Begin typing your search above and press return to search.

దళపతి విజయ్ ప్రభంజనం: ఎంజీఆర్, జయలలిత వారసత్వాన్ని నిల‌బెడ‌తాడా?

తమిళనాడు రాజకీయాల్లో సినీ గ్లామర్‌కు ఉండే క్రేజ్ సామాన్యమైంది కాదని దళపతి విజయ్ మరోసారి నిరూపించారు.

By:  Tupaki Desk   |   4 May 2026 4:00 PM IST
దళపతి విజయ్ ప్రభంజనం: ఎంజీఆర్, జయలలిత వారసత్వాన్ని నిల‌బెడ‌తాడా?
X

తమిళనాడు రాజకీయాల్లో సినీ గ్లామర్‌కు ఉండే క్రేజ్ సామాన్యమైంది కాదని దళపతి విజయ్ మరోసారి నిరూపించారు. తమిళ వెట్రి కజగం (TVK) పార్టీని స్థాపించిన నాటి నుండి ఎన్నికల వరకు విజయ్ ఎన్నో ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల విమర్శలు, అధికార పార్టీ విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేసే ప్రయత్నం చేసినా.. ప్రజలు మాత్రం ఆయనలో దివంగత నేతలు ఎంజీఆర్ - జయలలితలను చూసుకున్నారు. సినిమా ఇమేజ్‌ను రాజకీయ బలంగా మార్చుకోవడంలో విజయ్ అసాధారణ విజయం సాధించి.. తమిళనాట సినీ-రాజకీయ బంధాన్ని మరింత బలోపేతం చేశారు.

ఎన్నికలకు ముందు విజయ్ వ్యక్తిగత జీవితం చుట్టూ అనేక వివాదాలు చుట్టుముట్టాయి. ముఖ్యంగా తన భార్యతో విడాకుల ప్రహసనం ఆయన రాజకీయ భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం చూపుతుందని విశ్లేషకులు భావించారు. దీనికి తోడు నటి త్రిషతో కలిసి పబ్లిగ్గా కనిపించడంపై ప్రత్యర్థులు తీవ్రస్థాయిలో దుష్ప్రచారం సాగించారు. తన భార్య, కొడుకుతో ఎమోషనల్ గ్యాప్‌ను ఎదుర్కొంటున్నారనే వార్తలు ఆయన ఇమేజ్‌ను దెబ్బతీసేలా ప్రచారం జరిగినా తమిళ ఓటర్లు మాత్రం వ్యక్తిగత విషయాల కంటే విజయ్ ఆశయాలకే పెద్దపీట వేయడం విశేషం.

రాజకీయ ప్రస్థానంలో విజయ్‌కి అపప్రదగా మారిన మరో ఘటన ఆయన భారీ బహిరంగ సభలో జరిగిన తొక్కిసలాట. ఈ దుర్ఘటనలో పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోవడంతో పార్టీ బాధ్యతారాహిత్యంపై విమర్శలు వెల్లువెత్తాయి. పరిస్థితులు ఎంతలా విషమించాయంటే... ప్రచారం నిర్వహించుకోవడానికి కూడా సరైన అనుమతులు లేక విజయ్ మలేషియాకు వెళ్లిపోవాల్సిన దుస్థితి ఏర్పడింది. విదేశీ గడ్డపై నుండి ప్రచారం నిర్వహించినా.. తనపై వస్తున్న విమర్శలకు నిరుత్సాహపడకుండా విజయ్ తన పోరాటాన్ని కొనసాగించారు.

తమిళనాడు రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేలా వచ్చిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలన్నీ తలకిందులయ్యాయి. జాతీయ స్థాయి విశ్లేషకులు విజయ్ పార్టీకి స్వల్ప స్థానాలే దక్కుతాయని జోస్యం చెప్పగా.. ఫలితాలు మాత్రం యావత్ భారతదేశాన్ని ఆశ్చర్యపరిచాయి. అధికార, ప్రతిపక్ష కూటములకు దీటుగా విజయ్ నాయకత్వంలోని టీవీకే పార్టీ అసాధారణ విజయాన్ని నమోదు చేసింది. ఓటర్ల తీర్పుతో తమిళనాడులో సరికొత్త రాజకీయ శకం ప్రారంభమైందని.. దశాబ్దాల కాలంగా కొనసాగుతున్న సంప్రదాయ రాజకీయ పార్టీల ఆధిపత్యానికి విజయ్ బ్రేక్ వేశారని స్పష్టమైంది.

దళపతి విజయ్ సాధించిన ఈ విజయం కేవలం గ్లామర్‌తో వచ్చినది కాదు.. అది ప్రజల్లో ఆయనపై ఉన్న నమ్మకానికి ప్రతిరూపం. ఎన్ని వ్యక్తిగత విమర్శలు వచ్చినా... రాజకీయంగా ఎన్ని అడ్డంకులు ఎదురైనా అవేవీ ప్రజాభిమానం ముందు నిలవవని ఈ ఎన్నికల ఫలితాలు నిరూపించాయి. రాజకీయాల్లోకి వచ్చిన సినీ నటులలో ఎంజీఆర్, జయలలిత వంటి చారిత్రాత్మక విజయాలను విజయ్ తన ఖాతాలో వేసుకున్నారు. ఈ విజయం భవిష్యత్తులో తమిళనాడు రాజకీయాల్లో ఆయనను ఒక తిరుగులేని శక్తిగా నిలబెట్టడం ఖాయం. త‌మిళ‌నాడులో 100 పైగా స్థానాల‌లో టీవీకే పార్టీ విజ‌యం సాధించి, ముఖ్య‌మంత్రి కుర్చీపై విజ‌య్ ని కూచోబెట్టే మ్యాజిక్ ని సాధించ‌డం సంచ‌ల‌నంగా మారింది. దివంగ‌త లెజెండ‌రీ నాయ‌కులు, గ్లామ‌ర్ రంగ‌పు దిగ్గ‌జాలు ఎంజీఆర్, జయలలిత వారసత్వాన్ని నిల‌బెడుతూ విజ‌య్ త‌న పాల‌న‌ను సాగిస్తాడ‌ని ప్ర‌జ‌లు న‌మ్ముతున్నారు.