Begin typing your search above and press return to search.

మేనిఫెస్టోలోని హామీలను నెరవేర్చగలడా..? విజయ్ పాలనపై ద్రవిడ రాష్ట్రంలో చర్చ..

తమిళనాడు గడ్డపై ఇప్పుడు కొత్తగా కొలువుదీరబోతున్న ప్రభుత్వం ముందు ఒక భారీ ఆర్థిక సవాల్ ఎదురుచూస్తోంది.

By:  Tupaki Political Desk   |   6 May 2026 11:22 AM IST
మేనిఫెస్టోలోని హామీలను నెరవేర్చగలడా..? విజయ్ పాలనపై ద్రవిడ రాష్ట్రంలో చర్చ..
X

రాజకీయాల్లో హామీలు ఇవ్వడం ఒక ఎత్తయితే.. వాటిని ఆచరణలో పెట్టడం మరో ఎత్తు. ఎన్నికల సమయంలో ప్రజల మద్దతు పొందేందుకు ప్రకటించే పథకాలు, ఓటర్ల మనసును గెలుచుకొని అధికారాన్ని తెచ్చిపెట్టవచ్చు. కానీ, ఆ గెలుపు ఉత్సాహం ముగిసి పాలనా పగ్గాలు చేతికి రాగానే.. అసలు సవాళ్లు మొదలవుతాయి. అద్భుతమైన ప్రజాదరణతో పీఠం ఎక్కుతున్న ఒక నాయకుడి ముందు ఇప్పుడు తన స్వప్నాలను, ప్రజల ఆశలను ఏకకాలంలో నెరవేర్చాల్సిన బాధ్యత ఉంది. అయితే, ఈ క్రమంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో ఉంచుతూనే, మాటకు కట్టుబడడం కత్తి మీద సాము లాంటిదే. తమిళనాడు గడ్డపై ఇప్పుడు కొత్తగా కొలువుదీరబోతున్న ప్రభుత్వం ముందు ఒక భారీ ఆర్థిక సవాల్ ఎదురుచూస్తోంది.

₹92,000 కోట్ల అదనపు భారం

తమిళనాడులో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు టీవీకే పార్టీ సిద్ధమవుతున్న తరుణంలో, ఆ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో హామీలపై రాష్ట్ర ఆర్థిక వర్గాల్లో చర్చ జరుగుతోంది. విజయ్ ప్రకటించిన సంక్షేమ పథకాలను యథాతథంగా అమలు చేయాలంటే, రాష్ట్ర ఖజానాపై ఏడాదికి దాదాపు ₹92,000 కోట్ల అదనపు భారం పడుతుందని అంచనా. ఇప్పటికే ఉన్న అప్పులు, పాలనాపరమైన ఖర్చులకు తోడు, ఈ భారీ మొత్తం చేయడం కొత్త ప్రభుత్వానికి పరీక్షగా మారనుంది. సంక్షేమమే ధ్యేయంగా సాగే ఈ ప్రయాణంలో నిధుల సమీకరణ ఎలా ఉండబోతోందన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.

ఆచరణలో భారీ ఖర్చు

విజయ్ తన ప్రచారంలో ప్రధానంగా మహిళలు, వృద్ధులు, రైతులను ఆకట్టుకునేలా భారీ పథకాలను ప్రకటించారు.

మహిళా భృతి: మహిళలకు ఇచ్చే నెలవారీ భృతిని ₹2,500కు పెంచడం.

వృద్ధాప్య పింఛన్: వృద్ధుల పింఛన్ ను ₹3,000కు పెంచడం ద్వారా భారీ వర్గానికి ప్రయోజనం.

ఉచిత విద్యుత్: విద్యుత్ పరిమితిని 200 యూనిట్లకు పెంచడం వల్ల గృహ వినియోగదారులకు ఊరట.

గ్యాస్ సిలిండర్లు: ఏడాదికి ఆరు ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ.

రైతు భరోసా: రైతులకు పెట్టుబడి సాయం కింద ఏటా ₹15,000 అందజేత.

వీటితో పాటు మరిన్ని వసతుల కల్పన వంటి హామీలు కూడా ఖజానాపై ఒత్తిడి పెంచేవే.

ఆర్థిక క్రమశిక్షణతో పాలన సాగుతుందా?

ఒకవైపు అభివృద్ధి పనులను కొనసాగిస్తూనే, మరోవైపు ఈ స్థాయి సంక్షేమ పథకాలను అమలు చేయడం అంత తేలికేమీ కాదు.. రాష్ట్ర సొంత ఆదాయ వనరులను పెంచుకోవడం లేదంటే అనవసర ఖర్చులను తగ్గించుకోవడం ద్వారా మాత్రమే ఈ పథకాలను విజయవంతం చేయవచ్చు. తమిళనాడు వంటి పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన రాష్ట్రంలో, కొత్త పెట్టుబడులను ఆకర్షించి ఆదాయాన్ని పెంచే దిశగా విజయ్ ప్రభుత్వం అడుగులు వేయాలి. లేదంటే, కేవలం అప్పుల ద్వారా పథకాలను అమలు చేస్తే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతినే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

విజయ్ గెలుపులో సంక్షేమ హామీలు కీలక పాత్ర పోషించాయి. ముఖ్యంగా సామాన్య ప్రజలు ఈ పథకాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే వీటిలో వేటికి మొదటి ప్రాధాన్యత ఇస్తారనేది తమిళనాడులో చర్చ జరుగుతోంది. ప్రభుత్వంపై ఉన్న అంచనాలను తట్టుకుంటూనే, ఖజానాను కాపాడుకోవడం విజయ్ టీమ్ లోని ఆర్థిక నిపుణుల మేధస్సుకు పెద్ద సవాల్. ఏది ఏమైనా, ‘ప్రజా సంక్షేమమే మా లక్ష్యం’ అని చెబుతున్న కొత్త ప్రభుత్వం, ఈ ₹92,000 కోట్ల భారాన్ని ఎలా అధిగమిస్తుందో వేచి చూడాలి.