Begin typing your search above and press return to search.

కులమతాలను డ్రగ్స్ తో పోల్చిన హీరో.. సంచలన వ్యాఖ్యలు!

వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ తమిళనాడు రాజకీయాలు వేడెక్కుతున్నాయి.

By:  Tupaki Desk   |   30 May 2025 4:06 PM IST
కులమతాలను డ్రగ్స్  తో పోల్చిన హీరో.. సంచలన వ్యాఖ్యలు!
X

వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ తమిళనాడు రాజకీయాలు వేడెక్కుతున్నాయి. మరోపక్క తొలిసారి ఎన్నికల్లో పోటీ పడబోతున్న "తమిళగ వెట్రి కళగం" దూకుడు పెంచుతోంది. ఈ సమయంలో.. 10, 12 తరగతుల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను సత్కరించారు టీవీకే అధినేత, ప్రముఖ హీరో విజయ్.

అవును... తాజాగా తమిళనాడు రాజధాని చెన్నైలో 10, 12 తరగతుల్లో అత్యధిక మార్కులు సధించిన విద్యార్థులను సత్కరించే కార్యక్రమం నిర్వహించింది టీవీకే! ఈ కార్యక్రమంలో మాట్లాడిన విజయ్... ప్రజాస్వామ్యం అందరికీ సమాన అవకాశాలు ఇచ్చిందని.. ప్రజాస్వామిక విలువలను పాటించాలని మీ కుటుంబ సభ్యులకు చెప్పాలని విద్యార్థులకు సూచించారు.

ఇదే సమయంలో.. అవినీతి కార్యకలాపాలకు దూరంగా ఉండే, విశ్వసనీయత కలిగిన వ్యక్తులకు ఓటు చేయాలని కోరాలని సూచించిన విజయ్... కులం, మతం ఆధారంగా జరిగే విభజనను తోసిపుచ్చాలని కోరారు. ఈ సందర్భంగా... సూర్యుడు, వరుణుడు.. వంటి వాటితో నెలవైన ఈ ప్రకృతికి కుల మత బేధం ఉందా అని ప్రశ్నించారు.

ఈ నేపథ్యంలోనే.. డ్రగ్స్ ను దూరం పెట్టినట్లుగా కులం, మతం వంటి వాటినీ దరిచేరనీయొద్దని కోరారు. కులం, మతం ఆధారంగా భావజాలం దగ్గరకు వెళ్లవద్దని కోరారు. ప్రజాస్వామ్యం ఉన్నప్పుడే ఈ ప్రపంచంలో స్వేచ్ఛ ఉంటుంది అని సూచించారు.

నియోజకవర్గానికి ముగ్గురు అభ్యర్థులు ఎంపిక!:

వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ విజయ్.. అటు అధికార డీఎంకేతో పాటు బీజేపీపైనా తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ సందర్భంగా 2026 అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థులను ఖరారు చేయడానికి టీవీకే పని ప్రారంభించింది. ఇందులో భాగంగా.. ప్రతీ నియోజకవర్గం నుంచి ముగ్గురిని ఎంపిక చేయనుంది. చివర్లో వారిలో ఒకరిని ఫైనల్ చేయనున్నారు!

అవును... రాష్ట్రంలోని 234 నియోజకవర్గాల్లో ముగ్గురు చొప్పున అభ్యర్థులను టీవీకే ఎంపిక చేస్తోంది. ఈ మేరకు ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న నేతల వివరాలను టీవీకే కార్యదర్శి ఆనంద్ స్వయంగా ఫోన్ చేసి సేకరిస్తున్నారని తెలుస్తోంది.