Begin typing your search above and press return to search.

విజయమ్మ మదర్స్ డే గిఫ్ట్ ఇచ్చారా ?

మొత్తం మీద ఇంతకాలం తన చెల్లెళే ట్రాప్ లో పడ్డారు అని దానికి కాంగ్రెస్ చంద్రబాబు అని జగన్ ఆరోపిస్తూ వస్తున్నారు. ఇపుడు తల్లి విజయమ్మే భారీ షాక్ ఇచ్చేసారు. దీనికి ఏమంటారో అన్న చర్చ మొదలైంది.

By:  Tupaki Desk   |   12 May 2024 3:48 AM GMT
విజయమ్మ మదర్స్ డే గిఫ్ట్ ఇచ్చారా ?
X

మే 12 మదర్స్ డే. వరల్డ్ వైడ్ గా ఆ రోజున మాతృ దినోత్సవాన్ని జరుపుకుంటారు. తల్లులను బిడ్డలు ఆరాధిస్తారు. అలాగే బిడ్డలు తల్లులను పూజిస్తారు. ఇక తమ బిడ్డలకు తల్లులు బహుమతులుగా దీవెనలు ఇస్తారు. వారు కోరుకున్న రంగాలలో వర్ధిల్లాలని మనసారా ఆశీస్సులు ఇస్తారు.

ఇదంతా ఎందుకు అంటే మదర్స్ డే గిఫ్ట్ ని వైఎస్ విజయమ్మ కాస్తా అడ్వాన్స్ గానే ఇచ్చేశారు. అది కూడా ఏపీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అని సెటైర్లు పడుతున్నాయి. వైఎస్ విజయమ్మ ఇంతకాలం జగన్ పక్షం అని అంతా అనుకున్నారు. అలాగే ప్రచారమూ సాగింది. జగన్ తన అభ్యర్ధుల ప్రకటనను ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద చేసినపుడు విజయమ్మ ప్రత్యక్షంగా హాజరై ఆయనకు దీవెనలు అందించారు.

ఆ తరువాత వైఎస్ షర్మిల కాంగ్రెస్ తరఫున పీసీసీ చీఫ్ హోదాలో అదే ఇడుపులపాయకు వస్తే విజయమ్మ వెంట వచ్చారు. ఆమెకు దీవెనలు అందించారు. ఇక సిద్ధం సభలకు జగన్ వెళ్తే విజయమ్మ దీవించారు. షర్మిల బస్సు యాత్రకూ బ్లెస్సింగ్స్ ఇచ్చారు. ఇలా తన ఇద్దరు బిడ్డలూ రెండు కళ్ళు అని ఆమె తల్లిగా సమ న్యాయం పాటించారు.

ఇక ఈసారి విజయమ్మ ఎన్నికల ప్రచారం కూడా ఎవరికీ చేయలేదు. 2019లో వైసీపీ తరఫున ఆమె ప్రచారం చేసి ఉన్నారు. ఈసారి కుమార్తె కాంగ్రెస్ కుమారుడు వైసీపీ కాబట్టి ఆమె ఏ వైపు కూడా తాను ఉండాలనుకోలేదు. అందుకే ఆమె ఎన్నికల షెడ్యూల్ కి ముందే అమెరికా వెళ్ళిపోయారు.

దీని మీద ఎవరికి తోచిన కామెంట్స్ వారు చేసుకున్నారు. తల్లి కాబట్టి ఇద్దరూ కావాలి కాబట్టి ఆమె వన్ సైడెడ్ గా లేరు అని అన్నారు. కానీ ఎన్నికల ప్రచారం ఏపీలో కొద్ది గంటలలో ముగుస్తుంది అనగా విజయమ్మ ఒక షాకింగ్ వీడియో రిలీజ్ చేశారు. అందుకో కడప నుంచి కాంగ్రెస్ తరఫున ఎంపీగా పోటీ చేస్తున్న వైఎస్ షర్మిలను గెలిపించాలని కోరారు.

వైఎస్సార్ ఆశయాలు ఆమె నెరవేరుస్తారని పేర్కొనడమూ విశేషం. అంతే కాదు, షర్మిలని వైఎస్సార్ ని ప్రేమించే ప్రతీ అభిమానీ గెలిపించాలని కూడా కోరారు. దీంతో వైసీపీకి మరీ ముఖ్యంగా జగన్ కి గట్టి షాక్ తగిలింది అని అంటున్నారు. వైసీపీ నుంచి అక్కడ సిట్టింగ్ ఎంపీ అవినాష్ రెడ్డి పోటీ చేస్తునారు. షర్మిలని గెలిపించాలీ అంటే వైసీపీని ఓడించమనే కదా అర్ధం అని అంటున్నారు.

ఇక కడపకు ఒక రోజు ముందు వెళ్ళి ఎన్నికల ప్రచారం చేసి వచ్చిన జగన్ కాంగ్రెస్ మీద దుమ్మెత్తిపోశారు. ఏపీలో ఆ పార్టీ చంద్రబాబుని గెలిపించేందుకే రంగ ప్రవేశం చేసింది అన్నారు. తన చెల్లెళ్ళు ఆ ట్రాప్ లో పడ్డారు అని కూడా అన్నారు. మరి విజయమ్మ సాక్ష్తాత్తు వైఎస్సార్ సతీమణి కాంగ్రెస్ కి మద్దతుగా ప్రకటన చేయడంతో అది వైసీపీకి తీరని నష్టాన్ని చేకూరుస్తుందా అన్న చర్చకు తెర లేస్తోంది.

విజయమ్మ ప్రకటన కేవలం కడపకే పరిమితం కాదని ఏపీలోనూ ప్రభావం చూపుతుందని కూడా అంటున్నారు. ఇక్కడ మరో పాయింట్ కూడా ఉంది. వైఎస్సార్ పేరుని ఆయన మరణానంతరం ఎఫ్ఐఆర్ లో పెట్టింది కాంగ్రెస్ అని జగన్ ఆరోపించారు. వైఎస్సార్ కుటుంబాన్ని సర్వ నాశనం చేసిన పార్టీ కాంగ్రెస్ అని కూడా అన్నారు. మరి అలాంటి పార్టీని ఏపీలో గెలిపించమని విజయమ్మ చెప్పడం అంటే అది వైసీపీ అవకాశాలను దెబ్బ తీయడమే అవుతుందని అంటున్నారు. ఒకసారి కాంగ్రెస్ ఏపీలో లేచి కూర్చుంటే నష్టపోయే పార్టీ ఏదో వేరే చెప్పాల్సింది కూడా లేదు అని అంటున్నారు.

మొత్తం మీద ఇంతకాలం తన చెల్లెళే ట్రాప్ లో పడ్డారు అని దానికి కాంగ్రెస్ చంద్రబాబు అని జగన్ ఆరోపిస్తూ వస్తున్నారు. ఇపుడు తల్లి విజయమ్మే భారీ షాక్ ఇచ్చేసారు. దీనికి ఏమంటారో అన్న చర్చ మొదలైంది. ఒక విధంగా వైఎస్సార్ సొంత కుటుంబంలో జగన్ ఒంటరి వారుగా ఉన్నారా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఈ ఆదివారం మదర్స్ డే ఉంటే ఒక్క రోజు ముందే జగన్ కి విజయమ్మ మదర్స్ డే గిఫ్ట్ ని ఇలా ఇచ్చేశారు అని అంటున్నారు.