సోషల్ సర్వే : విజయ్ పార్టీకి 105 సీట్లు?
సర్వే వివరాల ప్రకారం, తమిళగ వెట్రి కళగం పార్టీ 2026లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో దాదాపు 95 నుంచి 105 స్థానాలలో విజయం సాధించే అవకాశం ఉందని, 34.55 శాతం ఓట్లను పొందవచ్చని అంచనా.
By: Tupaki Desk | 13 May 2025 5:51 AMతమిళనాడు రాజకీయాల్లోకి కొత్తగా ప్రవేశించిన నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీకి రానున్న అసెంబ్లీ ఎన్నికలలో అనూహ్య విజయం దక్కవచ్చని ఒక సోషల్ మీడియా సర్వే అంచనా వేసింది. మూడు నెలల పాటు పలు వర్గాల నుంచి అభిప్రాయాలు సేకరించి నిర్వహించిన ఈ సర్వే ఫలితాలు ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
సర్వే వివరాల ప్రకారం, తమిళగ వెట్రి కళగం పార్టీ 2026లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో దాదాపు 95 నుంచి 105 స్థానాలలో విజయం సాధించే అవకాశం ఉందని, 34.55 శాతం ఓట్లను పొందవచ్చని అంచనా.
గత ఏడాది తన పార్టీని ప్రకటించిన విజయ్, లోక్‌సభ ఎన్నికలకు దూరంగా ఉన్నారు. పార్టీ ఆవిర్భావం తర్వాత కొంతకాలం తన సినీమా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నప్పటికీ, గత మూడు-నాలుగు నెలలుగా పార్టీ కార్యక్రమాలపై మళ్లీ దృష్టి సారించారు. ప్రజలలోకి చురుగ్గా వెళ్లేందుకు బూత్ కమిటీలను బలోపేతం చేయడం, పార్టీ పేరు, జెండాను విస్తృతంగా ప్రచారం చేయడం వంటి చర్యలు చేపడుతున్నారు. త్వరలో ఆయన ప్రజా పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ కూడా విడుదల కానుంది.
తాజాగా వెలువడిన ఈ సర్వే డీఎంకే కూటమికి 75 నుంచి 85 స్థానాలు (30.20 శాతం ఓట్లు), అన్నాడీఎంకేకు 55 నుంచి 65 సీట్లు (28.85 శాతం ఓట్లు) దక్కవచ్చని కూడా అంచనా వేసింది.
ఈ అనుకూల సర్వే ఫలితాలు తమిళగ వెట్రి కళగం శ్రేణులలో ఉత్సాహాన్ని నింపాయి. దీంతో పార్టీ కార్యకలాపాలను మరింత వేగవంతం చేశారు. ముఖ్యంగా, తమ ప్రాంతాలలో గోడ ప్రచారాలను విస్తృతం చేయడానికి చర్యలు చేపట్టారు. ఇందుకోసం ప్రైవేటు ప్రహరీ గోడలు, స్థలాలను ముందస్తుగా బుక్ చేసుకుంటున్నారని సమాచారం.
సోషల్ మీడియా వేదికగా సాగిన ఈ సర్వే ఫలితాలు ఎంతవరకు వాస్తవమనేది కాలమే చెప్పాలి కానీ, ఇవి టీవీకే పార్టీ వర్గాలలో నూతన ఉత్తేజాన్ని నింపాయని, రానున్న రోజుల్లో తమిళనాడు రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారనున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.