Begin typing your search above and press return to search.

వైసీపీ తరఫున విజయమ్మ ప్రచారం...!?

వైఎస్ విజయమ్మ వైసీపీ వ్యవస్థాపక సభ్యురాలు. పార్టీ పెట్టినపుడు ఆమె జగన్ మాత్రమే ఉన్నారు. దాంతో పాటు వైసీపీ నుంచి గెలిచిన తొలి ఎమ్మెల్యే ఆమె.

By:  Tupaki Desk   |   3 March 2024 3:53 PM GMT
వైసీపీ తరఫున విజయమ్మ ప్రచారం...!?
X

ఏపీలో రాజకీయాలు కొత్త రూపు సంతరించుకుంటున్నాయి. ఎవరికి వారు ఎక్కడికక్కడ సర్దుకుంటున్నారు. రాజకీయం అంటేనే కఠినం అని చాణక్యుడు ఏనాడో చెప్పారు. అక్కడ అనుబంధాలకు తావు ఉండదు, ఈ నేపధ్యంలో ఏపీలో కూడా అదే కనిపిస్తోంది. జగన్ కి ఎదురు నిలిచింది ఆయన సొంత చెల్లెలు షర్మిల, ఆమె జగన్ జీవితకాలం వ్యతిరేకించే కాంగ్రెస్ తో చేయి కలిపింది. ఆ పార్టీ ఏపీ ప్రెసిడెంట్ అయి జగన్ మీద నిప్పులు చెరుగుతోంది.

మరో చెల్లెలు సునీత అయితే అన్నకు అధికారం మళ్లీ ఇవ్వొద్దు అని ఢిల్లీ నుంచి ఒక మీడియా మీట్ పెట్టి మరీ హాట్ స్టేట్మెంట్ ఇచ్చేశారు. ఆమె కూడా తొందరలో పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతారు అని అంటున్నారు. మరి ఈ నేపధ్యంలో రాజకీయ ప్రత్యర్ధులకు అయితే వైసీపీ నేతలు జవాబు చెప్పడానికి సరిపోతారు కానీ కుటుంబ సభ్యుల మీద విమర్శలు చేసేందుకు ఎవరు ఉంటారు అన్న చర్చ మొదలైంది.

అంతే కాదు కడప జిల్లాలో వైసీపీకి కంచుకోట లాంటి చోట చెల్లెళ్ళు ఇద్దరూ జగన్ కి వ్యతిరేకంగా సమరభేరీ మోగిస్తున్న నేపధ్యంలో వారికి కుటుంబం నుంచే సరైన జవాబు చెప్పించాలన్న ఒత్తిడి అయితే వస్తోందని అంటున్నారు. ముఖ్యంగా కడప జిల్లా వైసీపీ నేతల నుంచి ఈ వత్తిడి వస్తోంది అని అంటున్నారు.

దాంతో ఇపుడు వైసీపీ హై కమాండ్ కూడా దీని మీద సీరియస్ గా ఆలోచిస్తుంది అని అంటున్నారు.మరో వైపు చూస్తే 2019 ఎన్నికల్లో జగన్ తో పాటు షర్మిల విజయమ్మ స్టార్ కాంపెయినర్లుగా ఎన్నికల ప్రచారంలో పాలుపంచుకున్నారు. ఇపుడు అలాంటి పరిస్థితి కనిపించడంలేదు. షర్మిల సైలెంట్ గా కూడా ఏమీ లేరు. ఆమె ఎదురు నిలిచి జగన్ పార్టీని గద్దె దించాలని చూస్తున్నారు.

దీంతో వైసీపీకి స్టార్ కాంపెనియర్ గా జగన్ ఒక్కరే కనిపిస్తున్నారు. ఆ లోటుని భర్తీ చేసుకుకునేందుకు కూడా వైసీపీ సరికొత్త ఆలోచనలు చేస్తోంది అని అంటున్నారు. వైఎస్ విజయమ్మను ఈసారి వైసీపీ తరఫున ప్రచారం చేయించాలని చూస్తున్నారు అని అంటున్నారు. ఈ మేరకు ఆమె వైపు నుంచి కూడా సానుకూల స్పందన వచ్చిందని అంటున్నారు.

వైఎస్ విజయమ్మ వైసీపీ వ్యవస్థాపక సభ్యురాలు. పార్టీ పెట్టినపుడు ఆమె జగన్ మాత్రమే ఉన్నారు. దాంతో పాటు వైసీపీ నుంచి గెలిచిన తొలి ఎమ్మెల్యే ఆమె. అలాగే ఆమె 2014 ఎన్నికల్లో విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేశారు. 2019 దాకా ఆమె వైసీపీకి అండగా ఉన్నారు. వైసీపీకి 2022 దాకా గౌరవ అధ్యక్షురాలిగా ఉన్నారు.

ఎపుడైతే షర్మిల తెలంగాణాలో పార్టీ పెట్టారో అప్పటి నుంచి ఆమె కుమార్తెకు అండగా నిలిచేందుకు వైసీపీ లో పదవిని వదులుకున్నారు. ఇపుడు చూస్తే ఆ పార్టీయే లేదు. పైగా షర్మిల కాంగ్రెస్ లో చేరి ఏపీలో రాజకీయం చేస్తున్నారు. దాంతో విజయమ్మ తన సొంత నిర్ణయం తీసుకోవడానికి వీలు పడింది అని అంటున్నారు.

ఆమె వైసీపీకి మద్దతుగా ప్రచారం చేయడానికి సుముఖంగా ఉన్నారని ప్రచారం సాగుతోంది. దీనితో పాటు మరో ప్రచారం కూడా ఉంది. ఆమెను ఎన్నికల్లో పోటీకి దించుతారు అని. ఆమెను పులివెందుల నుంచి కానీ జమ్మలమడుగు లేదా కమలాపురం నుంచి కానీ అసెంబ్లీకి పోటీ చేయిస్తారు అని అంటున్నారు. ఈ మూడు సీట్లూ వైసీపీకి కంచుకోటలు. ఇక కమలాపురంలో చూస్తే విజయమ్మ సోదరుడు రవీంద్ర నాధ్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. సో ఆమెను ఈసారి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయిస్తే ఎలా ఉంటుంది అన్నది కూడా పార్టీ సీరియస్ గా ఆలోచన చేస్తోంది అని అంటున్నారు.

మొత్తం మీద చూసుకుంటే వైసీపీ ఎన్నికల ప్రణాళికను 10న రిలీజ్ చేస్తారు, ఆ తరువాత ఒకేసారి మొత్తం 175 మంది అభ్యర్ధుల లిస్ట్ ని రిలీజ్ చేస్తారు. దాంతో పాటు ప్రచారానికి జగన్ సిద్ధం అవుతారు అని అంటున్నారు. ఆయనతో పాటుగా మార్చి మూడవ వారం నుంచి ఎన్నికలు పూర్తి అయ్యేంతవరకూ విజయమ్మ ఏపీలో విస్తృతంగా ప్రచారం చేస్తారు అని ప్రత్యర్ధుల ఆరోపణలను తిప్పికొడుతూనే కాంగ్రెస్ ప్రెసిడెంట్ షర్మిల చేసే విమర్శలకు కూడా వైసీపీ తరఫున తగిన జవాబు చెబుతారు అని అంటున్నారు. చూడాలి మరి ఈ ప్రచారంలో వాస్తవం ఎంత ఉందో.