Begin typing your search above and press return to search.

షర్మిలతోనే విజయమ్మ...ఆయన చెబుతున్నారు...!?

విజయమ్మను వైసీపీ వైపుగా వచ్చి ప్రచారం చేయమని జగన్ దూతగా ఒక పెద్దాయన వెళ్లి మాట్లాడారు అని అంటున్నారు. అయితే ఆమె ఏమి చెప్పారు అన్నది బయటకు రాలేదు.

By:  Tupaki Desk   |   31 Jan 2024 3:12 PM GMT
షర్మిలతోనే విజయమ్మ...ఆయన చెబుతున్నారు...!?
X

ఏపీలో రాజకీయాలు వేడెక్కి ఉన్నాయి. మరో వైపు వైఎస్సార్ కుటుంబ కధా చిత్రం కూడా రసవత్తరంగా సాగుతోంది. 2019 ఎన్నికల వేళ జగన్ తో ఉన్న తల్లి వైఎస్ విజయమ్మ, చెల్లెలు వైఎస్ షర్మిల ఈసారికి కనిపించడం లేదు. వైఎస్ షర్మిల అయితే తనదైన రాజకీయం మొదలెట్టి మూడేళ్లు అవుతోంది. ఆమె తెలంగాణాలో కొత్త పార్టీ పెట్టారు. దాన్ని ఇటీవల కాంగ్రెస్ లో విలీనం చేసి ఏపీ రాజకీయాల్లోకి వచ్చారు.

వచ్చినది లగాయితూ ఆమె జగన్ మీదనే విమర్శలు చేస్తున్నారు. ఆ విమర్శలు ఏపీ పాలిటిక్స్ ని షేక్ చేస్తున్నాయి. సొంత అన్న ప్రభుత్వం మీద చెల్లెలు చేసే విమర్శలకు కొంత విలువ ఉంటుందని విపక్షాలు భావిస్తున్నాయి. దాంతో షర్మిల సైడ్ తీసుకుని ఆమెకు మద్దతుగా కూడా టీడీపీ లాంటి పార్టీలు ఇపుడిపుడే మాట్లాడుతున్నాయి.

సరే షర్మిల తన రాజకీయం తాను చేసుకుంటున్నారు. విజయమ్మ ఎటువైపు అన్నది చర్చకు వస్తోంది. విజయమ్మను వైసీపీ వైపుగా వచ్చి ప్రచారం చేయమని జగన్ దూతగా ఒక పెద్దాయన వెళ్లి మాట్లాడారు అని అంటున్నారు. అయితే ఆమె ఏమి చెప్పారు అన్నది బయటకు రాలేదు. కానీ టీడీపీకి చెందిన కీలక నేత మాత్రం విజయమ్మ కూడా షర్మిల వైపే అంటూ మాట్లాడడం విశేషం.

టీడీపీ పొలిట్ బ్యూరో మెంబర్ గా ఉన్న బోండా ఉమా షర్మిల ఇప్పటికే జగన్ కి సంబంధించి చాలా విషయాలను చెబుతోందని, ఇంకా మిగిలినవి విజయమ్మ చెబుతారు అని సంచలన కామెంట్స్ చేశారు. ఆయన చెప్పిన దాన్ని బట్టి చూస్తే విజయమ్మ కూడా షర్మిల వైపే అని అంటున్నట్లుగా ఉంది. మరి విజయమ్మ అలా చేస్తారా జగన్ కి వ్యతిరేకంగా జగన్ లోకి వచ్చి మాట్లాడుతారా అన్న చర్చ సాగుతోంది.

ఇటీవల హైదరాబాద్ లో జరిగిన షర్మిల కుమారుడి నిశ్చితార్ధం వేడుకలో జగన్ తో విజయమ్మ చాలా ఆప్యాయంగా మెలిగారు. ఆమె కుమారుడి మీద అవ్యాజమైన ప్రేమను చూపినంచారు. దాన్ని చూసిన వారు ఎవరూ ఆమె జగన్ కి ఎదురు నిలిచి విమర్శించరు అనే అంటున్నారు. ఆమెకు కనుక ఇద్దరు బిడ్డలు చెరొక రాజకీయ పంధాను ఎంచుకున్నారు మధ్యలో తాను ఏ వైపు ఉండకూడదు అనిపిస్తే మాతం తటస్థంగా ఉంటారు తప్ప ఒక సైడ్ తీసుకోరు అని అంటున్నారు.

అయితే రాజకీయాలు ఇవి ఏమైనా జరుగుతాయని అంటున్న వారూ ఉన్నారు. షర్మిల అయితే కాంగ్రెస్ లో చేరింది. ఆమె ఢిల్లీ వెళ్ళి కాంగ్రెస్ పెద్దల నుంచి కండువాను కప్పుకున్న కార్యక్రమానికి విజయమ్మ హాజరు కాలేదు అని గుర్తు చేస్తున్నారు. అదే విధంగా ఆమె వైఎస్సార్టీపీ అని షర్మిల పార్టీ పెట్టినపుడు మాత్రమే ప్రచారం చేశారు తప్ప కాంగ్రెస్ పార్టీలో ఆమె లేరు అని గుర్తు చేస్తున్నారు.

అయితే అటు అన్న ఇటు చెల్లెలు ఇద్దరూ తల్లి ప్రచారం కోరుతారు అని టాక్ నడుస్తోంది. ఎందుకంటే ఈసారి ఎన్నికలు ఇద్దరికీ కీలకం కాబట్టి. అందువల్ల విజయమ్మ ఎటు వైపు ఉంటారు, ఎవరి మాట వింటారు అన్నది ఉత్కంఠను కలిగించే విషయమే.

అయితే ఆమె వైసీపీ తరఫున తొలి ఎమ్మెల్యే. ఆ పార్టీ పునాదుల నుంచి ఆమె ఉన్నారు. సో ఆమె వైసీపీతోనే ఉంటారు అన్నది ఆ పార్టీ వారి మాట. కానీ వైఎస్సార్ కుటుంబం విషయాలు టీడీపీకి ఎలా తెలిసిపోతున్నాయో మరి. బోండా ఉమా లాంటి వారు విజయమ్మ కూడా జగన్ కి యాంటీగా ప్రచారం చేస్తారు అని అంటున్నారు. బహుశా అది వారి కోరిక కావచ్చేమో కానీ అలా జరగదు అనే అంటున్నారు.