీయ వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఒక్క నెల్లిమర్ల నియోజకవర్గంలో మాత్రం జనసేన ఎమ్మెల్యే లోకం నాగమధవి వర్సెస్ టిడిపి నాయకులు అదేవిధంగా జనసేన నాయకుల మధ్య వివాదాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. వీటిని పరిష్కరించే ప్రయత్నం చేయకపోవడం జిల్లాలో చర్చగా మారింది. అంతకుమించి రాష్ట్రస్థాయిలో అయితే విజయనగరం రాజకీయాలు పెద్దగా ప్రభావం చూపించడం లేదు.
