Begin typing your search above and press return to search.

నయా టెక్నాలజీ.. నయా రాజకీయం : ఆసక్తికరంగా టీవీకే ప్రచారం

తమిళనాడు ఎన్నికల్లో టీవీకే ప్రచారం కొత్త పుంతలు తొక్కుతోంది. మిగిలిన ప్రధాన పార్టీలకంటే భిన్నంగా కొత్త పద్దతులతో ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.

By:  Tupaki Political Desk   |   20 April 2026 6:16 PM IST
నయా టెక్నాలజీ.. నయా రాజకీయం : ఆసక్తికరంగా టీవీకే ప్రచారం
X

తమిళనాడు ఎన్నికల్లో టీవీకే ప్రచారం కొత్త పుంతలు తొక్కుతోంది. మిగిలిన ప్రధాన పార్టీలకంటే భిన్నంగా కొత్త పద్దతులతో ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఇటీవల కుంభకోణంలో టీవీకే అధినేత విజయ్ ప్రచారం చేస్తున్నట్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో హోల్ గ్రాఫిక్స్ ను ప్రదర్శించిన టీవీకే తాజాగా ఏకంగా రోబోను రంగంలోకి దింపింది. కోయంబత్తూరు టీవీకే అభ్యర్థితో కలిసి ఒక రోబో ఇంటింటా ప్రచారం చేయడం ఓటర్లను ఆకర్షిస్తోందని చెబుతున్నారు.

ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకోడానికి పార్టీలు, అభ్యర్థులు ఎంతో శ్రమిస్తారు. కొందరు టెక్నాలజీని వాడుకుని రకరకాల పద్ధతులలో దూసుకుపోయే ప్రయత్నం చేస్తుంటారు. కానీ, విజయ్ పార్టీ మాత్రం అందరి కంటే భిన్నంగా ఆలోచిస్తోందని చెబుతున్నారు. కేవలం రెండేళ్ల వయసున్న టీవీకే పార్టీ ప్రజల మధ్యలో చొచ్చుకు వెళ్లాలనే ఉద్దేశంతో ప్రచారంలో ప్రత్యేక పంథాను అవలంబిస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు. కుంభకోణంలో నిర్వహించిన ప్రచారంలో విజయ్ హోలోగ్రామ్ ఓటర్లను ఆకర్షించిందనే ప్రచారం జరగడంతో ఇతర చోట్ల కూడా టీవీకే అభ్యర్థులు డిజిటల్ ప్రచారాన్ని వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు.

కోయంబత్తూరులో ఒక రోబోను ఇంటింటికి తిప్పుతూ టీవీకే పార్టీకి ఓటు వేయాలని కార్యకర్తలు అభ్యర్థిస్తున్నారు. మనిషిలానే రోబో కూడా జనం మధ్యకు చొచ్చుకుని వెళ్లి విజిల్ గుర్తుకు ఓటు వేయాల్సిందిగా అభ్యర్థిస్తోంది. టీవీకే పార్టీ కండువాను కప్పుకుని అభ్యర్థి వెంట నడుస్తున్న రోబో అందరినీ ఆకర్షిస్తోంది. దీనిని గమనిస్తున్న వారు ఎన్నికల కోసం టీవీకే ఏ రకమైన సాంకేతికతను వదలడం లేదని, అన్నీ ప్రయోగిస్తూ ఓటర్లను ఆశ్చర్యానికి గురిచేస్తూ తమ పార్టీపై చర్చ జరిగేలా చేస్తున్నారని అంటున్నారు.

ప్రస్తుతం తమిళనాడులో టీవీకే సాగిస్తున్న ఇటువంటి ప్రచారం ఓటర్లలో ఆసక్తి పుట్టిస్తోంది. నిజానికి ఎన్నికల ప్రచారంలో ఇలాంటి సాంకేతికతను వాడటం దేశంలో తొలిసారి కాదు. కానీ, టీవీకే పార్టీ కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఏఐ టెక్నాలజీని సమర్థంగా వాడుకుంటూ ఎన్నికల ప్రచార సరళిని మార్చేస్తుండటమే హాట్ టాపిక్ అవుతోంది. సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ ముందే ఉంటాయని తాజా పరిణామం మరోసారి రుజువు చేసిందని అంటున్నారు. మొత్తానికి టీవీకే తీసుకువచ్చిన నయా ట్రెండ్ దేశ రాజకీయాల్లో ఎన్నికల ప్రచారాన్ని సరికొత్త పుంతలు తొక్కిస్తుందని వ్యాఖ్యానిస్తున్నారు.