తమిళనాడు... ఆ పార్టీకి *విజయ్ం* అందిస్తున్న కొత్త పార్టీ?
ఇప్పటికిప్పుడు లోక్ సభ ఎన్నికలు జరిగితే.. అనే కాన్సెప్ట్ తో, మూడ్ ఆఫ్ ద నేషన్ అంటూ ఇండియా టుడే- సీ వోటర్ నిర్వహించిన సర్వేలో తమిళనాడు గురించి సంచలన విషయాల వెల్లడయ్యాయి.
By: Tupaki Desk | 29 Aug 2025 11:00 PM ISTఇల్లు అలకగానే పండుగ కాదు.. అనేది తెలుగులో బాగా ఫేమస్ సామెత. ఇదే సామెతను కొంత మారిస్తే పార్టీ పెట్టగానే సరిపోదు అనుకోవాలి. రాజకీయాలు ఆషామాషీ కాదు.. ప్రజల్లోకి వెళ్లాలి.. విధానాలు చెప్పాలి.. అవి ప్రజలకు నచ్చాలి... ఎదురుదెబ్బలకు సిద్ధంగా ఉండాలి.. సమీకరణాలు కూడా కలిసిరావాలి. ఇంతజేసినా అసలు ఎన్నికల్లో గెలుస్తామో లేదో చెప్పలేని పరిస్థితి. గెలిచినప్పటికీ ప్రతిపక్షాలతో జాగ్రత్తగా ఉండాలి. లేదంటే వేరొక పార్టీకి పరోక్షంగా ఉపయోగపడే ప్రమాదాలూ ఉంటాయి. తమిళనాడులో ఇప్పుడు ఇదే పరిస్థితి నెలకొందని చెబుతున్నారు.
మూడో పెద్ద ప్రాంతీయ పార్టీ
దక్షిణాదిన తమిళనాడులో మాత్రమే ప్రాంతీయ పార్టీల రాజ్యం నడుస్తుంటుంది. ఇప్పుడు అలాంటిచోట టీవీకే (తవిళ వెట్రి కళగం) అంటూ కొత్త పార్టీని స్థాపించారు స్టార్ హీరో జోసెఫ్ విజయ్. వచ్చే ఏడాది ప్రారంభంలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని చెబుతున్నారు. ఇప్పటికే రెండో మహానాడును కూడా నిర్వహించారు. అధికారం డీఎంకే, ప్రతిపక్ష అన్నాడీఎంకేలు ప్రధాన ప్రాంతీయ పార్టీలుగా ఉండగా.. దివంగత విజయ్ కాంత్ పార్టీ డీఎండీఏ, మేటి నటుడు కమల్ హాసన్ పార్టీ మక్కల్ నీది మయ్యం, పీఎంకే వంటి తదితర పార్టీలు కూడా ఉన్నప్పటికీ విజయ్ పాపులారిటీ ప్రకారం ఆయన పార్టీ మూడో పెద్ద ప్రాంతీయ పార్టీగా నిలుస్తుందని భావిస్తున్నారు.
సర్వే ఏం చెబుతోంది..?
ఇప్పటికిప్పుడు లోక్ సభ ఎన్నికలు జరిగితే.. అనే కాన్సెప్ట్ తో, మూడ్ ఆఫ్ ద నేషన్ అంటూ ఇండియా టుడే- సీ వోటర్ నిర్వహించిన సర్వేలో తమిళనాడు గురించి సంచలన విషయాల వెల్లడయ్యాయి. జూలై 1 నుంచి ఆగస్టు 24 మధ్య చేసిన ఈ సర్వేలో తమిళనాడులోని 39 లోక్ సభ సీట్లలో 36 డీఎంకే కూటమి గెలుచుకుంటుందని తేలింది. అన్నాడీఎంకే-బీజేపీ కూటమి ఎన్డీఏకు మూడు సీట్లు వస్తాయని తెలిపింది. గత ఏడాది ఎన్నికల్లో డీఎంకే కూటమి 39 సీట్లలోనూ నెగ్గింది.
ఓట్లు డబుల్ అయినా...
నిరుటి లోక్ సభ ఎన్నికలలో అన్నాడీఎంకే కూటమికి 18 శాతం ఓట్లు వచ్చాయి. ఇప్పుడు అవి 37 శాతానికి పెరిగే చాన్స్ ఉందని సర్వే పేర్కొంది. కానీ, వచ్చే సీట్లు మాత్రం మూడేనని తెలిపింది. సంక్షేమ పథకాలు, హిందీ వ్యతిరేక ఉద్యమం, నీట్ రద్దు పోరాటం డీఎంకే పట్ల ప్రజల్లో సానుకూలత ఏర్పరచాయని చెబుతోంది. మరి.. అన్నాడీఎంకే-బీజేపీ కూటమికి దెబ్బ ఎక్కడ పడుతోంది అంటే.. అది విజయ్ పార్టీ రూపంలో. డీఎంకే ప్రభుత్వంపై ఉన్న కాస్తోకూస్తో వ్యతిరేకతను టీవీకే చీల్చుతోందని తెలుస్తోంది.
ఇంకా టైం ఉంది...
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడెనిమిది నెలల సమయం ఉంది. అప్పటికి పరిస్థితులు, సమీకరణాలు మారొచ్చు. ఇప్పటి లెక్క ప్రకారం డీఎంకేకు టీవీకే మేలు చేస్తోందని అంచనా. విజయ్ ఇంకా ప్రజల్లోకి వెళ్లి, తన విధానాలను బలంగా చెబతే పరిస్థితిలో మార్పు రావొచ్చు.
కొసమెరుపుః పోలిక సమంజసమో కాదో కానీ.. ఉమ్మడి ఏపీలో 2008లో మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ.. అప్పటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చిందనే అభిప్రాయం కొందరు వ్యక్తం చేశారు. తమిళనాడులో టీవీకే కూడా అలాంటి పాత్రనే పోషించనుందా?
