Begin typing your search above and press return to search.

టీవీకేని వెంటాడుతున్న తమిళ గీతం !

తమిళనాడు ముఖ్యమంత్రి టీవీకే అధినేత విజయ్ కి సమస్యలు మిత్రులతోనే వస్తున్నాయి. అది కూడా వారి భావజాలానికి ఆయన ఆలోచనలకు మధ్యనే ఇది జరగడం విశేషం.

By:  Satya P   |   21 May 2026 11:22 PM IST
టీవీకేని వెంటాడుతున్న తమిళ గీతం !
X

తమిళనాడు ముఖ్యమంత్రి టీవీకే అధినేత విజయ్ కి సమస్యలు మిత్రులతోనే వస్తున్నాయి. అది కూడా వారి భావజాలానికి ఆయన ఆలోచనలకు మధ్యనే ఇది జరగడం విశేషం. విజయ్ తనకు కులం మతం ప్రాంతం లేదని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ద్రవిడవాదం విషయంలో ఉదారంగా వ్యవహరిస్తారు. అదే సమయంలో ఆయన మత రహిత కుల రహిత అన్న ఫిలాసఫీతో టీవీకేని ముందుకు తీసుకుని వెళ్తున్నారు. ఆయనకు తమిళ అస్తిత్వం మీద గౌరవం ఉంది. అదే సమయంలో మరీ పట్టుదలగా వ్యవహరించాలి అని ఆరాటం అయితే లేదు. అందుకే ఆయన కొన్ని విషయాలలో చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు.

తమిళ గీతం రచ్చ :

తమిళనాడుకు ప్రత్యేక అస్తిత్వం ప్రత్యేక గీతం ఇలా చాలా ప్రత్యేకతలు ఉండాలని ద్రవిడ పార్టీలు ఒక శాసనం చేసి పాటిస్తూ వస్తున్నాయి. ఎంతటి పెద్ద నాయకుడు అయినా ఆఖరుకు ప్రధాని అయినా తమిళనాడులో తమిళం లేదా ఆంగ్లం లేదా ఏ ఇతర భాషలలో అయినా మాట్లాడవచ్చు తప్ప హిందీ ప్రస్తావన రాకూడదు. ఇక తమిళనాడు గీతం అయితే రాష్ట్ర గీతం అది అధికార గీతం. ఏ అధికారిక కార్యక్రమంలో అయినా మొదట దానిని ఆలపించి మిగిలిన వాటిని ఆలపించాల్సిందే. ఇది ఆనాటి గవర్నర్ రవికి చికాకు తెప్పించింది. దేశం ముందు అని ఆయన బడ్జెట్ సెషన్ వేళ మొదట వందేమాతరం ఆలపించాలని కోరే వారంటారు. కానీ నాటి అధికార డీఎంకే మాత్రం తమిళ గీతాన్ని మొదట ఆలపించేది. దాంతో గవర్నర్ రవి బడ్జెట్ సెషన్ లో ప్రసంగించకుండానే రెండు సార్లు వెనక్కి వెళ్ళిపోయిన ఉదంతాలూ ఉన్నాయి.

విజయ్ హయాంలో రెండు సార్లు :

ఇవన్నీ పక్కన పెడితే విజయ్ ముఖమంత్రిగా ప్రమాణం చేసినపుడు కూడా తమిళ గీతం విషయంలో మద్దాతు పార్టీలు అయిన ఉభయ వామపక్షాలు అలాగే వీసీకే నిరసన తెలియచేశాయి. ఆనాడు మొదట వందేమాతరం ఆ తరువాత జనగణమన మూడవదిగా తమిళనాడు గీతం ఆలపించారు. అయితే దాని మీద టీవీకే మంత్రి అర్జున పొరపాటు ఎక్కడ జరిగిందో అధికారులను కనుక్కుంటాను అని మిత్ర పక్షాలకు చెప్పి శాంతింపచేశారు. అయితే తిరిగి గురువారం 23 మంది మంత్రులతో మంత్రివర్గ విస్తరణ చేపట్టారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో సైతం అదే తప్పు జరిగిందని మిత్ర పక్షాలు మండిపడుతున్నాయి. మొదట వందేమాతరం ఆ తరువాత జనగణమన చివరిగా తమిళ గీతం ఆలపించారు. దాంతో విజయ్ ప్రభుత్వం మీద మిత్ర పక్షాలు అయితే ఆగ్రహంగా ఉన్నాయి.

ఎందుకలా అంటే :

విజయ్ అయితే చాలా నిబద్ధతతో ఉంటారు. తన సిధ్దాంతాల విషయంలో ఆయన రాజీ పడరు. అదే సమయంలో తమిళ గీతం మొదటనా చివరినా అన్న దాని మీద విజయ్ కి ఏ రకమైన అభిప్రాయం ఉందో తెలియదు కానీ అది అలాగే కొనసాగుతోంది. మిత్రులు కారాలూ మిరియాలూ నూరుతూనే ఉన్నారు. చిన్న చిన్న విషయాలే పెద్దవి అవుతాయి. మరి తమిళ గీతం విషయంలో విజయ్ ఏ విధంగా వ్యవహరిస్తారు అన్నది పూర్తి స్థాయి బడ్జెట్ సెషన్ సందర్భంగా ఇంకోసారి తేలనుంది. అపుడు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం వేళ ఏమి జరుగుతుందో చూసిన మీదట ఫుల్ క్లారిటీ వస్తుంది అని అంటున్నారు. చూడాలి మరి.